మరీ ఇంత పిచ్చిగానా?.. ప్రజలు గమనిస్తున్నారు బాబూ.. | Sakshi
Sakshi News home page

మరీ ఇంత పిచ్చిగానా?.. ప్రజలు గమనిస్తున్నారు బాబూ..

Published Mon, Oct 30 2023 3:25 PM

Kommineni Srinivasa Rao Comments On Tdp Caste Politics - Sakshi

అవినీతి కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఇప్పటికే కేవలం కమ్మ కుల నాయకుడిగా మార్చి మరీ పిచ్చిగా, ఆ కులానికి చెందిన కొందరు ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారు. మొత్తం ప్రపంచం అంతా చంద్రబాబు అరెస్టుపైనే ఆందోళనతో ఉన్నట్లు చిత్రించడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర కొన్ని టీడీపీ  మీడియా సంస్థలు చేస్తున్న యత్నాలు కూడా ఇదంతా కమ్మ కులం అతి అన్న విమర్శలకు ఆస్కారం ఇస్తున్నాయి. చంద్రబాబు జైలులో ఉంటే కృతజ్ఞతా సభల పేరుతో అవి అభినందన సభలో, సానుభూతి సభలో, సంతాప సభలో అర్థం కాని రీతిలో సంగీత విభావవరిలు నిర్వహిస్తున్నారు. అది కూడా పొరుగు రాష్ట్రమైన హైదరాబాద్‌లో..

✍️మరో వైపు ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై ఖమ్మంలో కొందరు దాడి చేసి నోటికి వచ్చినట్లు దూషించడం దారుణం. ఇంత కాలం ఆ కులం వారికి కాస్త సభ్యత, సంస్కారం ఉంటాయిలే అనుకున్నవారందరికి, ఇదేమిటి! ఈ కమ్మోళ్లు ఇంత నీచంగా మారారు అన్న అభిప్రాయం తెప్పిస్తున్నారు. ఒకవేళ రాంబాబుకు ఏమైనా జరిగి ఉంటే ఏమయ్యేది. అది మళ్లీ రెండు కులాల మధ్య రగడగా మారేది కాదా!. టీడీపీ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగాను హత్య చేసినప్పుడు ఆంధ్ర ప్రాంతం అంతా ఎలా అట్టుడికిందో తెలిసి కూడా కొంతమంది ఇలా మూర్ఖంగా ప్రవర్తించడం దురదృష్టం.

✍️అంబటి రాంబాబు తనను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని ఇప్పటికే ఆరోపించారు. ఆయననే కాదు. కొడాలి నాని వంటి నేతలను చంపితే ఏభై లక్షలు ఇస్తామని కమ్మ సంఘం సమావేశంలో ఒక వ్యక్తి అంటే అది ఎంత వైరల్ అయిందో అందరికి తెలుసు. దాని వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగితే ప్రమాదం ఏమీ లేదు. కాని కమ్మ కులంలో పుట్టినవారందరిని ఇతరులు అసహ్యించుకునే పరిస్థితి తెస్తున్నారు. ఇదంతా ఎవరి కోసం! ఏ కులాన్ని ఉద్దరించడం కోసం! ఎవరో కొందరు తెలివి తక్కువవాళ్లు చేసే చెత్త పనులకు ఆ కులంలో ఉన్నవాళ్లంతా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. మిగతా సమాజానికి దూరం అయ్యేలా చేస్తున్నారు.

✍️నిజానికి ఎవరూ చెప్పి ఫలానా కులంలో పుట్టరు. కాని మన సమాజంలో కుల వ్యవస్థ అన్నది ఒక వాస్తవంగా తయారైంది. త్రిపురనేని రామస్వామి చౌదరి వంటివారు ఈ కుల వ్యవస్థపై పోరాటాలు జరిపారు. మురళీమోహన్ వంటి సినీ ప్రముఖులకు చంద్రబాబు అంటే అభిమానం ఉండవచ్చు. ఆయన వల్ల రాజకీయంగా, ఆర్ధికంగా లబ్ది పొంది ఉండవచ్చు. అంత మాత్రాన చంద్రబాబు అరెస్టుతో ప్రపంచం అంతా మునిగిపోయినట్లు, కమ్మ వారందరికి ఏదో అయిపోయినట్లు, అసలు చంద్రబాబు అవినీతికే పాల్పడనట్లు మాట్లాడుతున్న తీరు కూడా అభ్యంతరకరంగా ఉంది. బహుశా మరే కులంలో ఇంత పిచ్చి ఉండదని జనం అనుకునేలా చేస్తున్నారు.

✍️నిజంగానే అవినీతి లేకపోతే చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ 118 కోట్లకు నోటీసు ఎందుకు ఇచ్చింది. రెండువేల కోట్ల అక్రమాలు జరిగాయని సీబీటీడీ గతంలో ఎందుకు ప్రకటన చేసింది? చంద్రబాబు మాజీ పి.ఎస్. పెండ్యాల శ్రీనివాస్ ఎందుకు అమెరికా పారిపోయాడు? వీటికి వీరెవ్వరూ జవాబు ఇవ్వడం లేదు. చంద్రబాబు లేకపోతే హైదరాబాద్ లేదనేంత స్థాయికి  ఈ వర్గం ప్రచారం చేయడం హాస్యాస్పదం. ఆ మాటకు వస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బారేజీ, పోచంపాడు, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు తదితర ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన గొప్పవాళ్లందరిని ఏమి అనుకోవాలి. హైదరాబాద్ లో కొందరు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు,  పాటల కార్యక్రమాలు అన్ని అదేదో ఐటి నిపుణులనో, వేరే ఫ్రొఫెషనల్స్ చేస్తున్నారని  ఎందుకు ప్రచారం చేస్తున్నారు. వాటిలో పాల్గొంటున్నవారిలో తొంభై శాతం మంది కమ్మవారే అన్న సంగతి బహిరంగ రహస్యమే.

✍️ఆ మధ్య వీరి పైత్యం ఎక్కడివరకు వెళ్లిందంటే మెట్రో రైలులో ఎక్కి నిరసనలు తెలిపేవరకు. అక్కడ ఒకాయన ఇదేమి పని అడగవలసి వచ్చింది. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్‌లో అలాంటి ఆందోళనలు చేయదలిస్తే ఆ పార్టీ పేరుతోనే చేయాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి కుహానా మీడియాలను అడ్డం పెట్టుకుని వేరుపేర్లతో ఎందుకు చేయడం. లేదంటే ధైర్యం ఉంటే కమ్మ సంఘం పేరుతో నిరసనలు చేపట్టగలగాలి. ఈ మధ్య కొన్ని చోట్ల కమ్మ సంఘం సమావేశాలు జరిపి చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. ఇంతవరకు క్లారిటీ ఉన్నట్లు లెక్క. అలాకాకుండా తెలుగుదేశం పార్టీవారే నిరసనలు చెబుతూ, ఏవేవో పేర్లు తగిలించడం వల్ల ఈనాడు వంటి మీడియాలలో ప్రచారానికి ఉపయోగపడుతుందే తప్ప ఇంకో ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారు.

✍️సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చేస్తుంటాయి. ఒకప్పుడు ఈనాడు అధినేత రామోజీరావు కులాలకు అతీతంగా ఉండాలని, అవినీతి ఎక్కడ జరిగినా ఉపేక్షించరాదని నీతులు చెబుతుండేవారు. చివరికి ఆయనే ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా మారారన్న అభియోగాలకు గురికావడం, అవినీతిని పూర్థిస్థాయిలో సమర్ధించడం చూస్తుంటే ఇంతకాలం ఈయన జనాన్నిమోసం చేశారా అన్న భావన ఏర్పడదా! చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టు అయితే కమ్మవారు ఇంతగా కలత చెందవలసిన అవసరం ఏమి ఉంటుంది? ఆయనతోటే కమ్మకులం లేదు. లేదా ఆయన కమ్మవారిపైనే ఆధారపడి ఉండరు.

✍️నిజానికి చంద్రబాబు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో కుమ్మక్కై ఏపీకి పరిశ్రమలే రాకుండా  ఎంత నష్టం చేశారో వీరికి తెలియదా! కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం, ఆ తర్వాత దానిని వదిలివేయడం,ఇప్పుడు బీజేపీ పొత్తు కోసం అర్రులు చాచడం, మరో వైపు కాంగ్రెస్ కు తెలంగాణలో మేలు చేయడం కోసం కమ్మవారిలో ఎక్కువ మంది ఓట్లు కాంగ్రెస్ కు వేసేలా ప్లాన్ చేయడం.. ఇవన్ని సమాజానికి మంచిదా! తెలంగాణలో టీడీపీ ఎందుకు పోటీచేయడం లేదో ప్రజలు ఊహించలేరా? ఇతర రాజకీయ పార్టీలు గమనించలేవా?ఇలాంటి అనైతిక రాజకీయాలు చేస్తూ దానికి కులం రంగు పులిమి ఆ వర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్న రాజకీయం ఎవరికి ఉపయోగం?. చంద్రబాబుకు హైదరాబాద్‌లో అంత ప్రజాభిమానం  ఉందనుకుంటే టీడీపీ ఇప్పుడు ఎందుకు అక్కడ పోటీచేయడం లేదు.

✍️అసలు 2004లోనే ఇప్పుడు హైటెక్ సిటీ ప్రాంతంగా ఉన్న చోట టీడీపీ ఘోరంగా ఓడిపోయిందే. కులం పునాదితో  ఏ పార్టీ మనలేదన్న సంగతి వీరు గుర్తించాలి. ఏపీ ప్రజలను హైదరాబాద్ నుంచి ప్రభావితం చేయడానికో, న్యాయ వ్యవస్థపై ఒత్తిడి పెంచడానికో సభలు పెడితే వాటిని నమ్మడానికి అమాయకపు కాలం కాదు. గ్రాఫిక్స్ కాలం అంతకన్నా కాదు. చంద్రబాబు కేసులో నిరసనలు చెప్పడమే తప్పు. నిజంగా అక్రమ కేసులు అయితే సీఐడీ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. కోర్టులలో తమ వాదనలు వినిపించాలి. అవన్ని వదలివేసి ప్రజలలో అలజడి సృష్టించాలని చూడడం, అదేదో ఒక కులానికి వ్యతిరేకం అన్న కలరింగ్ ఇవ్వడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. పార్టీ పరంగా ఏమైనా చేసుకోండి. కులానికి మాత్రం ఈ బురద పులమకుండా ఉంటే మంచిదని చెప్పాలి.


:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Advertisement
Advertisement