రాష్ట్రంలో 8 రెడ్‌జోన్లు

Central Government Listed 8 Red Zones In Telangana - Sakshi

జాబితా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో హాట్‌స్పాట్‌ (రెడ్‌జోన్‌) జిల్లాలు 8 ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆయా జిల్లాల వివరాలతో రాష్ట్రానికి సర్క్యులర్‌ను జారీ చేసింది. రెడ్‌జోన్‌ను మళ్లీ రెండు విభాగాలుగా వర్గీకరించింది. ఇందులో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలను లార్జ్‌ ఔట్‌బ్రేక్‌ హాట్‌స్పాట్‌ జిల్లాలుగా గుర్తించి, ఇటువంటివి తెలంగాణలో 8 జిల్లాలున్నట్టు తెలిపింది. అలాగే, హాట్‌స్పాట్‌ క్లస్టర్‌గా నల్లగొండ జిల్లా ఉన్నట్టు పేర్కొంది. ఏపీలో 11.. దేశంలో 170 జిల్లాలు.. దేశవ్యాప్తంగా 170 జిల్లాలను హాట్‌స్పాట్‌ (రెడ్‌జోన్‌) జిల్లాలుగా గుర్తిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గుర్తించింది. వీటిలో ఏపీలో 11 జిల్లాలు రెడ్‌జోన్‌ (లార్జ్‌ ఔట్‌బ్రేక్‌)లో ఉన్నాయి. కర్నూలు, గుంటూరు, ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, వైఎస్సార్, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు నమోదైన కేసుల ఆధారంగా జిల్లాలను హాట్‌స్పాట్‌ (రెడ్‌ జోన్‌), నాన్‌ హాట్‌స్పాట్‌ (ఆరెంజ్‌), నాన్‌ ఇన్ఫెక్టెడ్‌ (గ్రీన్‌ జోన్‌) జిల్లాలుగా వర్గీకరించింది.

దేశవ్యాప్తంగా రెడ్‌జోన్లో 170 జిల్లాలు, ఆరెంజ్‌ జోన్లో 207, మిగతావి గ్రీన్‌ జోన్లో ఉన్నట్టు తెలిపింది. రెడ్‌జోన్‌ను మళ్లీ రెండు రకాలుగా వర్గీకరించింది. విస్తృతి ఎక్కువగా ఉన్నవి 143 (లార్జ్‌ ఔట్‌బ్రేక్‌) జిల్లాలు, క్లస్టర్లలో విస్తృతి ఉన్నవి 47 జిల్లాలుగా గుర్తించింది. రాష్ట్రాలు ఆయా జోన్లవారీగా నిర్ధేశిత కార్యాచరణ ద్వారా వైరస్‌ను అదుపులోకి తీసుకురావాలని సూచించింది. ఇకపై కూడా కేసుల సంఖ్య రెట్టింపయ్యే ప్రాతిపదికన రెడ్‌ జోన్లను గుర్తించాలని కోరింది. ప్రతి సోమవారం ఈ ప్రక్రియ పూర్తిచేయాలని సూచించింది. 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే రెడ్‌జోన్‌ నుంచి ఆరెంజ్‌ జోన్‌కు, 28 రోజుల్లో కొత్త కేసులు లేనిపక్షంలో గ్రీన్‌ జోన్‌కు మార్చాలని సూచించింది. కేస్‌ లోడ్, నాలుగు రోజుల్లో రెట్టింపు సంఖ్య నమోదైన జిల్లాలు తదితర అంశాల ప్రాతిపదికన జోన్లుగా వర్గీకరించినట్టు తెలిపింది. 

తెలంగాణ
రెడ్‌జోన్‌ (లార్జ్‌ ఔట్‌బ్రేక్‌) జిల్లాలు (8) : హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్‌ అర్బన్, రంగారెడ్డి, జోగుళాంబ గద్వాల, మేడ్చల్‌–మల్కాజిగిరి, కరీంనగర్, నిర్మల్‌.
రెడ్‌జోన్‌ (హాట్‌స్పాట్‌ క్లస్టర్‌) జిల్లా (1) : నల్లగొండ.
ఆరెంజ్‌ జోన్‌ (నాన్‌–హాట్‌స్పాట్‌) జిల్లాలు (19) : సూర్యాపేట, ఆదిలాబాద్,  మహబూబ్‌నగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్‌ భూపాలపల్లి, కొమరంభీమ్‌ ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top