కుల రాజకీయాలకు వేదికలు.. కేజీబీవీలు! | Caste politics plays in kasturba vidyalayalu | Sakshi
Sakshi News home page

కుల రాజకీయాలకు వేదికలు.. కేజీబీవీలు!

Nov 30 2014 10:58 PM | Updated on Sep 2 2017 5:24 PM

జిల్లాలోని కస్తూర్బా విద్యాలయాలు కుల రాజకీయాలకు వేదికలవుతున్నాయి

సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లాలోని కస్తూర్బా విద్యాలయాలు కుల రాజకీయాలకు వేదికలవుతున్నాయి. నిన్న అల్లాదుర్గం నేడు పుల్‌కల్ కేజీబీవీలో చోటు చేసుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం.  కిందిస్థాయి సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించడం లేదని పాఠశాల ్రపత్యేకాధికారి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తే కింది స్థాయి సిబ్బంది మాత్రం కుల రాజకీయాలతో రాద్ధాంతం సృష్టిస్తున్నారు. పుల్‌కల్ కస్తుర్బాబా పాఠశాలలో పని చేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయురాలు విద్యార్థులకు క్రీడలు నిర్వహించకుండా బోధన సిబ్బంది మాదిరిగానే వచ్చి వెళ్తున్నారు. దీనిపై పాఠశాల ప్రత్యేకాధికారి, జిల్లా ప్రాజెక్టు అధికారికి ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదుపై జేసీడీఓ విచారణ చేపట్టగా  చలికాలమైనందున విద్యార్థులకు క్రీడలు నిర్వహించడం లేదని వ్యాయమ ఉపాధ్యాయురాలు సంజాయిషీ ఇచ్చుకున్నారు.  ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 3.30కి ఆమె తిరిగి వెళ్లిపోతోందని జేసీడీఓ విచారణ చేపట్టిన సమయంలో విద్యార్థులు ఫిర్యాదు చేసినా,  ఉన్నతాధికారులు ఆమెపై చర్యలు చేపట్టలేదు. పైగా నోటీసులతోనే సరిపెడుతున్నారు. ఇదే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న తెలుగు సీఆర్టీ రామాయంపేట నుంచి వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది స్థానికంగా ఉండాలనే నిబంధనను ఎవరూ పాటించడంలేదు. ఇక్కడ పనిచేస్తున్న వారిలో  సంగారెడ్డి, రామాయంపేట తదితర ప్రాంతాల నుంచి వచ్చే వారే అధికం. దీంతో కింది స్థాయి సిబ్బంది ప్రత్యేకాధికారిపై ఒత్తిడి తెచ్చి తమకు అనుకులంగా వ్యవహరించేలా మార్చుకుంటున్నారు.

స్థానికులైన సిబ్బందివల్లే ఇబ్బందులు
పాఠశాలలో పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బంది స్థానికులు కావడం, వారి బంధువులు విధుల నిర్వహణలో జోక్యం చేసుకోవడంతో తరచుగా వివాదాలు చోటుచేసుకుంటున్నట్లు తెలిసింది. పుల్‌కల్ కేజీబీవి పాఠశాలలో అటెండర్ భర్త తరుచుగా హాస్టల్‌కు వచ్చి విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారనే విషయంపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కాగా సదరు ఉద్యోగి భర్త బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని సంవత్సరానికి రూ.10 వేలు ఇవ్వాలని లేదంటే పత్రికల వారికి చెప్పి రాయిస్తానని బెదరిస్తున్నట్లు ఎస్‌ఓ ఆరోపించారు.

ఈ విషయమై రికార్డు చేసి వినిపించినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రత్యేకాధికారితో సన్నిహితంగా ఉండే విద్యార్థినులను పై తరగతి విద్యార్థులతో కొట్టిస్తున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. పాఠశాలలో పనిచేస్తున్న అకౌంటెంట్ సైతం విద్యార్థినుల పట్ల దుర్భాషలాడుతున్నారని పలువురు విద్యార్థులు తెలిపారు.  పుల్‌కల్ కస్తూర్బా గాంధీ పాఠశాలలో పీఈటీతో పాటు తెలుగు సీఆర్టీ టీచర్లు తమను వేధిస్తున్నట్లు విద్యార్థినులు ఆరోపించారు.

నిజనిర్ధారణ చేపట్టాలి
పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయురాలు తనపై  విద్యార్థినులను ఉసిగొల్పి, ఫిర్యాదు చేయిస్తున్నారని ఎస్‌ఓ ఇందిర ఆరోపించారు. అలాగే అటెండర్ భర్త బ్లాక్ మెయిల్ చేస్తూ వేధిస్తున్నాడని, ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.  తనతో సన్నిహితంగా ఉండే విద్యార్థినులను పై తరగతి విద్యార్థినులతో రాత్రి వేళల్లో దాడి చేయిస్తున్నారన్నారు. అయినప్పటికీ జేసీడీఓ, పీఓలు వారికే వత్తాసు పలుకుతున్నారన్నారు. తనను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా తనను టార్గెట్‌చేయడం సరికాదని అవసరమైతే నిజనిర్ధారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement