బడ్జెట్‌కు తగ్గట్లే.. ఖరీఫ్‌ టార్గెట్‌! | budget allocation for irrigation projects | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌కు తగ్గట్లే.. ఖరీఫ్‌ టార్గెట్‌!

Mar 14 2017 2:04 AM | Updated on Sep 5 2017 5:59 AM

బడ్జెట్‌కు తగ్గట్లే.. ఖరీఫ్‌ టార్గెట్‌!

బడ్జెట్‌కు తగ్గట్లే.. ఖరీఫ్‌ టార్గెట్‌!

కోటి ఎకరాల తెలంగాణ లక్ష్యంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు ఈ ఏడాది బడ్జెట్‌ కేటాయింపులు ఎంత భారీగా ఉన్నాయో..

►17 ప్రాజెక్టుల కింద 8.73 లక్షల ఆయకట్టు లక్ష్యం
►ఈ ఖరీఫ్‌లోనే 12 ప్రాజెక్టులు పూర్తిగా.. మరో ఐదు పాక్షికంగా పూర్తి
►వీటికి రూ.11 వేల కోట్ల కేటాయింపులు జరిపిన ప్రభుత్వం  


హైదరాబాద్‌: కోటి ఎకరాల తెలంగాణ లక్ష్యంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు ఈ ఏడాది బడ్జెట్‌ కేటాయింపులు ఎంత భారీగా ఉన్నాయో.. ఆ ప్రాజెక్టుల కింద ఖరీఫ్‌ ఆయకట్టు లక్ష్యాలు కూడా అంతే భారీగా ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 12 ప్రాజెక్టులను 100 శాతం పూర్తి చేయడం, మరో 5 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి సుమారు 8.73 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు పూర్తిస్థాయి సాగు నీరివ్వడం నీటి పారుదల శాఖకు కత్తిమీద సాము కానుంది. రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకి నీటిని అందించేందుకు 2004–05లో రూ.1.37 లక్షల కోట్లతో 34 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులను చేపట్టారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం, భక్తరామదాస ప్రాజెక్టులను చేపట్టింది. ఈ మొత్తం ప్రాజెక్టుల ద్వారా 60 లక్షల ఎకరాల మేర నీరివ్వాలని సంకల్పించగా ఇప్పటివరకు కొత్తగా 11,36,108 ఎకరాల ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది.

ఇందులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 5,21,211 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించగలిగారు. కల్వకుర్తి కింద 1.60 లక్షలు, నెట్టెంపాడు కింద 1.20 లక్షలు, భీమాలో 1.40 లక్షల ఎకరాల ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. దేవాదుల కింద కూడా 60 వేల ఎకరాల నుంచి 1,22,670 ఎకరాలకు ఆయకట్టు పెరిగింది. సింగూరు కింద 40 వేల ఎకరాలకు నీరందించారు. మరోవైపు ఈ ఏడాది జూన్, జూలై నాటికి కొత్తగా మరో 8.73 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరిచ్చేలా ప్రణాళిక తయారైంది. ఇందులో 12 ప్రాజెక్టులను పూర్తిగా, మరో 5 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

పాలమూరులో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు, ఎస్సారెస్పీ స్టేజ్‌–2, ఎల్లంపల్లి, లోయర్‌ పెన్‌గంగ, ఎస్‌ఎల్‌బీసీ వంటి ప్రాజెక్టులున్నాయి. తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం ఈ 17 ప్రాజెక్టులకే బడ్జెట్‌లో రూ.11,022 కోట్ల మేర కేటాయింపులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement