బుగ్గిపాలవుతున్న బాల్యం!

Child Labor Cases In Mahabubnagar - Sakshi

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: అక్షరాలు దిద్దాల్సిన చిట్టిచేతులు కర్మాగారాల్లో నిలిగిపోతున్నాయి.. ఆడి, పాడాల్సిన వయసులో  కఠినమైన పనులు చేస్తున్నాయి.. తాత్కాలిక అవసరాల కోసం తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకుండా పనులకు వెంట తీసుకెళ్లడంతో బాల్యం బుగ్గిపాలవుతోంది. పిల్లలందరూ బడిలో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఎంత ప్రయత్నించినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడం లేదు.  పెరుగుతున్న బాలకార్మికుల సంఖ్య విద్యాశాఖ అధికారులు గత నెల చివరివారం నుంచి చేపట్టిన ఇంటింటి సర్వేలో జిల్లా వ్యాప్తంగా ఎంత మంది బడిబయటి పిల్లలు ఉన్నారో లెక్క తేలింది.

కానీ వాస్తవానికి ఇంకా అందుకు రెట్టింపుస్థాయిలోనే ఉంటారన్నది అందరికి తెలిసిందే. పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ అయిన విద్యార్థులు, ఎన్‌రోల్‌మెంట్‌ కాని విద్యార్థులుగా గుర్తించి సర్వే చేశారు. అందులో భాగంగా 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు వయస్సు ఉండి, ఇటు అంగన్‌వాడీలో గానీ, అటు ప్రభుత్వ పాఠశాలకు గానీ వెళ్లకుండా ఇంటి వద్ద ఉండడం లేదా ఏదైనా పనికి వెళ్లే విద్యార్థులను బడిబయట పిల్లలుగా గుర్తించారు.

సర్వేలో భాగంగా మొత్తం 1,075 మంది బడిబయటి పిల్లలున్నట్లు గుర్తించారు. 6 నుంచి  14 సంవత్సరాలున్న వారిలో 500 మంది బాలికలు, 674 మంది బాలురు ఉన్నారు. అందులో అధికంగా నారాయణపేట మండలంలో 235 మంది ఉన్నారు. వీరిలో 84 మంది బాలికలు, 151 మంది బాలురు.  తర్వాతి స్థానంలో నవాబ్‌పేట మండలంలో 121 మంది బడిబయటి పిల్లలు ఉన్నారు. వీరిలో బాలికలు 55 మంది, బాలురు 66 మంది ఉన్నారు. అసలు మిడ్జిల్‌ మండలంలో బడిబయటి పిల్లలే లేరని అధికారులు రిపోర్టు ఇవ్వడం ఆలోచించాల్సిన విషయం. ఇక బాలానగర్‌లో 8, భూత్పూర్‌లో 11 మంది ఉండగా మహబూబ్‌నగర్‌ అర్బన్‌లో 33 మంది బడిబయటి పిల్లలు ఉన్నారు. వీరిలో బాలురు 19 మంది, బాలికలు 14 మంది ఉన్నారు. వారితో పాటు మెప్మా, డీఆర్‌డీఏ అధికారుల, పలు ఎన్జీఓ సంస్థలు వారు కూడా సర్వేలు నిర్వహించారు.
 
బడిబాట పట్టించేందుకు ప్రయత్నం 
బడిబయటి పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు విద్యాశాఖ అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా విద్యార్థులకు సీజనల్‌ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటకే దాదాపు 14 హాస్టళ్ల  ఏర్పాటు కోసం అధికారులు ప్రతిపాధనలు సిద్ధం చేశారు. ఈ సర్వే ఆధారంగా వచ్చిన రిపోర్టుతో బడిబయటి పిల్లలు ఉన్న దగ్గర హాస్టల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా వర్క్‌సైడ్‌ స్కూల్స్‌ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తల్లిదండ్రులు పనిచేసే ప్రాంతంలో పిల్లలకు అక్కడే చదువు చెప్పించే విధంగా కృషి చేస్తున్నారు. అనంతరం పిల్లల తల్లిదండ్రులను కౌన్సెలింగ్‌ చేసి పిల్లల్ని బాలసదన్, కేజీబీవీల్లో వసతి ఏర్పాటు చేసి విద్యను అందించేందుకు ఒప్పిస్తారు. ఐసీడీఎస్‌తో పాటు, పోలీస్‌ శాఖల సమన్వయంతో మరింత మంది పిల్లలను గుర్తించి పాఠశాలలకు పంపిచేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

సంచార జీవుల కోసం..  
బడి బయటి పిల్లలు ప్రధానంగా చదువుకు దూరం కావడానికి తల్లిదండ్రులు ఎంచుకున్న పలు వృత్తులే కారణం. జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతూ సంచార జీవనం చేస్తున్న వారికి పిల్లలు పూర్తి స్థాయిలో చదువుకోవడానికి నోచుకోవడం లేదు. మరీ ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని బండమీద పల్లెవద్ద ఉన్న బుడగజంగాల కాలనీ, అప్పన్నపల్లితో పాటు వివి«ధ ప్రాంతాల్లో వీరు నివసిస్తున్నారు. అయితే వీరు వెంట్రుకల సేకరణ, చెత్త కాగితాలు సేకరణతో పాటు పలు వృత్తిపరమైన పనులు చేస్తుంటారు. వీరు పిల్లలను సరిగ్గా బడికి పంపించకుండా పనిలో నిమగ్నమై వెట్టి చేయిస్తున్నారు.

మధ్యాహ్నం వేళ పిల్లలను పట్టణంలో పలు ప్రాంతాలకు పంపించి ఆహార సేకరణ చేయిస్తున్నారు. ఇవేకాకుండా ఇటుబట్టీలు, బొగ్గుబట్టీలు, బొంతలు కుట్టడం, వివిధ పెద్దపెద్ద భవనాల వద్ద ఉపాధి కోసం పనిచేసే వారి పిల్లలు కూడా బడికి దూరమవుతున్నారు. గిరిజన తండాలు, గూడేలు చాలా వరకు వ్యవసాయ పనులు పూర్తి అవగానే ఊర్లకు ఊర్లే ఖాళీచేసి వృత్తి, ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తుంటారు. వీరి పిల్లల్ని కూడా బడికి పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top