సన్నాలకు రెక్కలు | BPT rice Price increase in Nalgonda | Sakshi
Sakshi News home page

సన్నాలకు రెక్కలు

Aug 22 2014 3:38 AM | Updated on Jul 6 2019 3:18 PM

సన్నాలకు రెక్కలు - Sakshi

సన్నాలకు రెక్కలు

సన్న బియ్యం (బీపీటీ) ధరలకు రెక్కలొచ్చాయి. వాటిని సామాన్యులు తినే పరిస్థితి లేకుండా పోయింది. నెల రోజుల క్రితం పాత బియ్యం క్వింటా రూ.3800, కొత్త బియ్యం రూ.3400లకు విక్రయించారు.

నల్లగొండ :సన్న బియ్యం (బీపీటీ) ధరలకు రెక్కలొచ్చాయి. వాటిని సామాన్యులు  తినే పరిస్థితి లేకుండా పోయింది. నెల రోజుల క్రితం పాత బియ్యం క్వింటా రూ.3800, కొత్త బియ్యం రూ.3400లకు విక్రయించారు. కానీ ప్రస్తుతం పాత బియ్యాన్ని రూ.4000 నుంచి రూ.4200 వరకు అమ్ముతుం డగా, కొత్త బియ్యం క్వింటా రూ.3600లకు విక్రయిస్తున్నారు. బియ్యం ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం రైస్‌మిల్లర్ల సహకారంతో జిల్లాలో రూ.30 కిలోబియ్యం కేంద్రాలు ఏర్పాటు చేసినా ఎలాంటి ఫలితం రాలేదు.

ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగువిస్తీర్ణం భారీగా తగ్గింది. ఇది మిల్లర్లకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సుమారుగా ఐదు లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. దీంతో బీపీటీ ధాన్యం భారీగా వచ్చింది. అయినప్పటికీ దోమపోటు వల్ల రైతులు తమవద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తిగా మిల్లర్లకు విక్రయించారు. ప్రస్తుత ఖరీఫ్‌లో కేవలం లక్ష ఎకరాల్లో మాత్రమే వరిసాగు అయ్యింది. దీంతో రాబోయే రోజుల్లో బియ్యానికి మరింత డిమాండ్ ఉండే పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఇప్పటినుంచే మిల్లర్లు బియ్యం ధరలు పెంచుతున్నట్టు తెలుస్తోంది.
 
 మిల్లుల్లో భారీగా ధాన్యం నిల్వలు
 జిల్లాలోని పలుమిల్లుల్లో బీపీటీ ధాన్యం నిల్వలు భారీగా ఉన్నాయి. గత ఖరీఫ్ సీజన్‌లో రైతులనుంచి మిల్లర్లు క్వింటా బీపీటీ ధాన్యం రూ.1600 నుంచి రూ.1700 వరకు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు భారీగా నిల్వ చేసుకున్నారు. అప్పుడు ధర కూడా అంతంతమాత్రంగానే ఉంది. పచ్చిబియ్యం కేవలం హైదరాబాద్‌కు మినహా ఇతర రాష్ట్రాల్లో విక్రయించుకోవడానికి కూడా పర్మిట్లు లేకపోవడంతో స్థానికంగానే విక్రయిస్తున్నారు. అయినా మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని బియ్యంగా మార్చకుండా నిల్వపెట్టుకుంటున్నారు. ఒక్కో రైస్‌మిల్లులో లక్ష క్వింటాళ్లకు పైగా ధాన్యం నిల్వలు ఉన్నాయి. రైతుల చేతినుంచి పూర్తిగా మిల్లర్ల చేతిలోకి బీపీటీ ధాన్యం వెళ్లిన తర్వాత ప్రస్తుతం క్వింటా బీటీపీ ధాన్యం రూ.2200 ధర పలుకుతోంది.
 
 ఫలితమివ్వని కిలో రూ.30బియ్యం విక్రయ కేంద్రాలు
 సన్నబియ్యం ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం రైస్‌మిల్లర్ల సహకారంతో జిల్లాలో  ఏర్పాటు చేసిన రూ.30 కిలో బియ్యం కేంద్రాలతో ఎలాంటిఫలితం రాలేదు. సన్నబియ్యం విక్రయ కేంద్రాలలో బియ్యం కొనుగోలు చేయడానికి వినియోగదారులు ముందుకు రావడం లేదు. జిల్లా వ్యాప్తంగా 15 కేంద్రాలలో ఇప్పటి వరకు 2169 క్వింటాళ్ల బియ్యం మాత్రమే విక్రయించారు. రూ. 30 కిలో బియ్యం కేంద్రాలలో బియ్యం నాణ్యతగా ఉండడం లేవని వినియోగదారులు కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు.దీంతో చాలావరకు మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీపీటీ బియ్యం ధరలు ఏమాత్రమూ తగ్గడంలేదు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement