టార్గెట్‌ ఖరీఫ్‌ !

CM KCR Says Pallamuru-Rangareddy Bidding Project Has Been Completed By The Next Kharif - Sakshi

నాలుగు నెలల్లో కరివెన రిజర్వాయర్‌ పనిచేయాలి

నిరంతరంగా మూడు షిఫ్టుల్లో పనిచేయండి

ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టుల సమీక్షలో సీఎం కేసీఆర్‌

పనుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించబోం

విజయవంతంగా  కాళేశ్వరం.. ఇక దృష్టంతా పాలమూరు–రంగారెడ్డి మీదే

సాక్షి , మహబూబ్‌నగర్‌ : వచ్చే ఖరీఫ్‌ నాటికి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులన్నింటినీ పూర్తి చేయడంతో పాటు భవిష్యత్‌లో ఈ నీటిని సంగంబండకు సరఫరా చేసి అక్కడ్నుంచి జూరాలకు తరలించే ఆలోచనతో ఉన్నామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ ఎత్తిపోతల పథకంలో కీలకమైన కరివెన రిజర్వాయర్‌ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలకు ఆయన ఆదేశించారు. ప్రస్తుతం నడుస్తున్న పనులను మూడు షిఫ్టులకు పెంచి నిరంతరాయంగా పనులు కొనసాగించాలన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న కృష్ణా, గోదావరి జలాలను ఇరు రాష్ట్రాలు పూర్తి స్థాయిలో వాడుకునేలా రెండు నదులను అనుసంధానం చేస్తామని, దీనిద్వారా మహబూబ్‌నగర్‌తో పాటు వికారాబాద్, నల్లగొండ (పాక్షికం) జిల్లాకు తాగు, సాగు నీటితో పాటు హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలు తీరుతాయన్నారు. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సుముఖంగా ఉన్నారని చెప్పిన కేసీఆర్‌ త్వరలోనే చర్చలు జరిపి జలాల వినియోగంపై ఓ ఒప్పందానికి వస్తామన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనలో భాగంగా సీఎం కేసీఆర్‌ గురువారం పాలమూరు, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలో పర్యటించారు. ఆయా జిల్లాల్లో కొనసాగుతున్న కరివెన, నార్లాపూర్, వట్టెం, ఏదుల రిజర్వాయర్ల పనులను పరిశీలించారు.

ఏదుల రిజర్వాయర్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. గత పాలకుల అసమర్థత, వివక్ష కారణంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టు పనులు ఆగిపోయి తాగు, సాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. ‘కొంతమంది చవటలు జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు తీసుకురావాలని చెబుతున్నరు. అసలు వాళ్లకు ప్రాజెక్టులపై అవగాహన లేదు. జూరాల 6 టీఎంసీల ప్రాజెక్టు.. దాని కింద ఉన్న నెట్టెంపాడు, జూరాల సొంత ఆయకట్టు, భీమా, గట్టు, కోయిల్‌సాగర్‌ కింద సుమారు 4లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించడంతో పాటు మిషన్‌ భగీరథ కోసం 3.37 టీఎంసీల నీళ్లు అవసరముంటది.

ఇందుకోసం 71.1% నీటిని వాడుకుంటున్నం. జూరాలలో నీళ్లు లేకపోతే ఆయా ప్రాజెక్టుల ఆయకట్టుకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చలేని పరిస్థితి. ఇప్పుడే జూరాలకు నీరు రాక ప్రతి ఏటా కర్ణాటకను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు నీళ్లు ఎక్కడొస్తయ్‌? అందుకే శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ను పాలమూరు–రంగారెడ్డికి వాడుకుంటున్నం’ అని సీఎం అన్నారు. వచ్చే ఖరీఫ్‌ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి జిల్లాలో 15–20 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చి పాలమూరును సస్యశ్యామలం చేస్తామన్నారు. ఎన్నో శక్తులు తమను అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. ఆ ఆటంకాలను ఎదుర్కొని కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసుకున్నామని.. అదే స్ఫూర్తితో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. 
 
చంద్రబాబు సాధించింది శూన్యమే ! 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు లాభం కలిగించే గోదావరి, కృష్ణా జలాల అనుసంధానం విషయంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సంకుచితంగా ఏదేదో మాట్లాడుతున్నారని కేసీఆర్‌ మండిపడ్డారు. ‘గతంలో బాబ్లీ విషయంలోనూ ఇలాంటి గొడవే. సాధించింది గుండు సున్నా. ఎక్కడ ప్రాజెక్టు అన్నా.. బస్తీమే సవాల్‌ అనడం.. కోర్టుకెళ్లడం.. హంగామా చేయడం తప్ప సాధించిందేం లేదు. అదే మేం అధికారంలో వచ్చిన తర్వాత మహారాష్ట్రకు పొయి బాబ్లీ విషయంలో అగ్రిమెంట్‌ చేసుకుంటే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. బ్రహ్మాండంగా 570 టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఏర్పడింది. చంద్రబాబు లేదా ఆయనలాగా ఆలోచించేవారికి ఇప్పుడు ఒక్కటే చెబుతున్న రేపు కృష్ణా, గోదావరి జలాల అనుసంధానం విషయంలో నీటి వినియోగంపై పూర్తిస్థాయిలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పందానికి వచ్చిన తర్వాతే పనులు ప్రారంభిస్తాం’అని కేసీఆర్‌ స్పష్టంచేశారు. 
 
పనులపై అసంతృప్తి 
ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని 4రిజర్వాయర్ల వద్ద జరుగుతున్న పనులను సీఎం పరిశీలించారు. ఇప్పటి వరకు జరగాల్సిన పనులెంత? అయిన పనులెన్ని? పనుల జాప్యానికి కారణాలంటేని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆశించిన మేరకు పనులు జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై మూడు షిఫ్టుల్లో పనులు పూర్తిగా చేపట్టి.. వచ్చే ఖరీఫ్‌ నాటికి నీరందించాలన్నారు. కరివెన ప్రాజెక్టు పనులపై కేసీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో చెప్పండి? చేతకాకపోతే పక్కకు తప్పుకోండి. పనులు చేసేందుకు చాలా మంది క్యూలో ఉన్నారు’అని అసహనం వ్యక్తంచేశారు. వచ్చే 4నెలల్లో కరివెన పనులు పూర్తి కావాలని కాంట్రాక్టర్‌తో పాటు సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం ఏదుల రిజర్వాయర్‌ పరిశీలించిన అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.10వేల కోట్ల రుణం మంజూరైందన్నారు. నిధులకొరత లేనందున.. ఎప్పుడేం కావాలన్నా చెప్పాలని.. ఉదయం ఇండెంట్‌ పెడితే సాయంత్రాని కల్లా బిల్లులు మంజూరు చేస్తామని అన్నారు. ‘మీరు బిల్లులకు ఆందోళన చెందాల్సిన పనిలేదు. పొద్దున బిల్లులు పెడితే సాయంత్రానికి క్లియర్‌చేసే బాధ్యత నాది. వర్క్‌ ఫోర్స్‌ పెంచుకోండి. పని షిఫ్ట్‌లు పెంచుకోండి. అధికారులు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. నాలుగున్నర నెలల టార్గెట్‌ పెట్టుకొని.. అంతకు ముందే పని పూర్తిచేయండి’అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అవసరమైతే ఇకపై పదిహేను రోజులకోసారి సమీక్ష నిర్వహిస్తానన్నారు. పనుల పర్యవేక్షణలో అలసత్వం ప్రదర్శించే ఇంజనీర్లపై చర్యలుంటాయని వార్నింగ్‌ ఇచ్చారు. అవసరమైతే పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే కాంట్రాక్టర్ల టెండర్లను రద్దు చేసి ఇతరులకు పని కల్పించాలన్నారు. 
 
వారంలో వట్టెం పూర్తవ్వాలి 
16.7 టీఎంసీ సామర్థ్యంతో నిర్మిస్తున్న వట్టెం రిజర్వాయర్‌ పనులను వారం రోజుల్లో మూడు షిఫ్టుల్లో పూర్తి చేయాలని పనులు దక్కించుకున్న మూడు నిర్మాణ సంస్థలకు సీఎం ఆదేశించారు. ఇందుకు అవసరమైన కార్మికులను రప్పించుకోవాలని కోరారు. రివిట్మెంట్‌ పనులను వచ్చే మార్చిలోపే పూర్తిచేయాలని ఆదేశించారు. రిజర్వాయర్, పంప్‌ హౌస్‌ పనులను సమాంతరంగా పూర్తిచేయాలన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం రిజర్వాయర్‌ పనులను ఏరియల్‌వ్యూ ద్వారా పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం పనులకు సంబంధించి తక్షణమే రూ.200 కోట్ల నిధులు విడుదల చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో పనులు ఆగొద్దని స్పష్టం చేశారు. ఇప్పటికే 100% నిర్మాణం పూర్తి చేసుకున్న ఏదుల రిజర్వాయర్‌లో ఇతర మార్గాల ద్వారా నీటిని తెచ్చి నింపుకోవాలని, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటిని నింపే అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. నీటిని ఎత్తిపోసేందుకు కాళేశ్వరం మాదిరి ఇక్కడ కూడా బాహుబలి పంపు మోటార్లను వినియోగించనున్నారు. వాటిని బయటనుంచి కాకుండా వీలైనంతవరకు బీహెచ్‌ఈఎల్‌ కంపెనీ ద్వారానే కొనుగోలు చేయాలి అని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధి మెగా కృష్ణారెడ్డికి ముఖ్యమంత్రి సూచించారు.  
 
రైతుల కోసం ఎంతైనా వెచ్చిస్తాం! 
సమైక్య పాలనలో తీవ్ర ఇబ్బందులు పడ్డ తెలంగాణ రైతుల కోసం ఎన్ని నిధులైనా వెచ్చిస్తానని సీఎం స్పష్టంచేశారు. ‘ప్రస్తుతం ప్రతి రైతు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నడు. రైతు ఆర్థికంగా బలపడాలంటే మరో ఎనిమిదేళ్లు కూడా పట్టొచ్చు. తర్వాత ప్రతి రైతు బ్యాంకుఖాతాలో సొంతగా నగదు జమ కావాలి. అప్పటి వరకు కచ్చితంగా ఉచిత కరెంటందిస్తాం. అందుకోసం రూ.15వేల కోట్లయినా ఖర్చు చేస్తాం. ఇప్పటికే నీటి తీరువా రద్దు చేశాం. ఇది మా పాలసీ.. మా పార్టీ సిద్ధాంతం.. ప్రభుత్వ సిద్ధాంతం’అని సీఎం అన్నారు. ఇకపై సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ పాలమూరు–రంగారెడ్డి పనుల పురోగతిపై ప్రతి 10రోజులకోసారి వచ్చి సమీక్ష జరుపుతారని సీఎం తెలిపారు. ఉమ్మడి పాలమూరు–రంగారెడ్డి ఎమ్మెల్యేలు, ఎంపీలు చర్చించి తమ అభిప్రాయాలను ఆమెకు తెలియచేయాలని సూచించారు.

కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పార్లమెంటు సభ్యులు పి.రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అబ్రహం, పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్‌ జిల్లాల కలెక్టర్లు శ్వేతామహంతి, శ్రీధర్, రొనాల్డ్‌రోస్, ఈఎన్‌సీ మురళీధర్, సీఈ రమేష్, మెగా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మిషన్‌ భగీరథ పనుల పురోగతిపై సంబంధిత ఈఎన్‌సీ కృపాకర్‌ రెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. అతి త్వరలో ట్యాంకుల నిర్మాణం, అంతర్గత పైపుల నిర్మాణం సంపూర్ణంగా పూర్తిచేసి తాగునీటిని అందించాలని ఆదేశించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top