‘అవంతి’ని అప్రోచ్‌ అయ్యారు!

Cloning Gang Approach Avanthi Colleges For Biometric Fraud - Sakshi

టీడీపీ ఎంపీ కళాశాలను సంప్రదించిన ‘క్లోనింగ్‌ గ్యాంగ్‌’ 

ఆయన సోదరుడికి చెందిన నోవా కాలేజీతోనూ టచ్‌ 

మొత్తం ఐదు కాలేజీల పేర్లు బయటపెట్టిన నిందితులు 

నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్న సీసీఎస్‌ పోలీసులు 

నకిలీ వేలిముద్రలతో బయోమెట్రిక్‌ను ఏమార్చిన ముఠా

సాక్షి, హైదరాబాద్‌: కళాశాలల్లో హాజరు లెక్కింపునకు సంబంధించి జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజికల్‌ యూనివర్సిటీ (జేఎన్టీయూ) అమలులోకి తీసుకువచ్చిన బయోమెట్రిక్‌ వ్యవస్థనే ఏమారుస్తూ వేలిముద్రల్ని క్లోనింగ్‌ చేసిన గ్యాంగ్‌ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీరు సంప్రదించిన కాలేజీల్లో వివేకానంద గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌తో పాటు తెలుగుదేశం పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్‌)కు చెందిన అవంతి ఇంజనీరింగ్‌ కాలేజీ, ఆయన సోదరుడు ముత్తంశెట్టి కృష్ణారావుకు చెందిన నోవా ఇంజనీరింగ్‌ కాలేజీ ఉన్నాయి. వీటితో పాటు కోదాడలోని గేట్, కిట్స్‌ సంస్థలతోనూ వీరు సంప్రదింపులు జరిపారని గుర్తించారు. అయితే వివేకానంద కాలేజీలా మిగిలిన వాటికి నకిలీ వేలిముద్రలు తయారు చేసి ఇచ్చారా? అనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. వేలిముద్రల క్లోనింగ్‌ కేసు దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులు అవంతి కాలేజీతో పాటు మిగిలిన వాటికి నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నారు.  

జేఎన్టీయూ నిబంధనల కఠినతరంతో... 
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన బొమ్మ రామకృష్ణ పీహెచ్‌డీ చేస్తూ అక్కడి స్వర్ణాంధ్ర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేసేవాడు. కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన పి.శ్రీరామ్‌ ప్రసాద్‌ 2014–17 మధ్య బాటసింగారంలోని నోవా ఇంజనీరింగ్‌ కాలేజీలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా పని చేశాడు. అప్పట్లో రామకృష్ణ సైతం కొన్నాళ్ల పాటు ఇదే కాలేజీలో పని చేయడంతో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్‌ తదితర కాలేజీల్లో ప్రతి 15 మంది విద్యార్థులకో అధ్యాపకుడు ఉండాలి. అయితే అనేక కాలేజీలు దీన్ని పాటించలేకపోతున్నాయి. బోగస్‌ అ«ధ్యాపకులు, విద్యార్థుల ఘటనల నేపథ్యంలో జేఎన్టీయూ బయోమెట్రిక్‌ హాజరు విధానం అవలంభిస్తోంది.
 
క్లోనింగ్‌ చేశారిలా... 
రామకృష్ణ సూచనతో శ్రీరామ్‌ ఓ ప్లాస్టిక్‌ కోటింగున్న కాగితంపై గ్లూ గన్‌తో ప్రొఫెసర్ల వేలిముద్ర సేకరిస్తా డు. దీని ఆధారంగా రామకృష్ణ ఒక్కో బోగస్‌ అధ్యాపకుడికి సంబంధించి నాలుగు సెట్ల క్లోన్డ్‌ వేలిముద్రల్ని తయారు చేసేవాడు. ఆయా కళాశాలల యాజమాన్యా లు ప్రతి రోజూ ఈ వేలిముద్రల అచ్చుల్ని బయోమెట్రిక్‌ మిషన్‌లో వేలు పెట్టాల్సిన చోట పెట్టేవి. ఇలా ఆ వ్యక్తి హాజరైనట్లు సర్వర్‌లో నమోదయ్యేలా చేసేవారు.  

కాలేజీలతో ఒప్పందాలు చేసుకుని... 
జేఎన్టీయూ అఫిలియేటెడ్‌ కాలేజీల్లో ఉన్న బయోమెట్రిక్‌ మిషన్‌ జేఎన్టీయూలో ఉన్న సర్వర్‌తో కనెక్ట్‌ అయి ఉంటుంది. దీంతో కాలేజీ యాజమాన్యాలు సిబ్బంది, విద్యార్థుల హాజరును ‘మేనేజ్‌’ చేయలేకపోయాయి. దీన్ని గుర్తించిన రామకృష్ణ వేలిముద్రలు క్లోనింగ్‌ చేసే విధానం తెలుసుకుని శ్రీరామ్‌ప్రసాద్‌తో జట్టుకట్టాడు. హైదరాబాద్‌లోని కాలేజీలతో ఒప్పందాలు చేసుకునే శ్రీరామ్‌ అవసరమైన ఫింగర్‌ప్రింట్స్‌ ఆర్డర్‌ను రామకృష్ణకు పంపించడం చేసేవాడు. ఎంటెక్‌ పూర్తి చేసి వేర్వేరు చోట్ల ఉద్యోగాలు చేస్తున్న వారిని యాజమాన్యాలు అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా ఎన్‌రోల్‌ చేసేవారు. వీరు కాలేజీకి వచ్చినప్పుడు శ్రీరామ్‌ వారి వేలిముద్రలు బయోమెట్రిక్‌ మిషన్‌లో లోడ్‌ చేసేవాడు. 

రీయింబర్స్‌మెంట్‌ ‘సృష్టించారా’?
ఈ గ్యాంగ్‌ను ఇటీవల హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో రామకృష్ణ, శ్రీరామ్‌తో పాటు బాటసింగారంలో ఉన్న వివేకానంద కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌ పోరెడ్డి సుదర్శన్‌రెడ్డిని అరెస్టు చేశారు. సైదాబాద్‌ ఠాణాలో నమోదైన ఈ కేసును దర్యాప్తు నిమిత్తం సీసీఎస్‌కు బదిలీ చేశారు. సుదర్శన్‌ తమ సంస్థలో పని చేస్తున్నట్లు 29 మంది వేలిముద్రల్ని వీరితో తయారు చేయించాడు. ఈ గ్యాంగ్‌ విచారణలోనే అవంతి, నోవా, గేట్, కిట్స్‌ కాలేజీలను అప్రోచ్‌ అయినట్లు తేలింది. కేవలం సంప్రదించారా.. లేక వారికీ ఏవైనా అక్రమాలకు సహకరించారా.. అన్నదానిపై దృష్టి పెట్టారు. ఆయా కాలేజీలకు నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నారు. ఈ గ్యాంగ్‌ ‘నకిలీ విద్యార్థుల్నీ’తయారు చేసిందనే అనుమానాలున్నాయి. ఇతర వర్సిటీలకు అనుబంధంగా ఉన్న కళాశాలల్లో చదువు తున్న విద్యార్థులతోనూ కళాశాల యాజమాన్యాలు ఒప్పందాలు చేసుకున్నాయని, వీరి వేలిముద్రల ఆధారంగా ఫీజు రీ–యింబర్స్‌మెంట్‌ పొందారనే ఆరోపణలపైనా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top