అంతర్జాతీయ జ్యూరీగా కార్టూనిస్టు శంకర్‌

Cartoonist Shankar Was The International Jury Member Of Prestigious Contest - Sakshi

ట్రంపిజమ్‌పై కార్టూన్, క్యారికేచర్ల పోటీ

ఈనెల 11న ఇరాన్‌లో అవార్డుల ప్రదానోత్సవం   

సాక్షి, హైదరాబాద్‌: కార్టూన్లు, క్యారికేచర్ల రంగంలో వినూత్న పోటీ ముగిసింది. అభిశంసన వరకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఇరాన్‌ కార్టూన్‌ డాట్‌ కామ్‌ నిర్వహించిన ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా 79 దేశాల నుంచి 625 మంది ఆర్టిస్టులు భాగస్వాములయ్యారు. తాము గీసిన 1,864 ఆర్ట్‌ వర్కులను పోటీకి పంపించారు. ఇందులో భారత్‌తో పాటు బ్రెజిల్, ఇండోనేషియా, అర్జెంటీనా, చైనా, కొలంబియా, మెక్సికో, ఈజిప్టు, పోలండ్, రుమేనియా, స్పెయిన్, టర్కీ, ఉక్రెయిన్‌ తదితర దేశాల ప్రముఖ కార్టూనిస్టులు, క్యారికేచరిస్టులు తమ ఎంట్రీలను పంపించారు. ఈ ప్రతిష్టాత్మకమైన పోటీకి అంతర్జాతీయ జ్యూరీగా ‘సాక్షి’చీఫ్‌ కార్టూనిస్ట్‌ శంకర్‌ వ్యవహరించారు. ఈ పోటీ కోసం వచ్చిన కార్టూన్లు, క్యారికేచర్లను శంకర్‌తో పాటు ఇండోనేషియాకు చెందిన కార్టూనిస్టు జీతెత్‌లు పరిశీలించి విజేతను ఎంపిక చేశారు.

ఈ పోటీ విజేతలను ఈనెల 11న ప్రకటించి ఇరాన్‌లోని టెహ్రాన్‌ నగరంలో అవార్డులను అందజేయనున్నారు. ఈ అవార్డులను అంతర్జాతీయ జ్యూరీలు శంకర్, జీతెత్‌ల చేతుల మీదుగా అందజేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఫెడరేషన్‌ ఆఫ్‌ కార్టూనిస్ట్స్‌ ఆర్గనైజేషన్స్‌ (ఫెకో) అధ్యక్షుడు పీటర్‌ నువెండ్జిక్, ఉపా«ధ్యక్షుడు విలియం రీజింగ్‌లు కూడా హాజరు కానున్నారు. అంతర్జాతీయ స్థాయి కార్టూన్ల పోటీకి శంకర్‌ న్యాయనిర్ణేతగా వ్యవహరించడంతో పాటు, అవార్డుల ప్రదానోత్సవానికి ఇరాన్‌ వెళ్లడం ఇది రెండోసారి కావడం గమనార్హం. మరో విశేషమేమిటంటే ఈ కార్టూన్ల పోటీకి లోగోగా ట్రంప్‌పై శంకర్‌ గీసిన కేరికేచర్‌నే ఉపయోగించడం భారత కార్టూనిస్టు రంగానికి వన్నె తెచ్చింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top