‘దివ్య’మైన ఆలోచన

Collector Divya Devarajan Innovative thought - Sakshi

పూలబొకేలకు బదులు దుప్పట్లు, శాలువాలు  

శుభాకాంక్షలు తెలపడంలో కలెక్టర్‌ దివ్య కొత్త ఒరవడి  

ఆదిలాబాద్‌అర్బన్‌: కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ పరిపాలన తీరే సెపరేటు. ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. ఏ పనిలో పాలు పంచుకున్నా.. అందులోని ప్రాధాన్యతను గుర్తించి గుర్తుండి పోయేలా ముద్ర వేయడం ఆమె ప్రత్యేకత. దొరికిన ఏ కొంత సమయాన్నైనా ప్రజలకు ఉపయోగపడేలా మలచడం కలెక్టర్‌కు ఉన్న అలవాటు. అందులో భాగంగానే 2019లో పూర్తి చేయాల్సిన లక్ష్యాన్ని కలెక్టర్‌ కొత్త ఏడాది మొదటి రోజు నుంచే ప్రారంభించారని చెప్పవచ్చు. కొత్త సంవత్సరం సందర్భంగా స్వీట్లతో వచ్చి పూలబొకేలు కలెక్టర్‌కు ఇచ్చి శుభాకాంక్షలు తెలపడం సహజం. దీంతో అధిక ధరకు కొనుగోలు చేసి తీసుకువచ్చిన పూలబొకేలు కొన్ని రోజులకు చెడిపోయి ఎక్కడో పడేయాల్సి వస్తోంది.

బొకేల వల్ల ఉపయోగం లేక పోవడంతో ఈసారి వినూత్నంగా ఆలోచించారు. తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చే ఎవరైనా సరే బొకేలకు బదులు దుప్పట్లు, బ్లాంకెట్లు, శాలువాలు, రగ్గులు తీసుకురావాలన్నారు. పేదలకు అవి పంపిణీ చేసేందుకు ఉపయోగపడుతాయనేది కలెక్టర్‌ ఉద్దేశం. మంగళవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజలు శాలువాలు, రగ్గులు, దుప్పట్లు అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. వాటిని వెనుకబడిన ప్రాంతాల్లోని పేదలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top