కోఆర్డినేటర్‌ వ్యవస్థను రద్దు చేయండి | Cancel the coordinator system says Thalasani | Sakshi
Sakshi News home page

కోఆర్డినేటర్‌ వ్యవస్థను రద్దు చేయండి

Apr 22 2018 3:01 AM | Updated on Sep 26 2018 6:15 PM

Cancel the coordinator system says Thalasani - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తలసాని

సాక్షి, హైదరాబాద్‌: సినిమారంగంలో వివిధ పరిణామాలకు దారితీస్తున్న కోఆర్డినేటర్‌ వ్యవస్థను రద్దు చేసి, వారి స్థానంలో మేనేజర్‌ స్థాయి వ్యక్తులను కొనసాగించాలని సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నారు. ఆర్టిస్టులకు ప్రొడ్యూసర్స్‌ చెల్లిస్తున్న రెమ్యునరేషన్‌ నేరుగా వారి ఖాతాల్లో జమయ్యే విధంగా చూడాలని, అంతేకాకుండా ఆయా రంగాల్లోని వారికి చెల్లిస్తున్న రెమ్యునరేషన్‌ను షూటింగ్‌ ప్రాంతాలలో ప్రదర్శించాలని, ప్రొడ్యూసర్స్‌ కార్యాలయాలలో బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం, చలనచిత్ర రంగ ప్రముఖులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని శనివారం సచివాలయంలో తలసాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైనా అంశంపై మీడియా ముందుకు వెళ్లేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, ఇందులో అన్ని రంగాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసుకునేలా జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచించారు.

కచ్చితమైన నిబంధన లను రూపొందించి వాటిని అతిక్రమించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించేందుకు ఒక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మా జనరల్‌ సెక్రటరీ నరేశ్‌ పేర్కొన్నారు. ఆర్టిస్టుల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు ఎఫ్‌డీసీలో ప్రత్యేక ఫిర్యాదుల సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. వేధింపులు, మోసాలకు గురయ్యే మహిళలు ఈ సెల్‌లో కానీ, షీ టీమ్స్‌కు కాని ఫిర్యాదు చేయాలని తెలిపారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొ స్తున్న ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లను నియం త్రించేందుకు మార్గదర్శకాలను రూపొం దించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

మహిళలకు షూటింగ్‌ ప్రాంతాలలో కనీస సౌకర్యాలను కల్పించాలని, ఆడిషన్స్‌ నిర్వహించే సమయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. వారం, పదిరోజుల్లో కమిటీ సమావేశాలు నిర్వహించి ఇటీవల జరిగిన పరిణామాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తుది నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తే, అన్నివర్గాల వారితో చర్చించి మహిళా ఆర్టిస్టులకు తగు రక్షణ కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని మంత్రి వారికి వివరించారు.

ఈ సమావేశంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ రాంమోహన్‌రావు, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రాజీవ్‌ త్రివేదీ, కార్మికశాఖ కమిషనర్‌ మహ్మద్‌ నదీమ్, ఎఫ్‌డీసీ ఈడీ కిషోర్‌బాబు, సీఐడీ ఎస్పీ అపూర్వారావు, మా అధ్యక్షుడు శివాజీరాజా, తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్‌.శంకర్, చిత్ర ప్రముఖులు జీవిత, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, జెమిని కిరణ్, సి.కళ్యాణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement