వెంటాడుతున్న చిరుత భయం

Cheetah Panic Haunted At Kothapalli Village In Vikarabad District - Sakshi

కొత్తపల్లి వాసులకు కంటిమీద కునుకు కరువు  

మూడు రోజులుగా మేకలు, గొర్రెల మందలపై దాడులు  

పాదముద్రలను గుర్తించి చిరుతగా నిర్ధారించిన అటవీ శాఖ అధికారులు 

బోన్‌లు, సీసీ కెమెరాల ఏర్పాటుకు నిర్ణయం  

సాక్షి, యాచారం: కొత్తపల్లి గ్రామస్తులను చిరుతపులి కంటికి కునుకు లేకుండా చేస్తుంది. గత మూడు రోజులుగా వరుసగా రాత్రుళ్లు మందలపై దాడులు చేసి మేకలు, గొర్రెలను చంపి తినేస్తుండడంతో అటవీ ప్రాంతంలో ఉండాలంటేనే కాపరులు భయాందోళన చెందుతున్నారు. చిరుతపులి భయం వల్ల కొత్తపల్లి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నా అటవీ శాఖ అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంగళవారం రాత్రి చిరుత పులి కాస జంగయ్య మందపై దాడి చేసి మేకను చంపి ఎత్తుకెళ్లడం, రెండు మేకలను తీవ్రంగా గాయపర్చడం, బుధవారం రాత్రి చిక్కుడు వెంకటేష్‌కు చెందిన మందపై దాడి చేసి మేకను చంపడం, శుక్రవారం రాత్రి బైకని అశోక్‌ మందపై దాడి చేసి మేకను చంపి తినేయడం, రెండు మేకలను తీవ్రంగా గాయపర్చడంతో కాపరులు జంకుతున్నారు.  

మాడ్గుల – యాచారం మండలాల సరిహద్దులోని తాడిపర్తి నుంచి మాల్‌ వరకు 10 కిలోమీటర్ల మేరా గుట్టలు, పెద్ద పెద్ద రాళ్లతో కూడిన దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. రాత్రి పూల గుట్టల సమీపంలో ఉన్న మందలపై దాడులు చేస్తున్న చిరుతపులి తెల్లవారే సరికి గుట్టల్లోకి చేరుకుంటొంది. చిరుతపులి ఎక్కడ దాడి చేసి చంపేస్తుందోనని కాపలాదారులు చెట్లపైన తలదాచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. రాత్రి పూటే పగలు కూడా అటవీ ప్రాంతం, వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటేనే కాపరులు, రైతులు, వ్యవసాయ కూలీలు జంకుతున్నారు.  

సంచరిస్తుంది చిరుతపులే.... 
గత మూడు, నాలుగు రోజుల రాత్రుళ్లు కొత్తపల్లి అటవీ ప్రాంతంలో సంచరిస్తుంది చిరుతపులేనని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. శుక్రవారం రాత్రి బైకని అశోక్‌ మందపై దాడి చేసి మేకను చంపి తినేయడం తెలుసుకున్న అటవీ శాఖ రేంజ్‌ అధికారి సత్యనారాయణతో పాటు విజయభాస్కర్‌రెడ్డి, నర్సింహరెడ్డి, నర్సింహ, ఇంద్రసేనారెడ్డి తదితర అధికారులు బృందం శనివారం కొత్తపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. దాడులు చేసిన మందల సమీపంలో పాదముద్రలను గుర్తించి కొత్తపల్లిలో సంచరిస్తుంది చిరుతపులేనని నిర్ధారించారు. గ్రామంలో దండోరా వేయించి రాత్రి పూట అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరికలు పంపించారు. అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మందల్లో గొర్రెలు గాని, మేకలు గాని ఉంచరాదని కాపరులకు సూచించారు. ఒకటా..? లేదా రెండు చిరుతపులులు తిరుగుతున్నాయా..? అనే విషయం తెలుసుకోవడానికి మందల సమీపాల్లో సీసీ కెమెరాలను బిగిస్తున్నారు. అదే విధంగా అటవీ ప్రాంతంలో జూ అధికారులు బోన్‌లు ఏర్పాటు చేసే విధంగా స్థలాలను ఎంపిక చేసినట్లు రేంజ్‌ అధికారి సత్యనారాయణ తెలిపారు.  

కొత్తపల్లిలో చిరుతపులి దాడిలో మృతి చెందిన మేకను చూపిస్తున్న కాపరి   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top