బెటర్‌ఫ్లై

Butterfly Park in Nehru Zoological Park hyderabad - Sakshi

నెహ్రూ జూలాజికల్‌ పార్కులో బటర్‌ఫ్లై పార్క్‌

సుమారు 155 రకాల సీతాకోక చిలకలు

సందర్శకులను అలరిస్తున్న పచ్చికబయళ్లు     

సువాసనలు వెదజల్లే పుష్పాలతో ఆహ్లాదకరం

బహదూర్‌పురా: ప్రకృతి రమణీయతను సీతాకోక చిలకలు ద్విగుణీకృతం చేస్తున్నాయి. జూ సందర్శకులను తన్మయత్వానికి గురిచేస్తున్నాయి. నెహ్రూ జూలాజికల్‌ పార్కులోని బటర్‌ఫ్లై పార్కు అమితంగా ఆకర్షిస్తోంది. ఇటీవల పునర్నిర్మాణంతో అందుబాటులోకి వచ్చిన ఓపెన్‌ బటర్‌ఫ్లై పార్కులో ఎన్నో రకాల సీతాకోక చిలుకలు సందర్శకులను అలరిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 17 వేల సీతాకోక చిలకలలో భారతదేశంలో 1,500 రకాలు ఉన్నాయి. ఇందులో 155కుపైగా వివిధ రకాల సీతాకోక చిలకల్ని హైదరాబాద్‌ జూపార్కులో చూడవచ్చు. పార్కు చుట్టూ సువాసనలు వెదజల్లే పూల చెట్లు ఉన్నాయి. సీతాకోక చిలకల కోసం ప్రత్యేకంగా కొన్ని రకాల చెట్లను ఈ పార్కులో నాటారు. దీంతో సీతాకోక చిలకల పార్కు సందర్శకుల మదిని దోచుకుంటోంది.

ముఖద్వారం..నయనానందకరం

సీతాకోక చిలకల పార్కు ముఖద్వారాన్ని వివిధ రంగులతో తీర్చిదిద్దారు. బయట గేటుతో పాటు లోపల పచ్చిక బయలు, వివిధ రకాల సువాసనతో కూడిన పూల మొక్కలతో పార్కు ప్రదేశమంతా ఆహ్లాదకరంగా ఉంది. సందర్శకులకు మానసికోల్లాసాన్ని, ప్రశాంతతను ఇస్తోంది. 

కీటకాల మ్యూజియం..

వివిధ రకాల క్రిమికీటకాల మ్యూజియం కూడా ఓపెన్‌ బటర్‌ఫ్లై పార్కులో ఏర్పాటు చేశారు. క్రిమికీటకాలు ప్రారంభ దశ నుంచి మార్పు చెందే విధానాన్ని వివరించే బోర్డు మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఎన్నో రకాల క్రిమికీటకాల గురించి తెలుసుకునేందుకు ఈ మ్యూజియం ఒక విశ్వవిద్యాలయమేనని చెప్పవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇంటిల్లిపాదీ బటర్‌ఫ్లై పార్కును సందర్శించి ప్రకృతి రమణీయతను ఆస్వాదించండి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top