చేవెళ్ల మహరాజ్‌

Chevella maharaj - Sakshi

సదర్‌ ఉత్సవాలకు సిద్ధమైన దున్నపోతు

మార్కెట్‌ విలువ రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్లు

ప్రపంచస్థాయి పోటీల్లో నాలుగుసార్లు విజేత  

 ఏటా వీర్యం అమ్మకాల ద్వారా కోటిన్నర ఆదాయం

చేవెళ్ల: హైదరాబాద్‌ నగరంలో ఐదు రోజుల పాటు నిర్వహించే సదర్‌ ఉత్సవాలకు చేవెళ్ల మహరాజ్‌(దున్నపోతు) సిద్ధమైంది. తెలంగాణ మహరాజ్‌గా జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిన ఈ హరియాణా దున్నపోతు గతేడాది సదర్‌ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదే ఉత్సాహంతో ఈ ఏడాది కూడా ఉత్సవాల్లో పాల్గొనేందుకు రెడీ అయ్యింది. 2009లో పుట్టిన మహరాజ్‌ ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్లు పలుకుతున్నట్లు దాని యజమాని కోటేశ్వరరావు చెబుతున్నారు. ప్రపంచ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఈ దున్నపోతు నాలుగుసార్లు విజేతగా నిలిచింది. 2011, 2012, 2016, 2017లో పోటీలకు హాజరై బహుమతులు గెలుచుకుంది.

రాజభోగం..
మహరాజ్‌ ఆలనాపాలనా చూసేందుకు ముగ్గురు మనుషులు ఉన్నారు. మహరాజ్‌ను రోజూ 5 కిలోమీటర్లు వాకింగ్‌కు తీసుకెళతారు. మూడు సార్లు ఆయిల్‌ మసాజ్‌ చేస్తారు. మూడుసార్లు స్నానం చేయిస్తారు.

వీర్యానికి భలే క్రేజ్‌..
మహరాజ్‌ వీర్యానికి విపరీతమైన క్రేజ్‌ ఉంది. గతేడాది నుంచే మహరాజ్‌ వీర్యాన్ని సేకరించి విక్రయిస్తున్నారు. ముర్రా జాతి దున్నపోతుల ఉత్పత్తికి ఈ వీర్యాన్ని వినియోగిస్తున్నారు. ఒక్క డోస్‌ వీర్యం ఖరీదు రూ.450. ప్రతి ఏటా మహరాజ్‌ నుంచి 30 వేల డోస్‌ల వీర్యాన్ని సేకరిస్తున్నారు. దీని విలువ సుమారు కోటిన్నర వరకు ఉంటుందని దాని యజమాని కోటేశ్వరరావు చెబుతున్నారు.

జూనియర్‌ మహరాజ్‌లూ సిద్ధం
దేశవాళీ పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ఎన్కే పల్లి సమీపంలో డెయిరీని ఏర్పాటు చేశా. పదేళ్ల క్రితం 10 పశువులతో మొదలుపెట్టిన ఈ డెయిరీలో ప్రస్తుతం 150కి పైగా గేదెలు, ఆవులు ఉన్నాయి. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పశుగ్రాసం మాత్రమే వీటి దాణాగా వినియోగిస్తా. బ్రీడింగ్‌ కోసం వివిధ జాతుల పశువులను పెంచుతున్నాం. మహరాజ్‌ కూడా ఇక్కడే పుట్టింది. మహరాజ్‌ సంతానంగా రెండు జూనియర్‌ మహరాజ్‌లు సిద్ధమవుతున్నాయి.
– ఎం.కోటేశ్వరరావు, ‘మహరాజ్‌’యజమాని

ప్రత్యేకతలివే..
పేరు    :    మహరాజ్‌
వయసు    :    8 ఏళ్లు
స్వస్థలం    :    చేవెళ్ల మండలం,ఎన్కేపల్లి గ్రామం
యజమాని    :    ఎం.కోటేశ్వరరావు
బరువు    :    1,675 కిలోలు
ఎత్తు    :    6.2 అడుగులు
మార్కెట్‌ విలువ    :    రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్లు

రోజువారీ ఆహారం..
పాలు    :    16 లీటర్లు
ఖర్జూరం    :    500 గ్రాములు
బాదం, పిస్తా    :    500 గ్రాములు (వారానికి రెండుసార్లు)
ఉలవలు    :    15 నుంచి 20 కిలోలు
వీటితో పాటు పచ్చిగడ్డి, ఎండుగడ్డి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top