వృత్తి.. ప్రవృత్తి నృత్య కీర్తి

Classic Dancer Subhashini Special Chit Chat With Sakshi

భరతనాట్య కళాకారిణిగా రాణిస్తున్న సీఏ సుభాషిణి గిరిధర్‌  

రెండు దశాబ్దాలకు పైగా నృత్యంతో మమేకం   

ఆమె వృత్తి సీఏ... ప్రవృత్తి నాట్యం. రెండు దశాబ్దాలకుపైగా భరతనాట్య సాధన చేస్తున్నారు. దేశవిదేశాల్లో ఎన్నోప్రదర్శనలిచ్చారు.. ప్రశంసలు అందుకున్నారు. ఓవైపు చార్టడ్‌ అకౌంటెంట్‌గా రాణిస్తూనే.. నృత్య కీర్తిని చాటుతున్నారు. మరోవైపు పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ సేవాపథంలో ముందుకెళ్తున్నారు. ఆమే సుభాషిణి గిరిధర్‌. సెప్టెంబర్‌ 1నరవీంద్రభారతిలో ప్రదర్శన ఇవ్వనున్న సుభాషిణి కళా
ప్రస్థానమిది...  

సాక్షి, సిటీబ్యూరో  : సుభాషిణి గిరిధర్‌ది నగరంలోని కొండాపూర్‌. తండ్రి విజయరాఘవన్‌ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో వివిధ రాష్ట్రాల్లో చదివి... చివరికి నగరంలో స్థిరపడ్డారు. అమ్మ లక్ష్మీ మంచి గాయని, సంగీత విద్వాంసురాలు. తమిళంలో ఎన్నో భక్తి పాటలు పాడడంతో పాటు స్వరపరిచారు. తల్లి పరంపరలో సుభాషిణి భరతనాట్య కళలో ప్రవేశించారు. సుభాషిణి అక్క సుగుణ బ్యాంకు ఉద్యోగి. సీఏ చేయాలని అక్క ప్రోత్సహించగా అటువైపు అడుగులేశారు. అలా 1995లో సీఏ పూర్తి చేశారు. చార్టడ్‌ అకౌంటెంట్‌గా నగరంలోని ప్రముఖ కంపెనీల్లో పని చేశారు. ప్రస్తుతం సొంతంగా సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. సీఏ అర్హత పరీక్షకు సంబంధించి ఉచితంగా శిక్షణనిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సీఏ సదస్సుల్లో పాల్గొని పరిశోధన పత్రాలు సమర్పించారు.  

రెండింటిలోనూ...  
సీఏ సవాళ్లతో కూడుకున్న వృత్తి. అలాంటి వృత్తిలో రాణిస్తూనే అంతర్జాతీయగా నృత్యకారిణిగా ఎదిగారు సుభాషిణి గిరిధర్‌. వృత్తి, ప్రవృత్తిని సమన్వయం చేసుకుంటూ రెండింటిలోనూ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌కపూర్, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు సంజయ్‌ సుబ్రమణ్యం, హరికథ కళాకారిణి విశాఖ హరి తదితర ఎందరో సీఏ చేసినా... తమకు ఇష్టమైన రంగాల వైపు మళ్లి ప్రత్యేకతను చాటుకున్నారు. కానీ సుభాషిణి గిరిధర్‌ ప్రముఖ కార్పొరేట్‌ కంపెనీలకు సీఏగా పనిచేస్తూనే భరతనాట్య కళాకారిణిగా పేరు తెచ్చుకున్నారు. వృత్తి, కుటుంబ పరంగా ఒత్తిళ్లు ఎదురైనా నాట్యాన్ని విడిచి పెట్టలేదు.

‘సుగుణ నృత్యాలయ’ ఏర్పాటు...   
సుభాషిణి తన సోదరి సుగుణ పేరుతో నృత్య శిక్షణాలయాన్ని ప్రారంభించారు. లాభాపేక్ష లేకుండా నామమాత్ర ఫీజుతో ఔత్సాహికులకు భరతనాట్యంలో శిక్షణనిస్తున్నారు. ఆ ఫీజుతోనూ పేద విద్యార్థులకు దుస్తులు, విద్యా ఉపకరణాలు అందిస్తున్నారు. ప్రస్తుతం సంపాదిస్తున్న మొత్తంలో సగ భాగం పేదింటి అమ్మాయిల చదవుకు వెచ్చిస్తున్నారు. సుభాషిణి ప్రతిభ, సేవను గుర్తించిన ఐసీఏఐ (ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టడ్‌ అకౌంటెంట్‌ ఇండియా) దేశంలో సీఏ కొనసాగిస్తూ  ఇతర రంగాల్లో రాణిస్తున్న జాబితాలో సుభాషిణికి చోటు కల్పించడం విశేషం.

సెప్టెంబర్‌ 1న ప్రదర్శన  
సుగుణ నృత్యాలయ 28వ వార్షికోత్సవం సెప్టెంబర్‌ 1న రవీంద్రభారతిలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సుభాషిణి గిరిధర్‌... శిష్యులతో నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు.    

హ్యాపీగా ఉంది..  
సీఏ, శాస్త్రీయ నృత్యం పొంతనలేని రంగా లు. ఈ రెండింటిలోనూ రాణించడం చాలా కష్టం. అది క్రమశిక్షణ, అంకితభావంతోనే సాధ్యం. నేను సీఏ కంటే నృత్యం నేర్చుకోవడానికే ఎక్కువ సమయం, శ్రమ వెచ్చించా ను. ఐసీఏఐ లోగో (రెక్కలు విప్పిన గరుడ పక్షి) ప్రత్యేకతను తెలియజేస్తూ నృత్యరూప కం ప్రదర్శించాను. మోకాళ్లకు శస్త్ర చికిత్స జరిగినా... ఇప్పటికీ నాట్యంలో రాణిస్తున్నందుకు ఆనందంగా ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top