జయరాం కేసు తెలంగాణకు బదిలీ

chigurupati jayaram case transfer to Telangana - Sakshi

తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీ డీజీపీ నిర్ణయం  

ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న జయరాం భార్య

కేసు దర్యాప్తు తీరుపై ఆది నుంచీ అనుమానాలు 

దర్యాప్తుపై ప్రభావం చూపిన టీడీపీ నేతలు

సాక్షి, అమరావతి బ్యూరో: వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు దర్యాప్తును తెలంగాణకు బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పథకం ప్రకారం జయరాంను ఇంటికి రప్పించి హత్య చేసిన రాకేష్‌రెడ్డి.. ఆ తర్వాత ఇద్దరు తెలంగాణ పోలీసు అధికారుల సలహా మేరకు మృతదేహాన్ని ఏపీకి తీసుకొచ్చి ప్రమాద ఘటనగా చిత్రీకరించే యత్నం చేశాడు. ఈ çఘట న వెలుగులోకి వచ్చిన వెంటనే ఆయన మేన కోడలు శిఖాచౌదరి చుట్టే కేసు తిరిగింది. కేసు నుంచి శిఖాను బయటపడేసేందుకు ఏపీలోని కొందరు టీడీపీ నేతలు యత్నిస్తున్నారనే ప్రచా రం జరిగింది. చివరకు రాకేశ్‌ నిందితుడని నందిగామ పోలీసులు పేర్కొనగా.. ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని జయరాం భార్య పద్మశ్రీ చెప్పడంతో కేసు మరో కీలక మలుపు తిరిగింది.  

అన్నీ అనుమానాలే..?  
అమెరికా పౌరసత్వమున్న జయరాంకు వందల కోట్ల ఆస్తులున్నాయి. ఆ స్థాయి వ్యక్తి రాకేష్‌ వద్ద రూ. 4.17 కోట్లు ఎందుకు అప్పుగా తీసుకున్నాడన్న అంశం ప్రశ్నగా మిగిలిపోయింది. శిఖాని పెళ్లిచేసుకోవాలని భావించిన రాకేష్‌ కేవలం డబ్బు కోసమే జయరాంను హత్య చేశాడా? జయరాంను హత్య చేశాక ఆ సమాచారం శిఖాకి చెప్పలేదా? హత్య విషయాన్ని తెలంగాణ పోలీ సులకు చెబితే వారెందుకు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదు? శిఖా పాత్రపై అనేక ఆరోపణలు వెల్లువెత్తినా.. ఏపీ పోలీసులు ఎందు కు నిర్లక్ష్యం చేశారు? అంటూ పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. నందిగామ పోలీసులు హైదరాబాద్‌లో రాకేష్, జయరాం నివాసాల్లోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. జయరాం కాల్‌డేటా ఆయన ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరెవరితో కలిశారు? అన్న కోణం లోనూ ఆధారాలు సేకరించారు. హత్యానేరాన్ని అంగీకరిస్తూ రాకేష్‌ వాగ్మూలంలో ఇచ్చిన సమా చారానికి, పోలీసులు సేకరించిన ఆధారాలకు ఎక్కడ పొంతన లేదని తెలుస్తోంది. సాంకేతికంగానూ సాక్ష్యాల సేకరణ కష్టంగా మారిందని, ఈ సా«క్ష్యాలతో కేసు నిలబడదని, నేరస్తులు తప్పించుకుంటారని నిపుణులు చెబుతున్నారు. కేసులో సాంకేతికంగా సాక్ష్యాలను సేకరించాల్సి ఉందని జిల్లా ఎస్పీ త్రిపాఠి పేర్కొనడం నిపుణుల వాదనకు బలాన్ని చేకూరుస్తోంది.  

నిందితులకు రిమాండ్‌  
జయరాం హత్య కేసులో నిందితు లైన కవకుంట్ల రాకేష్, దున్నే శ్రీనివాస్‌లను నందిగామ అడిషనల్‌ జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపర్చామని ఎస్‌హెచ్‌ఓ వెంకటరమణ తెలిపారు. నిందితులకు 20వ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్‌ విధించారన్నారు.

కేసు తెలంగాణతో ముడిపడడం వల్లే బదిలీ: ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: చిగురుపాటి జయరాం హత్య కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదని, కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ మంగళవారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు పద్మశ్రీ ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం కేసును తెలంగాణకు అప్పగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. కేసు వ్యవహారాలన్నీ తెలంగాణతో ముడిపడడంతో కేసుపై ఈ నిర్ణయం తీసుకున్నామని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ వెల్లడించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top