ప్రభుత్వస్థలం, తన స్థలం టీడీపీ వర్గీయుడు కబ్జాచేశారని సర్పంచ్ ఫిర్యాదు
అది ఆక్రమణే అని తేల్చిన రెవెన్యూ అధికారులు
దీంతో కబ్జాచేసి కట్టిన గోడను కూల్చేసిన సర్పంచ్
ఇందుకుగాను సర్పంచ్‌పై కేసు నమోదు
బలవంతంగా స్టేషన్‌కు తీసుకెళ్లిన సీఐ
సాక్షి టాస్క్ ఫోర్స్: తన స్థలంతోపాటు రైతుసేవా కేంద్రం దారిని ఆక్రమంచి టీడీపీ సానుభూతిపరుడు నిర్మించిన ప్రహరీని కూల్చేసిన ఎస్సీ వర్గీయుడైన సర్పంచ్‌పై కేసుపెట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన వైనమిది. బాపట్ల జిల్లా అద్దంకి మండలం చక్రాయపాలెంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన అధికారపార్టీ నేతలు, అధికారుల వైఖరికి అద్దం పడుతోంది. బాధిత సర్పంచ్ నగేశ్ తెలిపిన మేరకు.. వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రభుత్వస్థలంలో రైతుభరోసా కేంద్రం నిరి్మంచారు. దానికి దారికోసం సర్పంచ్ నగేశ్ సర్వేనంబరు 127/7 లోని తన స్థలంలో ఐదడుగులు ఇచ్చారు.
ఆ పక్కనే నివాసం ఉంటున్న టీడీపీ సానుభూతిపరులు టి.వెంకాయమ్మ, శ్రీనివాసరావు దంపతులు ఇటీవల రైతుసేవా కేంద్రానికి వెళ్లే రహదారిలో కొంత, నగేశ్ పట్టాభూమిలో కొంత ఆక్రమించి ప్రహరీ కట్టేందుకు పిల్లర్లు వేశారు. దీంతో సర్పంచ్ ఆ స్థలాన్ని సర్వేచేయాలంటూ తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. తహసీల్దార్ ఆదేశాలతో సర్వేయర్ వచ్చి స్థలాన్ని సర్వేచేసి టీడీపీ సానుభూతిపరుడు గోడకట్టే ప్రదేశంలో ఆక్రమణ ఉందని నివేదిక ఇచ్చారు.
ఈ విషయం చెప్పి సర్పంచ్ హెచ్చరించినా వినకుండా వారు గోడకట్టారు. సర్పంచ్‌పై దాడిచేసి కులం పేరుతో దూషించారు. ఆ విషయమై సర్పంచ్ రెండురోజుల కిందట ఎస్పీకి, జేసీకి ఫిర్యాదు చేశారు. ఎవరూ స్పందించకపోవడంతో సర్పంచ్ నగేశ్ ఆ అక్రమ గోడను యంత్రంతో కూల్చేశారు. దీంతో తన గోడను సర్పంచ్ కూల్చేశారని శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుడి ప్రోద్బలంతో శుక్రవారం నగేశ్ స్థలంలో నుంచి విద్యుత్ సిబ్బంది కరెంటు స్తంభాలు వేయసాగారు. వారిని నగేశ్ అడ్డుకున్నారు. వారి సమాచారంతో గ్రామానికి వెళ్లిన సీఐ సుబ్బరాజు గోడ కూల్చినందుకు తీసుకెళ్తున్నానంటూ సర్పంచ్ నగేశ్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ విషయమై సీఐ సుబ్బరాజును అడగగా.. ఆక్రమణ విషయమై కోర్టులో తేల్చుకోవాలని, పడేయడం క్రిమినల్ కేసు అవుతుందని చెప్పారు. అందుకే తీసుకొచ్చి 41 నోటీసు ఇచ్చి పంపినట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాన్ని కబ్జాచేసి గోడ నిరి్మంచినా పట్టించుకోని అధికారులు.. ఆ గోడ తొలగించారని సర్పంచ్‌పైనే కేసు పెట్టడం ఏమిటని స్థానికులు చర్చించుకుంటున్నారు.


