కాళేశ్వరానికి కేంద్రం అనుమతి?

center likely to say yes to Kaleshwaram Project - Sakshi

రాష్ట్ర ప్రభుత్వ వివరణతో సంతృప్తి చెందిన ఈఏసీ

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన పర్యావరణ అనుమతులకు కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని పర్యావరణ మదింపు కమిటీ (ఈఏసీ) సానూకులత వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. మంగళవారం ఈ మేరకు పర్యావరణానికి ఎలాంటి హానీ కలగకుండా తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈఏసీకి వివరించారు. పర్యావరణ రక్షణకే రూ.3,055 కోట్లు ఖర్చు చేస్తున్నామని, భూ సేకరణ, పునరావాసానికి మరో రూ.13,296 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఈఎన్‌సీ మురళీధర్, ప్రాజెక్టు సీఈ హరిరామ్‌ తెలిపారు. దీంతోపాటే పరీవాహక, ఆయకట్టు ప్రాంతాల అభివృద్ధి, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం, జీవవైవిధ్యం–వన్యమృగ సంరక్షణ, పచ్చదనం అభివృద్ధి, చేపల పెంపకం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఇప్పటికే నీటి లభ్యతకు సంబంధించిన క్లియరెన్స్‌లు వచ్చిన విషయాన్ని ప్రస్తావించి దానికి సంబంధించిన లేఖలను అందజేశారు. దీనిపై ఈఏసీ ఎలాంటి అభిప్రాయాలు తెలుపలేదని, తమ నిర్ణయాన్ని మినిట్స్‌ రూపంలో తెలియజేస్తుందని, అప్పటి వరకు వేచి చూడాల్సి ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇచ్చిన వివరణతో ఈఏసీ సంతృప్తి చెందిందని, త్వరలోనే కాళేశ్వరానికి పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

పాల్వంచలో స్టీల్‌ప్లాంటుకు అవకాశాలు పుష్కలం
- కేంద్ర మంత్రికి వివరించిన ఎంపీ పొంగులేటి

సాక్షి, న్యూఢిల్లీ: పాల్వంచలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఈ ప్రాంతంలో ఎన్‌ఎండీసీకి చెందిన 450 ఎకరాల స్థలంలోపాటు నీరు, విద్యుత్, మౌలిక వసతులు ఉన్నాయని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరీ బీరేంద్రసింగ్‌కు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌తోపాటు పాల్వంచలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలసి చర్చించారు. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రిని కలసిన వారిలో ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఉన్నారు.

రాజకీయ ఉద్యోగాల కోసమే ‘కొట్లాట’..
కొంతమంది రాజకీయ ఉద్యోగాల కోసమే ‘కొలువుల కొట్లాట’ పేరుతో ఉద్యమాలు చేస్తున్నారని జేఏసీ చైర్మన్‌ కోదండరాంను ఉద్దేశించి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి విమర్శించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీమేరకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నిరంగాల్లో ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తోందన్నారు. కొంత మంది కావాలనే రాజకీయ ప్రయోజనాలతో ఉద్యమాలు చేస్తున్నారన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top