బెయిల్‌ రాకుండా చేసేందుకే హడావుడిగా చార్జిషీట్‌ | SIT Files Supplementary Chargesheet in Liquor Scam: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

బెయిల్‌ రాకుండా చేసేందుకే హడావుడిగా చార్జిషీట్‌

Sep 19 2025 5:59 AM | Updated on Sep 19 2025 5:59 AM

SIT Files Supplementary Chargesheet in Liquor Scam: Andhra Pradesh

సిట్‌ పూర్తి వివరాలు పొందుపరచకుండానే దాఖలు చేసింది

దర్యాప్తు సంస్థ కీలక అంశాలను చార్జిషీట్‌లో విస్మరించింది.. సిట్‌ పలు తప్పులు చేసి... ఏసీబీ కోర్టుదే తప్పని చెబుతోంది 

అసంపూర్ణ చార్జిషీట్‌కు చట్టం దృష్టిలో ఎలాంటి విలువ లేదు.. చార్జిషీట్‌లో లోపాలను సరిదిద్దాలని కోర్టు చెప్పినా చేయలేదు 

సాక్షుల వివరాలు, వారు చెప్పిన విషయాలను పొందుపరచలేదు 

అలాంటప్పుడు ఆ చార్జిషీట్చ్చ్‌ను ఏసీబీ కోర్టు ఎలా విచారణకు స్వీకరిస్తుంది? 

ఏసీబీ కోర్టే కాదు.. ఇలాంటి అసంపూర్ణ చార్జిషీట్‌ను ఏ కోర్టు కూడా విచారణకు తీసుకోదు 

చార్జిషీట్‌ లోపభూయిష్టంగా ్చఉండడంతో కోర్టు పిటిషనర్లకు డిఫాల్ట్‌ బెయిల్‌ ఇచ్చింది 

డిఫాల్ట్‌ బెయిల్‌ నిందితుల హక్కు.. దీనిని ఎవరూ అడ్డుకోలేరు.. మద్యం అక్రమ కేసులో సిట్‌ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయండి 

హైకోర్టుకు నివేదించిన సీనియర్‌ న్యాయవాదులు నిరంజన్‌రెడ్డి, సిద్ధార్థ దవే 

ధనుంజయరెడ్డి తరఫు వాదనలు వినే నిమిత్తం తదుపరి విచారణ 24కు వాయిదా 

ఏసీబీ కోర్టు మా వాదనలను, ప్రస్తావించిన తీర్పులను పరిగణించలేదు 

నిబంధనల ప్రకారమే చార్జిషీట్‌ దాఖలు చేశాం 

సక్రమంగా ఉన్నా... విచారణకు తీసుకోలేదు.. ఏసీబీ కోర్టు తప్పు చేసింది 

సిట్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా   

‘‘సిట్‌ చార్జిషిట్‌లో పొందుపరచాల్సిన వాటిని పొందుపరచకుండా తప్పంతా ఏసీబీ కోర్టు మీదకు నెడుతోంది. అత్యంత ముఖ్యమైన సాక్షుల వివరాలు, వారు ఏం చెప్పారన్న విషయాలను ప్రస్తావించలేదు. కీలకమైన వివరాలు లేకపోవడంతో ఆ చార్జిషిట్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించలేదు. ఒక్క ఏసీబీ కోర్టే కాదు. ఏ కోర్టు కూడా అలాంటి చార్జిషిట్‌ను విచారణకు స్వీకరించదు. చార్జిషిట్‌లోని లోపాలను ఎత్తిచూపిన ఏసీబీ కోర్టు... వాటిని సరిదిద్దాలని చెప్పినా సిట్‌ ఆ పని చేయలేదు.  అసంపూర్ణ చార్జిషిట్‌కు చట్టం దృష్టిలో ఎలాంటి విలువ లేదు’’

‘‘ఏసీబీ కోర్టు వారి చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించకపోవడం తప్పని చెబుతున్న సిట్, వారు చేసిన తప్పులను మాత్రం చెప్పడం లేదు. లోపభూయిష్ట, అసంపూర్ణ చార్జిషీట్‌ను చార్జిషిట్‌గా పరిగణించే అవకాశం లేకపోవడంతోనే ఏసీబీ కోర్టు పిటిషనర్లకు డిఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది’’     –సీనియర్‌ న్యాయవాదులు నిరంజన్‌రెడ్డి, సిద్ధార్థ దవే

సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో బెయిల్‌ రాకుండా చేసేందుకే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) హడావుడిగా చార్జిషిట్‌ దాఖలు చేసిందని పెళ్లకూరు కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప  తరఫు సీనియర్‌ న్యాయవాదులు తప్పెట నిరంజన్‌రెడ్డి, సిద్ధార్థ దవే హైకోర్టుకు నివేదించారు. 90 రోజులు దాటితే నిందితులు బెయిల్‌ పొందే అవకాశం ఉండడంతో, పూర్తి వివరాలు లేకుండానే చార్జిషిట్‌ వేసిందని వివరించారు. అందులో కీలక అంశాలను విస్మరించిందని తెలిపారు. బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్‌రెడ్డి, కాల్వ ధనుంజయరెడ్డిలకు ఏసీబీ కోర్టు ఇ చ్చిన డిఫాల్ట్‌ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సిట్‌... హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది.

తమ చార్జిషిట్‌లో పలు లోపాలను లేవనెత్తుతూ ఏసీబీ కోర్టు ఇ చ్చిన ఆఫీస్‌ మెమోరాండంను సైతం సవాల్‌ చేసింది. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు... ఏసీబీ కోర్టు జారీచేసిన ఆఫీస్‌ మెమోరాండంపై స్టే విధించింది. అలాగే ఆఫీస్‌ మెమోరాండం ఆధారంగా డిఫాల్ట్‌ బెయిల్‌ ఇస్తూ ఏసీబీ కోర్టు వెలువరించిన తీర్పులోని పలు అంశాలను నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. ఈ బెయిల్‌ రద్దు పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప తన విచారణను గురువారం కూడా కొనసాగించారు. 

అన్నింటినీ పరిగణనలోకి తీసుకునే డిఫాల్ట్‌ బెయిల్‌  
బాలాజీ గోవిందప్ప తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. ఈ అక్రమ కేసులో సిట్‌ అధికారులు, వారి న్యాయవాదులు మొదటినుంచి న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తూ వస్తున్నారని తెలిపారు. ఏసీబీ కోర్టు జడ్జి చట్టం, న్యాయం  గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి అని వివరించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే డిఫాల్ట్‌ బెయిల్‌ ఇచ్చారన్నారు. అసంపూర్తి చార్జిషిట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో... పిటిషనర్ల రిమాండ్‌ 90 రోజులు పూర్తి కావడంతో వారికి కోర్టు డిఫాల్ట్‌ బెయిల్‌ ఇ చ్చిందని తెలిపారు. ఇందులో తప్పుపట్టడానికి ఏమీ లేదని పేర్కొన్నారు. 

⇒ మద్యం అక్రమ కేసులో రూ.3,500 కోట్ల మేర అక్రమాలు జరిగాయని చెబుతున్న సిట్‌... ఇప్పటివరకు రూ.40 కోట్లనే సీజ్‌ చేసిన విషయాన్ని ఏసీబీ కోర్టు గుర్తుచేసిందని తెలిపారు. మిగిలిన మొత్తాన్ని సిట్‌ అధికారులు ప్రతిపక్ష నేత ఖాతాలో వేయడానికి కూడా వెనుకాడరన్నారు.  

⇒  చార్జిషీట్‌ దాఖలు తరువాత తదుపరి దర్యాప్తు గురించి కోర్టుకు తెలియజేయాల్సి ఉంటుందని, కానీ ఈ అక్రమ కేసులో ఏసీబీ కోర్టుకు సిట్‌ అలాంటి సమాచారం ఇవ్వలేదని వివరించారు. అలా చెప్పనందున దర్యాప్తు మొత్తం పూర్తయినట్లే అవుతుందని తెలిపారు. చార్జిషిట్‌ వేసిన తరువాత అందులోని అన్ని డాక్యుమెంట్లను పరిశీలించేందుకు ఏసీబీ కోర్టుకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని, కానీ ఇక్కడ కీలక డాక్యుమెంట్లను సిట్‌ అసలు ఏసీబీ కోర్టు ముందు ఉంచలేదని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్లకు బెయిల్‌ రాకుండా చేసేందుకు ప్రతి దశలోనూ సిట్‌ ప్రయతి్నస్తూ వ చ్చిందన్నారు.  

డిఫాల్ట్‌ బెయిల్‌ నిందితుల హక్కు.. 
చట్టం దృష్టిలో ఎలాంటి విలువ లేని చార్జిషిట్‌ను దాఖలు చేసినప్పుడు కోర్టులు నిందితులను 90 రోజులకు మించి తమ కస్టడీలో ఉంచుకోవడానికి వీల్లేదని నిరంజన్‌రెడ్డి, సిద్ధార్థ దవే పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టంగా చెప్పిన సంగతిని గుర్తుచేశారు. దీనికి అనుగుణంగానే ఏసీబీ కోర్టు పిటిషనర్లకు డిఫాల్ట్‌ బెయిల్‌ ఇ చ్చిందని వివరించారు. ఇలాంటి సందర్భాల్లో డిఫాల్ట్‌ బెయిల్‌ ఇవ్వడం మినహా మరో అవకాశం లేదన్నారు. డిఫాల్ట్‌ బెయిల్‌ నిందితుల హక్కు అని, దీనిని ఏ ఒక్కరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. 

⇒  చార్జిషిట్‌ను విచారణకు తీసుకున్నప్పుడే సీఆర్‌పీసీ సెక్షన్‌ 309 కింద రిమాండ్‌ను పొడిగించాల్సి ఉంటుందని,  అయితే ఈ అక్రమ కేసులో సిట్‌ చార్జిషిట్‌ను ఏసీబీ కోర్టు విచారణకు తీసుకోలేదని, అందువల్ల నిందితులకు సెక్షన్‌ 167(2) కింద రిమాండ్‌ను పొడిగించినట్లు అవుతుందని అన్నారు. ఏసీబీ కోర్టు జడ్జి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే చట్ట ప్రకారం పిటిషనర్లకు డిఫాల్ట్‌ బెయిల్‌ ఇచ్చారని వివరించారు. తొందరపాటుతో వ్యవహరించలేదన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు సీనియర్‌ న్యాయవాదులూ... సుప్రీంకోర్టుతో సహా వివిధ హై కోర్టులు వెలువరించిన తీర్పులను న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పిటిషనర్ల బెయిల్‌ రద్దు కోసం సిట్‌ దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టివేయాలని హైకోర్టును అభ్యర్ధించారు.  

⇒  అంతకుముందు సిట్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బుధవారం నాటి వాదనలను కొనసాగించారు. తమ వాదనలను, ప్రస్తావించిన తీర్పులను ఏసీబీ కోర్టు పరిగణించలేదన్నారు. అన్ని వివరాలతో చార్జిషీట్‌ వేశామని, దానిని విచారణకు తీసుకోవాలా లేదా అన్నది ఏసీబీ కోర్టు ఇష్టమని తెలిపారు. తమ చార్జిషిట్‌ను విచారణకు తీసుకోకుండా ఏసీబీ కోర్టు తప్పు చేసిందన్నారు. పైగా తాము తప్పు చేశామంటూ... పిటిషనర్లకు డిఫాల్ట్‌ బెయిల్‌ ఇ చ్చిందన్నారు.  

⇒  గోవిందప్ప, కృష్ణమోహన్‌రెడ్డిల తరఫున వాదనలు ముగియడంతో ధనుంజయరెడ్డి తరఫున వాదనలను వినేందుకు హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఉత్తర్వులు జారీ చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement