గోమా(ఫి)య

Cattle Mafia in Amaravati - Sakshi

కాలం కలసిరాక సంతకు పాడిపశువులు

కబేళాలకు తరలిస్తున్న పశుమాఫియా

రాజధాని ప్రాంతంలో పశుసంతల్లో ఏడాదికి దాదాపు రూ.200 కోట్ల వ్యాపారం

గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి సతీమణి కీలకపాత్ర

వారానికి రూ.4 కోట్లు.. నెలకు రూ.16 కోట్లు.. ఏడాదికి రూ.200 కోట్లు.. ఏంటి.. ఈ అంకెలనుకుంటున్నారా? కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పశువులపై జరుగుతున్న వ్యాపారం ఇది. వ్యవసాయం భారంగా మారిన తరుణంలో అన్నదాత పశుపోషణ వదులుకుంటున్నాడు. రైతు అవసరాల కోసం కొంత పశుసంపద ఉంచుకున్నా.. మిగిలినది మాత్రం పశు మాఫియా ద్వారా కబేళాలకు తరలుతోంది. ప్రకృతి అనుకూలించకపోవడం.. చీడపీడల బెడద.. అక్కరకు రాని ప్రభుత్వ పథకాలు.. గిట్టుబాటు కాని ధరలు.. ఆదుకోని ప్రభుత్వం.. వెరసి వ్యవసాయానికి దూరమై వేరే వ్యాపకాలు చూసుకుంటున్న రైతులు తాము ప్రేమగా పెంచుకున్న పశువులను అమ్ముకుంటున్నారు.

సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో వారానికి ఒకరోజు జరిగే సంత పశువుల మాఫియాకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. రైతులు, పాడిపోషకులు, వ్యాపారులు ఇక్కడ పశువుల క్రయవిక్రయాలు చేస్తున్నారు. ఈ సంతల ద్వారా  మార్కెట్‌ యార్డు కమిటీలకు దండిగా ఆదాయం చేరుతోంది. ఈ మార్కెట్‌ యార్డుల కమిటీలను  పశుమాఫియా తమ చేతి కీలుబొమ్మలుగా మార్చుకుని, పశు సంపదను దోచుకుని కబేళాలకు తరలిస్తోంది. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాల, మాచర్ల, వినుకొండ, క్రోసూరులో పశువుల సంతలు ఉన్నాయి. వారంలో ఒక్కోరోజు ఒక్కో ప్రాంతంలో పశువుల సంతలు నిర్వహిస్తుంటారు. కృష్ణాజిల్లాలో జగ్గయ్యపేట యార్డు పరిధిలోని చిల్లకొల్లు గొర్రెల మండీలు, నందిగామ పశువుల సంతతో పాటు జీవాల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఆయా సంతలో గేదెలు, దున్నలు, ఎద్దులు, ఆవులు, గొర్రెలు, మేకలు సంతలకు వస్తున్నాయి. ప్రతివారం  వేల సంఖ్యలో వస్తుండగా, వచ్చిన వాటిలో 40శాతం మాత్రమే పాడిపోషణకు, వ్యవసాయ అవసరాలకు కొంటున్నారు. మిగిలిన 60 శాతం పాడి పశువులు, ఎద్దులు, ఆవులను  తమిళనాడులోని కబేళాలకు తరలిస్తున్నారు. ఇటీవల రాజధాని ప్రాంతంలో గోవులు, గేదెలను కుక్కి తీసుకెళ్తూ పట్టుబడిన కంటైనర్‌లు, లారీలే∙ఇందుకు నిదర్శనం.

అంతా ‘అమ్మ’ కనుసన్నల్లో..
గుంటూరు జిల్లాలో జరిగే పశువుల సంతలో లావాదేవీలన్నీ మంత్రి సతీమణి కనుసన్నల్లో జరుగుతాయి. చిలకలూరిపేటలో మంత్రి కీలక అనుచరుడు రంగంలోకి దిగి ప్రైవేట్‌గా సంతనే నిర్వహిస్తున్నాడు. సంత చుట్టూ ప్రహరీ నిర్మించి బౌన్సర్లను నియమించుకున్నాడు. ఆ సంతలోకి వెళ్తే.. వారు చెప్పినట్టే రైతులు ఇచ్చుకోవాలి. కాదు.. అంటే బౌన్సర్ల చేతి దెబ్బలు తిని రావాలి. ఇక్కడి నుంచే మూగజీవాలు కబేళాలకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో ఏ సంతలో పశు క్రయవిక్రయాలు జరిగినా అమ్మ అనుమతితో పాటు మంత్రి అనుచరుడికి కప్పం చెల్లించాలి. చిలకలూరిపేటలో కప్పం చెల్లిస్తే రాష్ట్ర సరిహద్దుల వరకూ ఏ స్థాయి అధికారి వాహనాన్ని అడ్డుకునేది లేదు.

నిబంధనలు ఇవీ..
పశువుల సంత నిర్వహణకు చాలా నిబంధనలు ఉన్నాయి. సంత నిర్వహణ కోసం ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడిన ఎనిమిది మందితో ఎస్‌ఎల్‌ఎంసీ కమిటీ ఏర్పాటుచేయాలి. వారు నిత్యం సంతలను పర్యవేక్షిస్తుండాలి. సంతల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి, పాకలు, పశుగ్రాసం, తాగునీటి సౌకర్యం, పశువులు రవాణా చేసే వాహనాలకు జీపీఎస్‌ (గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌) ఏర్పాటు చేయించాలి. రవాణాచేసే ప్రతి జీవానికి సంబంధిత కమిటీలో పశువైద్యుడు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలి.  సంతలో విక్రయించిన, కొనుగోలు చేసిన వివరాలను రికార్డు చేయించాలి. తక్కువ వయస్సు (యంగ్‌ యానిమల్‌) అయితే, అవి వ్యవశాయానికా, పాల దిగుబడి, లేదా పునరుత్పత్తి (బ్రీడింగ్‌) కోసమా అనే డిక్లరేషన్‌ను పశువుల కొనుగోలుదారుల వద్ద తీసుకోవాలి. ప్రొహిబిషన్‌ ఆఫ్‌ కౌ స్లాటర్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ యానిమల్స్‌ యాక్ట్‌–1977 (సెక్షన్‌–6) ప్రకారం ఇతర రాష్ట్రాలకు ఆవులను రవాణా చేయరాదు. సంత నుంచి రవాణా చేసే వాహనాల ధ్రువపత్రాలను పోలీస్, రవాణా, పశు సంవర్ధకశాఖ, మున్సిపల్‌ లేదా పంచాయతీ అధికారులు పరిశీలించాలి. కానీ, పై నిబంధనలు ఎక్కడ అమలుకావు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top