కాళేశ్వరం కాంక్రీట్‌ పనుల్లో రికార్డు 

Concrete Work Record In Kaleshwaram Works - Sakshi

మేడిగడ్డ బ్యారేజీలో ఒక్క రోజే 7 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వర్క్స్‌

ఇదే పట్టుదల కొనసాగించాలన్న మంత్రి హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు కాంక్రీట్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా పనుల్లో వేగం పెరిగింది. గత కొన్ని నెలలుగా మేడిగడ్డ బ్యారేజీ పనుల్లో సగటున 1,169 క్యూబిక్‌ మీటర్ల మేర పనులు జరగ్గా శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు రికార్డు స్థాయిలో 7 వేల క్యూబిక్‌ మీటర్ల మేర కాంక్రీట్‌ పనులు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతేడాది డిసెంబర్‌ 7న జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలించిన సమయానికి 77,946 క్యూబిక్‌ మీటర్ల పనులు జరిగాయని... ప్రస్తుతం నాలుగు నెలల వ్యవధిలో ఏకంగా 5,39,361 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు జరిగినట్లు నీటిపారుదలశాఖ వెల్లడించింది.

కాంక్రీట్‌ పనుల్లో వేగం పెరగడంపై మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. పనులు చేపడుతున్న ఎల్‌ అండ్‌ టీ సంస్థ, ఇరిగేషన్‌ యంత్రాంగాన్ని ఆదివారం ఓ ప్రకటనలో అభినందించారు. ఇదే పట్టుదల, వేగాన్ని కొనసాగించాలని సూచించారు. ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ, విద్యుత్, గనులు, ఇతర ప్రభుత్వశాఖలు, కాంట్రాక్టు సంస్థలు సమష్టిగా పనిచేసి గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. అతితక్కువ కాలంలోనే ప్రాజెక్టును పూర్తి చేసి ఆసియాలోనే సరికొత్త రికార్డు నెలకొల్పనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భూసేకరణ ప్రక్రియ, అంతర్రాష్ట్ర ఒప్పందాలు, కేంద్ర ప్రభుత్వ అనుమతులు, టెండర్ల ప్రక్రియ, నిర్మాణం....ఇలా అన్ని రంగాల్లోనూ కాళేశ్వరం కొత్త రికార్డులను చరిత్రలో తిరగరాస్తుందన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top