డిజిటైజేషన్‌ను 6 వారాల్లో పూర్తి చేయండి

Complete digitization in six weeks : High Court - Sakshi

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: వక్ఫ్‌బోర్డుకు చెందిన రికార్డుల డిజిటైజేషన్‌ను 6 వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డిజిటైజేషన్‌ పూర్తయిన తర్వాత ఆ రికార్డులను తిరిగి వక్ఫ్‌బోర్డుకు అప్పగించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రికార్డుల డిజిటైజేషన్‌ నిమిత్తమే వక్ఫ్‌బోర్డు కార్యాలయానికి ప్రభుత్వం సీలు వేసిన నేపథ్యంలో ప్రభుత్వ చర్యను తప్పు పట్టలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. 

వక్ఫ్‌బోర్డ్‌ రికార్డులను జప్తు చేసి, కార్యాలయానికి సీలు వేయడాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది ఎం.ఎ.కె.ముఖీద్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వక్ఫ్‌బోర్డు కార్యాలయానికి వేసిన సీలును తొలగించినట్లు తెలిపారు. కార్యాలయ కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. రికార్డులున్న గదినే తాము స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రికార్డుల డిజిటైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేసేందుకు 4 నుంచి 6 వారాల సమయం పడుతుందని చెప్పారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఖురేషీ వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంలో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. 

అధికారుల అత్యుత్సాహం వల్ల రికార్డులు తారుమారయ్యే ప్రమాదం ఉందన్నారు. అయితే ఈ వ్యవహారంలో అధికారులు అనుసరించిన విధానం తప్పు కావొచ్చేమో గానీ, ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకే రికార్డులను స్వాధీనంలోకి తీసుకుని డిజిటైజేషన్‌ చేస్తోందని పేర్కొంది. రికార్డుల డిజిటైజేషన్‌ ప్రక్రియను 6 వారాల్లో పూర్తి చేసి, రికార్డులను వక్ఫ్‌బోర్డుకు అప్పజెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top