శిబిరానికి గుడ్‌బై! | Camps offices removed in cities | Sakshi
Sakshi News home page

శిబిరానికి గుడ్‌బై!

Jun 4 2014 11:56 PM | Updated on Mar 28 2018 10:59 AM

జిల్లా పరిషత్ చైర్మన్‌గిరీ క్యాంపు రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. తడిసిమోపెడవుతున్న భారాన్ని భరించలేక కాంగ్రెస్ పార్టీ క్యాంపు ఎత్తివేసింది.

 సాక్షి, రంగారెడ్డి జిల్లా:  జిల్లా పరిషత్ చైర్మన్‌గిరీ క్యాంపు రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. తడిసిమోపెడవుతున్న భారాన్ని భరించలేక కాంగ్రెస్ పార్టీ క్యాంపు ఎత్తివేసింది. చైర్మన్ ఎన్నికపై ప్రభుత్వం ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం.. ఇప్పటికే క్యాంపుల నిర్వహణతో జేబులు ఖాళీ అవుతుండడంతో జెడ్పీటీసీలను ఇంటిదారి పట్టించింది. స్పష్టమైన మెజార్టీ రాకపోయినప్పటికీ, అధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.. ఈసారి ఎలాగైనా జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని భావించింది. చిరకాల ప్రత్యర్థి టీడీపీతో దోస్తీ కట్టడం ద్వారా కుర్చీని ఎగురేసుకుపోవాలని ఆశించింది. ఈ క్రమంలో 14మంది జెడ్పీటీసీలను విహార యాత్రకు త రలించింది.

గత పక్షం రోజులుగా గోవాలో విహరించిన సభ్యులకు మోహం మోత్తింది. ఇంటి బెంగ కూడా పట్టుకుంది. ఇప్పటివరకు  నోటిఫికేషన్ రాకపోవడం, ఎప్పుడు వస్తుందో తెలియకపోవడం కూడా వారిని ఇంటికి వెళ్లేందుకు ప్రేరేపించింది. మరోవైపు శిబిరాల నిర్వహించలేక సతమతమవుతున్న చైర్మన్ పదవి ఆశావహుడు సైతం.. క్యాంపునకు తాత్కాలిక విరామం ప్రకటించాలని నిర్ణయించారు. దీంతో కొంతమేర ఖర్చును తగ్గించుకోవచ్చని ఆశించారు. ఈక్రమంలోనే శిబిరాన్ని ఎత్తివేశారు. దీంతో ఆ పార్టీ సభ్యులు ఇంటిముఖం పట్టడంతో అసలు కథ మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పగ్గాలు చేజిక్కించుకున్న టీఆర్‌ఎస్ తాజాగా జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలనే లక్ష్యానికి మరింత పదును పెట్టింది.

ఎక్కువమంది సభ్యులున్న కాంగ్రెస్ క్యాంపుపై చేతులెత్తేయడంతో.. ఆ పార్టీ సభ్యులపై గులాబీ శిబిరం గురిపెట్టింది. దీంతో జెడ్పీ రాజకీయం రసకందాయంలో పడింది. జిల్లా పరిషత్‌లో 33 సభ్యులకుగాను కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలను కైవసం చేసుకోగా.. టీఆర్‌ఎస్ 12, టీడీపీ ఏడు స్థానాలను గెలుచుకున్నాయి. జెడ్పీ పీఠం దక్కాలంటే కనిష్టంగా 17 మంది సభ్యులుం డాలి. అయితే ఏపార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో.. ప్రధాన పార్టీలు పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి ప్రత్యర్థి పార్టీల సభ్యులను ఆకర్షించుకునే ఎత్తుగడ వేశాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు పోటాపోటీగా శిబిరాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ శిబిరం ఎత్తేయడంతో ఆ పార్టీ సభ్యులు ఇంటిబాట పట్టారు. అయితే ఇదే అదనుగా భావించిన టీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ సభ్యులను తమ దారికి తెచ్చుకునే పనిలో పడింది. ఒకవైపు కేబినె ట్‌లో బెర్తు దక్కించుకున్ను టీఆర్‌ఎస్ నేత.. జెడ్పీ పీఠాన్ని సైతం కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement