డిసెంబర్ 8కల్లా చార్జిషీటు వేస్తాం
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడి
తేజ్‌పూర్: సింగపూర్‌లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన గాయకుడు జుబీన్ గర్గ్‌ది హత్యేనని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఆయన హత్యకు గురయ్యారని, ఇందుకు సంబంధించిన చార్జిషీటును కోర్టులో డిసెంబర్ 8వ తేదీలోగా వేస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ 19వ తేదీన జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చురుగ్గా సాగుతోందని సీఎం చెప్పారు. డిసెంబర్ 17వ తేదీకల్లా చార్జిషీటు సమర్పించాల్సి ఉండగా అంతకన్నా ముందుగానే వేస్తామని చెప్పారు.
ఆ ఘటనను హత్యగా నిర్థారించడానికి గల కారణాలను, లభ్యమైన ఆధారాల వివరాలను ఆయన వెల్లడించలేదు. జుబీన్ గర్గ్ మరణంపై రాష్ట్ర వ్యాప్తంగా దాఖలైన 60కి పైగా ఎఫ్‌ఐఆర్‌లపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ‘జుబీన్ మరణానికి సంబంధించి ఇతర దేశాల్లో ఏవైనా జరిగి ఉంటే, వాటిపై విచారణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో హోం మంత్రిని కలిశాను. రెండు, మూడు రోజుల్లో సిట్‌కు హోం శాఖ నుంచి అనుమతి మంజూరయ్యే అవకాశముంది’అని సీఎం వివరించారు. జుబీన్ గర్గ్ మృతికి సంబంధించి ఇప్పటి వరకు సిట్ ఏడుగురిని అదుపులోకి తీసుకుంది. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.


