రెవెన్యూ ఉద్యోగులకు కేసీఆర్‌ గిఫ్ట్‌ | Sakshi
Sakshi News home page

రెవెన్యూ ఉద్యోగులకు కేసీఆర్‌ గిఫ్ట్‌

Published Sat, Feb 24 2018 7:24 PM

CM KCR Bumper Bonanza for Telangana Revenue Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బంపర్‌ బొనాంజా ప్రకటించారు. వారికి ప్రోత్సాహకంగా ఒక నెల మూల వేతనాన్ని ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. భూ రికార్డుల ప్రక్షాళనలో ప్రత్యక్షంగా పాల్గొన్న 10,809 మంది రెవెన్యూ ఉద్యోగులు, 24,410 మంది విఏఓలు, 530 మంది సర్వే విభాగం ఉద్యోగులు కలిపి మొత్తం 35,749 మందికి ఒక నెల మూల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం, కొత్త పాసు పుస్తకాల పంపిణీపై ప్రగతిభవన్‌ లో శనివారం సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ‘దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం వంద రోజుల వ్యవధిలోనే రెవెన్యూ ఉద్యోగులు రేయింబవళ్లు పనిచేసి భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.’ అని అభినందించారు. ‘దాదాపు 80 ఏళ్లుగా భూరికార్డుల నిర్వహణ సరిగా లేదు. క్రయవిక్రయాలు, యాజమాన్యంలో వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు నమోదు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. భూరికార్డులు గందరగోళంగా మారిన పరిస్థితుల్లో పెట్టుబడి సాయం పథకం అమలు చేసేందుకు ఏ భూమికి ఎవరు యజమానో ఖచ్చితంగా తేలాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో భూ రికార్డులను సరిచేసి, పూర్తి పారదర్శకంగా పథకం అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కేవలం వంద రోజుల్లోనే రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు గ్రామాల్లో తిరిగి, రైతులతో మాట్లాడి భూమి యాజమాన్య హక్కులపై స్పష్టత తెచ్చారు. సొంత భూములున్న రైతులతో పాటు, అసైన్డ్‌ దారులన కూడా ఓ కొలిక్కి తెచ్చారు. రాష్ట్రంలో పంచిన 22.5 లక్షల ఎకరాల భూమికి గాను 20లక్షల ఎకరాల విషయంలో స్పష్టత వచ్చింది. రెండున్నర లక్షల ఎకరాల విషయంలో స్పష్టత కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములు, అటవీ–రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములు మినహాయిస్తే మిగతా భూములు కూడా క్లియర్‌ అయ్యాయి. ఇది సాధారణ విషయం కాదు. దేశంలో ఎవరూ సాధించని ఘనత రెవెన్యూ ఉద్యోగులు సాధించారు. వారికి ప్రోత్సాహకరంగా ఉండేందుకు ఒక నెల మూల వేతనాన్ని అదనంగా అందిస్తాం’ అని సీఎం ప్రకటించారు.

Advertisement
Advertisement