బాల్యానికి మూడు ముళ్లు | Sakshi
Sakshi News home page

బాల్యానికి మూడు ముళ్లు

Published Wed, Mar 2 2016 1:36 AM

బాల్యానికి మూడు ముళ్లు

సర్, నాకు ఇష్టం లేకపోయినా పెళ్లి జరిపిస్తున్నారు. ఎట్లయినా సరే పెళ్లి ఆపించండి...నేను చదువుకుంటానని మా అమ్మా..నాన్నలకు చెప్పినా ఫలితం లేకుండాపోయింది. అందుకే మీకు ఫోన్ చేసినా.. అంటూ ఫిబ్రవరి 11న నర్వ మండలంలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక ఎస్పీకి ఫోన్ చేసింది. దీంతో పోలీసులు  ఆ గ్రామానికి చేరుకుని బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పెళ్లి ఆపించారు.
 
‘‘నేను చదువుకుంటా. చిన్న వయస్సులోనే పెళ్లి చేసి బరువు బాధ్యతలు నాపై పెట్టవద్దు.’’ అంటూ బిజినేపల్లికి చెందిన బాలిక (15) ఫిబ్రవరి 27న స్థానిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బంది బాలిక తల్లిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
 దీంతో పెళ్లి ఆగిపోయింది.

 
జిల్లాలో పెరిగిపోతున్న బాల్య వివాహాలు
10నెలల్లో 88 వివాహాలను అడ్డుకున్న అధికారులు
తెలియకుండా జరుగుతున్నవి వందల సంఖ్యలో
పేదరికం, అవగాహన లేమి, కుటుంబ పరిస్థితులే కారణం
నారాయణపేట, మక్తల్, నాగర్‌కర్నూల్, అచ్చంపేటలో అధికం
చిన్నవయస్సులో పెళ్లితో అనేక అనర్థాలంటున్న డాక్టర్లు
బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం రెండేళ్ల జైలు
నాలుగేళ్లలో 338 వివాహాలను అడ్డుకున్న అధికారులు

 
ఇలా ధైర్యంగా బాలికలు బయటికి వచ్చి ఫిర్యాదు చేసి బాల్య వివాహాలు నిలిచిపోయిన ఘటనలు కొన్నే.. కానీ మారుమూల గ్రామాల్లో వివాహాలు ఎవరికీ సమాచారం లేకపోతుండడంతో జరిగిపోతున్నాయి. ఇటు పేదరికం..అటు ఇంటి పరిస్థితులు.. 14ఏళ్లు కూడా దాటని పుత్తడిబొమ్మలను పెళ్లిపీటల వైపు అడుగేసేలా చేస్తున్నాయి. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను తల్లిదండ్రులకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
ప్రస్తుతం మహిళలు ఓ వైపు అన్ని రంగాల్లో దూసుకెళ్తూ తమదైన ముద్ర వేస్తుంటే.. మరోవైపు వెనుకబడిన ప్రాంతాల్లో ప్రగతికి దూరంగా అక్షర ఫలాలు నోచుకోకుండా మూఢనమ్మకాల్లో మగ్గిపోతున్నారు. తల్లిదండ్రుల్లో అవగాహన లేమి.. ఆడపిల్లలను బాధ్యతగా కాకుండా బరువుగా భావిస్తుండటంతో జిల్లాలో బాల్యవివాహాలు అధికంగా జరుగుతున్నాయి. దీంతో చిట్టి తల్లుల భవిత మూడు ‘ముళ్ల’లో బందీ అవుతోంది.                                   - మహబూబ్‌నగర్ క్రైం
 
ఎంత నాగరికత మారినా గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావడం లేదు. పేదరికానికి తోడు ఆడ పిల్లలకు త్వరగా పెళ్లి చేసి బరువును తగ్గించుకోవాలనే ఆలోచిస్తున్నారు. 14ఏళ్లు కూడా దాటని పుత్తడి బొమ్మలను పెళ్లిపీటల వైపు అడుగులు వేయిస్తున్నారు. ఆడ పిల్లలకు 18ఏళ్లు వచ్చేవరకు ఆగకుండా వివాహాలు చేస్తూ వారి జీవితాన్ని అగమ్యగోచరంగా తయారుచేస్తున్నారు. జిల్లాలో ఇటీవల బాల్యవివాహాలు అడ్డుకున్న సంఘటనలు చాలా జరిగాయి. ముఖ్యంగా మద్దూరు మండలం రేనివట్లలో ఐదు, చింతలదిన్నెలో ఏడు, గోపాల్‌పేట మండల ఎదులలో  ఆరు, రేవల్లిలో మూడు, పెబ్బేరు మండలం కంచిరావుపల్లిలో మూడు, దామరగిద్ద మండలం బాపన్‌పల్లిలో మూడు, గట్టులో రెండు, తెలకపల్లిలో రెండు బాల్యవివాహాలను అడ్డుకున్నారు.
 
రూ.లక్ష జరిమానా.. రెండేళ్ల జైలు  
బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం ఈ వివాహాలు చేయడం అత్యంత నేరం. ఇలా చేస్తే రెండేళ్ల కారాగార శిక్ష విధిస్తారు. లేదా లక్ష రూపాయల జరిమానాతో పాటు శిక్ష విధించే అవకాశం ఉంది. నాలుగేళ్లుగా జిల్లాలో దాదాపు 338 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. 2012-2014 మధ్య కాలంలో 250వివాహాలను అడ్డుకున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 88 బాల్యవివాహాలను అడ్డుకుని, ఆ చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కొన్ని నియోజకవర్గాల్లో 14ఏళ్లు సైతం నిండని చిన్నారులకు పెళ్లి చేసేస్తున్నారు. జిల్లాలో నారాయణపేట, కొడంగల్, మక్తల్, అచ్చంపేట, గద్వాల, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో అత్యధికంగా బాల్యవివాహాలు జరుగుతున్నాయి.
 
జోగిని వ్యవస్థ..
జిల్లాలో అమాయక ఆడపిల్లలను జోగినీలుగా మారుస్తూ వాళ్ల హక్కును కాలరాస్తున్నారు. జోగిని అంటే ఒక ఆడపిల్లను దేవుడి పేరుతో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తాళి కట్టి ఆ గ్రామంలో వదిలిపెడతారు. ఇలాంటి వాళ్లను గ్రామంలో ఎవరైనా లైంగికంగా వాడుకోవచ్చు అనేది ఆ గ్రామ మూఢనమ్మకం. జిల్లాలో జోగినీలుగా మారిన ఆడపిల్లలు 1200మంది ఉన్నారు. ముఖ్యంగా నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలలో జోగిని వ్యవస్థ అధికంగా ఉంది. జోగినీలుగా మారిన ఆడపిల్లలను ఎవరైన వ్యక్తులు ముందుకు వచ్చి ఆదర్శ వివాహాలు చేస్తుకున్న వారికి సైతం ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు. ముఖ్యంగా జోగినీలుగా మారిన మహిళలకు పుట్టిన పిల్లల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
 
పోలీసుల శాఖ నుంచి శూన్యం..
జిల్లాలో బాల్య వివాహాలపై పోలీస్ శాఖ నుంచి చేయాల్సిన కౌన్సెలింగ్, ఇతర చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం లేదు. చాలా సందర్భాల్లో గ్రామల్లో బాల్యవివాహాలు జరుగుతున్నాయని సమాచారం వచ్చినా కూడా పోలీస్ శాఖ నుంచి సకాలంలో స్పందన రావడం లేదు.  
 
వచ్చే సమస్యలు..

తెలిసి తెలియని వయసులో పెళ్లి చేసుకుంటే పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గర్భసంచి ఎదుగుదల ఉండకపోవడం, మాతా శిశు మరణాలు సంభవించడం, రక్తహీనత అధికం కావడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. పుట్టింటి వాతావరణం నుంచి అత్తింటి వాతావరణంలో ఇమడలేక కుటుంబ సమస్యలతో సతమతమవుతుంటారు. మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో కలతలు, బలవన్మరణాలు పెరిగే ఆస్కారముంటుంది.  
 
పునరావాసం ఇలా..
బాల్యవివాహాలను అడ్డుకున్న సమయంలో సదరు బాలికలకు రక్షణ కల్పించేలా వారిని అందుబాటులో ఉన్న కస్తూర్బా పాఠశాలల్లో చేర్పించడం, చదువుపరంగా వసతి గృహాల్లో, వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో చేర్పించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. బాలికల వయసు ఆధారంగా బాలసదనం, శిశుగృహాల్లో చేర్పించడం చేసి వారికి ఇష్టమైన భవిష్యత్‌లో ఆత్మస్థైర్యంతో మనుగడ సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
 
ప్రత్యేక బృందాల ఏర్పాటు

స్వేచ్ఛగా విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన వయసులో పెళ్లి పేరుతో నిర్బంధం విధించడాన్ని నేరంగా పరిగణించి బాల్య వివాహాలను నిషేధించిన ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు రూపొందించింది. అయినా అది సరిగా అమలుకు నోచుకోకపోవడంతో, దీనిని గుర్తించి స్త్రీ శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెండేళ్ల కిందట సమగ్ర బాలల పరిరక్షణ పథకాన్ని(ఐసీపీఎస్) రూపొందించింది. ఇదీ ఐసీడీఎస్‌కు అనుసంధానంగా పని చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఈ పథకం కింద నియమించింది. ఈ బృందాలు ప్రజలతో మమేకమై ఎన్జీఓల సహకారంతోగ్రామాల్లో బాల్య వివాహాల పట్ల అవగాహన కల్పిస్తుంది.
 
అవగాహనతో పాటు చర్యలు..
జిల్లాలో పోలీస్ శాఖ నుంచి బాల్య వివాహాలు జరగకుండా అవసరమైన నిఘా ఏర్పాటు చేశాం. బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే, సంబంధిత పరిధిలో ఉన్న పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులతో పాటు పిల్లలకు కూడా ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడా బాల్య వివాహాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం.
- డీవీ శ్రీనివాసరావు, ఏఎస్పీ
 
ఆరోగ్య సమస్యలెన్నో..

అమ్మాయిలకు చిన్నతనంలోనే పెళ్లి చేస్తే ఆరోగ్యపరంగా అనేక సమస్యలు వస్తాయి. వివాహంపై ఏమాత్రం వారికి అవగాహన ఉండదు. చిన్న వయసులో భర్తతో కలవడం వల్ల ఆరోగ్యపరంగాా సమస్యలు వస్తాయి. 14నుంచి 18ఏళ్ల లోపు గర్భం దాల్చితే పిండం సక్రమంగా ఎదుగుదల ఉండదు. చాలా మందికి శిశువులు పురిట్లో చనిపోవడం, విటమిన్ లోపంతో పాటు బరువు తక్కువగా పుట్టడం జరుగుతాయి. ముఖ్యంగా బాల్య వివాహాలు చేసుకున్న అమ్మాయిలకు దినాలు కాకముందే పిల్లలు పుట్టడం, రక్తం తక్కువ ఉండటం వల్ల శిశువులు మృతి చెందుతారు.
- డాక్టర్ మీనాక్షి, సీనియర్ గైనకాలజిస్టు, ఆస్పత్రి డీసీహెచ్‌ఓ
 
అవగాహన కల్పిస్తున్నాం

జిల్లాలో కొన్ని నియోజకవ ర్గాల్లో బాల్యవివాహాలు అధికంగా జరుగుతున్నాయి. వాటిపై దృష్టి సారిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. శాఖాపరంగా మాకు వచ్చిన సమాచారంతో ఆయా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి మాట్లాడి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అమ్మాయిలు చదువుకుంటామంటే రాష్ట్ర సదనం, ప్రభుత్వ హస్టళ్లలో వసతి ఏర్పాటు చేస్తున్నాం.
- జ్యోత్స్న, ఐసీడీఎస్ పీడీ

Advertisement
 
Advertisement
 
Advertisement