చిన్నారిని చెరువులో పడేసిన తండ్రి | child dead body in the lake | Sakshi
Sakshi News home page

చిన్నారిని చెరువులో పడేసిన తండ్రి

Jun 29 2015 1:38 AM | Updated on Sep 17 2018 8:02 PM

చిన్నారిని చెరువులో పడేసిన తండ్రి - Sakshi

చిన్నారిని చెరువులో పడేసిన తండ్రి

తన రెండో వివాహానికి అడ్డుగా ఉందని కన్న కూతురిని చెరువులో పడేశాడో తండ్రి.

మరో వివాహానికి అడ్డుగా ఉందని ఘాతుకం
తానూరు(ఆదిలాబాద్) : తన రెండో వివాహానికి అడ్డుగా ఉందని కన్న కూతురిని చెరువులో పడేశాడో తండ్రి. ఆదిలాబాద్ జిల్లా తానూరు మండలం కర్భాల గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన సోంటకే గౌతం కొన్నేళ్లుగా హైదరాబాద్, భైంసాలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో భైంసాలో నంద అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అప్పటికే ఆమెకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. గౌతం, నంద కులాంతర వివాహం చేసుకున్నారు.

వీరికి కూతురు జేసికా(5) ఉంది. ఇద్దరు కలిసి రెండేళ్లుగా భైంసాలో నివాసం ఉంటున్నారు. నెల రోజుల క్రితం స్వగ్రామమైన కర్భాలకు వచ్చి ఉంటున్నారు. వారం రోజుల క్రితం భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో నంద వెళ్లిపోయింది. అయితే,  మరో వివాహం చేసుకోవడానికి కూతురు జేసికా అడ్డుగా ఉందని గౌతం భావించాడు. శనివారం అర్ధరాత్రి కూతురిని తీసుకెళ్లి గ్రామ సమీపంలోని చెరువులో ఉన్న నీటి గుంతలో పడేశాడు. ఆదివారం ఉదయం తానూరు పోలీసుస్టేషన్‌కు వెళ్లి తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు.

మధ్యాహ్న సమయంలో చెరువులో బాలిక మృతదేహం పైకి తేలింది. పశువుల కాపరి గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ గణపతిజాదవ్ గౌతంను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. మరో వివాహం చేసుకోవడానికి అడ్డుగా ఉందని హతమార్చినట్లు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement