
చీతాల రక్షణ కోసం కొత్త ఆవాసం
కునో నేషనల్ పార్కుకు ప్రత్యామ్నాయంగా గుజరాత్ బన్నీ గడ్డి మైదానాలు
కచ్ జిల్లాలో సిద్ధం చేస్తున్న ఆ రాష్ట్ర అటవీ శాఖ
కునో నేషనల్ పార్క్‌లో చీతాల మృత్యువాతతో మారిన ప్రణాళిక
దేశంలో అంతరించిపోయిన చీతాల సంతతి వృద్ధే లక్ష్యంగా అడుగులు
మన దేశంలో అంతరించిపోయిన చీతాలను పునరుద్ధరించడం కోసం చేపట్టిన ఆపరేషన్ చీతా ప్రాజెక్టును విజయవంతం చేయడానికి యత్నాలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చీతాల పునరావాసం కష్టమని తేలడంతో ప్రత్యామ్నాయంగా గుజరాత్‌లోని కచ్ జిల్లా బన్ని గడ్డి మైదానాలను ఎంపిక చేశారు. దేశంలో చీతాల సంతతి పునరుద్ధరణ కోసం 2022లో ప్రాజెక్టు చీతా ప్రారంభించారు. నమీబియా నుంచి 8, దక్షిణాఫ్రికా నుంచి 12 కలిపి మొత్తం 20 చీతాలను తీసుకువచ్చారు.
వాటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడతల వారీగా వదిలారు. కానీ కునో పార్కు చీతాలకు అనువైంది కాదని ఆ తర్వాత వెల్లడైంది. ఫలితంగా అవి మృత్యువాతపడడం మొదలైంది. కొన్ని చీతాలు పిల్లలు పెట్టినా చాలా వరకూ చనిపోయాయి. మొత్తం 10 చీతాలు చనిపోవడంతో ఆ ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారింది. ఆసియాలో జీవించిన చీతాలు, ఆఫ్రికన్ అడవుల్లోని చీతాలకు చాలా వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు.
దీనికితోడు కునో పార్కు ఆఫ్రికన్ గడ్డి మైదానాల తరహాలో లేకపోవడం, పరిమితమైన అటవీ ప్రాంతం, వాటికి అవసరమైన ఆహార జంతువుల కొరత, అడవిలో గడ్డి పరిధి ఎక్కువగా ఉండడంతో చీతాల వేగానికి ఆటంకం కలగడం, వాతావరణ మార్పులతో ఇన్‌ఫెక్షన్లు సోకడం, మానవ జోక్యం ఎక్కువ కావడం వల్ల అవి జీవించలేకపోతున్నట్లు తేలింది. – సాక్షి, అమరావతి
బన్ని గడ్డి మైదానాలే ఎందుకంటే?
ఈ నేపథ్యంలో చీతాల సంరక్షణకు ఆఫ్రికన్ గడ్డి మైదానాల తరహా ప్రాంతం కోసం అటవీ అధికారులు అన్వేషించారు. చివరికి కచ్ ప్రాంతంలోని బన్ని గడ్డి మైదానాలు అనువుగా ఉంటాయని తేల్చారు. ఇవి భారతదేశంలో ఉన్న అతి పెద్ద గడ్డి మైదానాలు. సుమారు 2,618 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి.
తక్కువ పొడవు ఉండే గడ్డి, మృదువైన నేల, ఎక్కువ ఎండ, తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతం. అలాగే చీతాలకు ఆహారంగా జింకలు, దుప్పులు ఇతర జంతువులు సహా అనేక జీవులు ఇక్కడ నివసిస్తున్నాయి. ఆఫ్రికాలో చీతాలు నివసించే సహజమైన గడ్డి మైదానాల మాదిరిగానే బన్ని గడ్డి భూములు ఉంటాయి. ఈ ప్రాంతంలో జనసాంద్రత కూడా తక్కువగా ఉండటం వల్ల వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
కునో పార్కులో మిగిలిన 24 చీతాలు
ఈ నేపథ్యంలోనే చీతాలను అక్కడ ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుజరాత్ అటవీ శాఖ వన్యప్రాణుల ప్రధాన సంరక్షణాధికారి జైపాల్ సింగ్ మాట్లాడుతూ ఇప్పటికే బన్ని గడ్డి మైదానాల్లో 500 ఎకరాల్లో బ్రీడింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతోపాటు చీతాలు తిరగడానికి వీలుగా వలయాకారంలో భారీ ఫెన్సింగ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
వాటికి సరిపోయే ఆహార శ్రేణిని అభివృద్ధి చేస్తున్నారు. డ్రోన్ మానిటరింగ్, సీసీ టీవీ వ్యవస్థలు, అటవీ సిబ్బందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కునో పార్కులో 24 చీతాలు ఉన్నాయి. అందులో 12 పిల్లలు. మొదటి విడతగా పది చీతాలను బన్ని గడ్డి మైదానాల్లో వదలాలని భావిస్తున్నారు.
కొత్త ప్రణాళికతో ముందుకు
1952లోనే చీతాలు అధికారికంగా భారతదేశంలో అంతరించిపోయిన జాతిగా ప్రకటించారు. 70 ఏళ్ల తర్వాత 2022లో ప్రాజెక్టు చీతా ద్వారా మళ్లీ వాటిని ఆఫ్రికా దేశాల నుంచి మన దేశానికి తీసుకురాగలిగారు. అయితే ఆఫ్రికన్, ఆసియా చీతా జాతుల మధ్య ఉన్న తేడాలు, వాటి ఆవాసానికి సరైన ప్రాంతాన్ని ఎంపిక చేయకపోవడం, ప్రణాళికా లోపం వల్ల సమస్యలు ఏర్పడ్డాయి. ఈ మూడేళ్లలో ఎదురైన అనుభవాలతో ఇప్పుడు కొత్త ప్రణాళికతో ముందుకెళుతున్నారు. అందులో భాగంగానే గుజరాత్ బన్ని గడ్డి మైదానాలను ఎంపిక చేశారు.