కోడ్‌ ఉల్లంఘిస్తే కేసులు

Cases of violation of election code - Sakshi

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి

సూర్యాపేట: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు.. రుజువైతే పదవిని కోల్పోతారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సూర్యాపేట జిల్లా శాంతినగర్‌లోని పోలీస్‌గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. వేలం పాటల ద్వారా గ్రామ పంచాయతీ పదవులను ఏకగ్రీవాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. సంక్రాంతి సెలవుల్లో సైతం సిబ్బంది పనిచేయడం హర్షణీయమన్నారు. ఎంపీడీఓలు సర్పంచ్‌ పదవికి అభ్యర్థులు ఖర్చు చేసే వ్యయాలను లెక్కిస్తారని పేర్కొన్నారు. పోలింగ్‌ శాతం భారీగా నమోదయ్యే విధంగా గ్రామాల్లో అవగాహన కల్పించామని తెలిపారు.

అయితే ఓటర్లను ప్రలోభపెడితే పోలీస్‌ కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలింగ్‌ అధికారులకు రెండో విడత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ ఎన్నికలు శాసనసభ ఎన్నికల మాదిరిగా ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్‌ పేపర్లతో నిర్వహిస్తున్నామని వాటికి అవసరమైన బ్యాలెట్‌ పేపర్లు ఇప్పటికే ముద్రించి అన్ని మండలాలకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువగా ఖర్చు చేస్తే అభ్యర్థి ఎన్నిక రద్దు అవుతుందని వెల్లడించారు. అలాగే న్యాయస్థానం ద్వారా విచారణ ఎదుర్కోవాలని.. అలాంటి సందర్భంలో అవసరమైతే ఏడాది జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఆయన వెంట జిల్లా పరిశీలకుడు టి.చిరంజీవులు, కలెక్టర్‌ దుగ్యాల అమయ్‌కుమార్, ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top