‘రైతుబంధు’ పకడ్బందీగా అమలు చేయాలి

Collector Meeting on Raithubandhu Scheme - Sakshi

కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌

అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

ఆదిలాబాద్‌అర్బన్‌: రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి చెక్కులను పకడ్బందీగా గ్రామాల వారీగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ అన్నారు. ఎకరానికి రూ.4 వేలు ఆర్థిక పెట్టుబడి కింద ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌ నుంచి వివిధ మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మొదటి విడతగా జిల్లాలో 173 గ్రామాల్లో రూ.63.76 కోట్ల విలువైన 41,120 చెక్కులను రైతులకు అందజేస్తామని అన్నారు. గ్రామాల వారీగా షెడ్యూల్‌ సిద్ధం చేసుకోవాలని చెప్పారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం వేదికను పాఠశాలల్లో ఏర్పాటు చేసుకోవాలని, స్థలాలు లేని ప్రాంతాల్లో టెంట్లు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏయే గ్రామాల రైతులకు ఎక్కడెక్కడ చెక్కులను తీసుకోవాలో ముందుగా గ్రామాల్లో రైతులకు తెలపాలని అన్నారు. ఆయా చెక్కులను పట్టాదార్లకు మాత్రమే ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. పంపిణీ తీరును వీడియో చిత్రీకరించాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

చెక్కులను ఆయా మండల పోలీస్‌స్టేషన్‌లో భద్రపర్చాలని, పంపిణీ కానీ చెక్కులను ఆయా పోలీస్‌స్టేషన్‌లో ఉంచాలని అన్నారు. వీఆర్వోలు, వీఆర్‌ఏలు ఆర్‌వోఆర్, వన్‌–బీలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పంపిణీకి రైతు సమన్వయ సమితుల సభ్యులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని పేర్కొన్నారు. వేసవి కాలం దృష్ట్యా ఆయా పంపిణీ స్థలాల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, అందుబాటులో ఉం చుకోవాలని సూచించారు. మరిన్ని సూచనలకు ఈ నెల 17న సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదేశాలు జారీ చేయనున్నట్లు వివరించారు. పంపిణీ చేసే చెక్కులకు నగదు సమకూర్చుకోవాలన్నారు. అనంతరం ఎల్‌డీఎం ప్రసాద్‌ మాట్లాడుతూ రిజర్వు బ్యాంకు సహకారంతో నగదు నిల్వలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సంబంధిత పట్టాదారుడికి మాత్రమే నగదు చెల్లిస్తామని, పాస్‌బుక్‌ జిరాక్స్, ఆధార్, ఓటర్‌ ఐడీ కార్డు తీసుకురావాలని తెలిపారు. ఎస్‌బీఐకి చెందిన చెక్కులు ఆదిలాబాద్‌లోని ఏదైనా ఎస్‌బీఐ బ్రాంచీలో నగదు పొందవచ్చన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో లు జగదీశ్వర్‌రెడ్డి, సూర్యనారాయణ, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, బ్యాంకు మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.

మరుగుదొడ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి
ఆదిలాబాద్‌అర్బన్‌: గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌ నుంచి వివిధ మండలాల ఎంపీడీవోలు, ఇతర మండల స్థాయి అధికారులతో హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 78 గ్రామ పంచాయతీల్లో నిర్మించాల్సిన మరుగుదొడ్లను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. మొదటి ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. నిర్మాణాలకు కావాల్సిన రూ.40 లక్షల రివాల్వింగ్‌ ఫండ్‌ను మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. అనంతరం హరితహారం కార్యక్రమంపై సమీక్షించారు. గిరిజన ప్రాంతాల్లో గృహోపకరమైన మొక్కలు పెంచాలని, గ్రామాల్లో హరితహారం రిజిస్ట్రార్‌ను ప్రారంభించాలని, గ్రామాల పర్యటనలో భాగంగా పరిశీలిస్తామని తెలిపారు. మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలని, ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్‌ చేయాలన్నారు. గ్రామాల్లో పన్ను వసూళ్లు వందశాతం చేయాలని పేర్కొన్నారు. మండలాలు, గ్రామాల వారీగా మరుగుదొడ్ల నిర్మాణాలు, మొక్కల సంరక్షణ వంటి వాటిపై ఆయా గ్రామాల ఇన్‌చార్జిలు, ఎంపీడీవోలతో సమీక్షించారు. ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top