అంగడి సర్టిఫికెట్లతో అడ్డగోలు పదోన్నతులు! | Sakshi
Sakshi News home page

అంగడి సర్టిఫికెట్లతో అడ్డగోలు పదోన్నతులు!

Published Mon, Aug 4 2014 1:52 AM

Certificate bazaar cross promotion!

హైదరాబాద్: ఇటీవల మెదక్‌జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన ఘోర దుర్ఘటన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పాఠశాల బస్సులను రవాణా శాఖ తనిఖీలు చేపట్టింది. కానీ ఆటోమొబైల్ రంగంపై అవగాహనలేని అధికారులు దర్జాగా వాటి ఫిట్‌నెస్‌ను తనిఖీ చేసేశారు. వారు నిజంగా అధికారులే.. గతంలో రవాణాశాఖలో కానిస్టేబుళ్లుగా పనిచేసి ఆ తర్వాత అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు(ఏఎంవీఐ)గా పదోన్నతి పొందినవారు. వాహనాల ఫిట్‌నెస్‌ను సరిగ్గా అంచనా వేసే పరిజ్ఞానం లేకుండానే విధులు నిర్వహించేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఈ ఉదంతానికి నాలుగేళ్ల క్రితం బీజాలు పడ్డాయి. దీన్ని తెలంగాణ ప్రభుత్వం పునఃసమీక్షించే అవకాశం ఉండటంతో ఈలోపే ఇదే తరహాలో మరికొందరు అడ్డగోలు పదోన్నతులు కొట్టేసేందుకు స్కెచ్ వేశారు.

అంతా ‘రాజస్థాన్’ సర్టిఫికెట్ల మాయ

ప్రమోషన్లు పొందాలంటే పూర్తి అర్హతలుండాలి.. అర్హతలు కావాలంటే గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి అధికారికంగా సర్టిఫికెట్లు పొందాలి.. అది సాధ్యం కాదంటే దొడ్డిదారిలో తిమ్మినిబమ్మి చేయాలి. ఇప్పుడు రవాణాశాఖలో అదే జరుగుతోంది. ఈ శాఖలో ఏఎంవీఐల బాధ్యత కీలకమైంది. వాహనాల ఫిట్‌నెస్ వ్యవహారాన్ని వీరు పర్యవేక్షిస్తుంటారు. ఈ పోస్టులను ఏపీపీఎస్సీ (ఉమ్మడి రాష్ట్రంలో) నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అయితే రవాణాశాఖలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు పదోన్నతుల ద్వారా కూడా వీటిని భర్తీ చేయాలనే డిమాండ్ ఆధారంగా 2009లో నాటి ప్రభుత్వం అందుకు 20 శాతం (10 శాతం కానిస్టేబుళ్లకు, 10 శాతం జూనియర్ అసిస్టెంట్లకు)కోటాను కేటాయించింది. ఇక్కడే భారీ ఎత్తున మతలబు జరుగుతోంది. పదోన్నతి పొందే కానిస్టేబుళ్లు, జూనియర్ అసిస్టెంట్లు కచ్చితంగా రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఆటోమొటైల్ డిప్లొమా కోర్సు చేసుండాలి. దీంతో చాలామంది దొడ్డిదారి మార్గానికి తెరదీశారు.  రాజాస్థాన్‌లోని ఓ డీమ్డ్ యూనివర్సిటీ సర్టిఫికెట్లను సంపాదించి వాటి ఆధారంగా పదోన్నతులకు దరఖాస్తు చేస్తున్నారు. ఈ డీమ్డ్ యూనివర్సిటీ సర్టిఫికెట్లకు ఆ ‘అర్హత’ లేదంటూ గతంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఏపీపీఎస్సీ, ఇగ్నో, రాష్ట్ర సాంకేతిక విద్యామండలిలు తేల్చిచెప్పాయి. దీంతో భారీ ‘లాబీయింగ్’తో 2010లో ఈ డీమ్డ్ యూనివర్సిటీ సర్టిఫికెట్ కూడా చెల్లుతుందంటూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వు జారీ అయ్యేలా చక్రం తిప్పారు. ఈ వ్యవహారంలో రూ.కోట్లు చేతులు మారాయని విమర్శలు వినిపించాయి.

హడావుడి పదోన్నతులకు రంగం సిద్ధం: తెలంగాణ ప్రభుత్వం  అక్రమాలను తవ్వితీస్తున్న నేపథ్యంలో ఈ సర్టిఫికెట్ల బాగోతాన్ని కూడా పునఃసమీక్షించే అవకాశం ఉండటంతో ఈలోపే మరికొందరికి అడ్డగోలు పదోన్నతులు కల్పించి అందినంత దండుకునేందుకు రవాణాశాఖలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
 
 

Advertisement
Advertisement