
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రా ల్లో సంచలనం రేపిన ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో సీఐడీ చార్జిషీట్ దాఖలు చేయబోతోంది. అయితే, కొద్ది నెలల క్రితమే డ్రాఫ్ట్ చార్జిషీట్ సిద్ధం చేసిన సీఐడీ, మరిన్ని అంశాలపై క్లారిటీ కోసం జేఎన్‌టీయూకు 3 నెలల క్రితం లేఖ రాసింది. ప్రశ్నపత్రం రూపొందించిన అధికారులు, మినిట్స్‌బుక్ తదితర వ్యవహారాల డాక్యుమెంట్లు కావా లని కోరింది. దీంతో జేఎన్‌టీయూ అధికారులు రెండు రోజుల క్రితం వివరాలను సీఐడీకి అందించినట్లు తెలిసింది.
ప్రింటింగ్ ప్రెస్ పాత్రపై ఆరా..
జేఎన్‌టీయూ ఎంసెట్ ప్రశ్నపత్రం రూపొందించిన కమిటీ అధికారులు, వారి వ్యవహారాలపై విచారణ జరిపిన సీఐడీ అధికా రులు వారి వద్ద నుంచి ప్రశ్నపత్రం బయటకు వెళ్లలేదని నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఇక ఇప్పటికే సీఐడీ అదనపు డీజీపీ గోవింద్‌సింగ్ ఢిల్లీ శివారు లోని ప్రింటింగ్ ప్రెస్‌ను పరిశీలించి వివరాలు సేక రించారు. ఈ నేపథ్యంలో ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యం పాత్రపై అభియో గాలు మోపుతూ చార్జిషీట్ దాఖలు చేయ నున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
నిందితులపై అభియోగాలు నమోదు
ఈ కేసులో సీఐడీ ఇప్పటి వరకు 12 మంది ప్రధాన నిందితులతో పాటు 66 మంది బ్రోకర్లను అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. వీరిలో ఇద్దరు ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్లు ఉండగా, మరో ఇద్దరు మహిళా బ్రోకర్లున్నారు. కీలక సూత్రధారి, స్కాంకు ఆధ్యుడైన కమిలేశ్‌కుమార్ సింగ్ సీఐడీ కస్టడీలోనే గుండెపోటుతో మృతి చెందాడు. మిగిలిన 16 మంది నిందితులు పరారీలో ఉండగా వారిపై అభియోగాలు నమోదు చేసి చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేస్తామని అధికారులు తెలిపారు.