బోయిన్‌పల్లి యూపీహెచ్‌సీలో కోవిడ్‌ కలకలం

Bowenpally UPHC Nurse COVID 19 Staff And Patients Quarantine - Sakshi

నర్సుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

సిబ్బంది.. రోగుల్లో సర్వత్రా ఆందోళన

తాత్కాలికంగా మూసేయాలంటున్న కంటోన్మెంట్‌ అధికారులు

కంటోన్మెంట్‌: భయపడినంతా అయింది. యూపీహెచ్‌సీలో కరోనా ర్యాపిడ్‌ టెస్టులు వద్దంటూ ప్రభుత్వ పాఠశాల ఆవరణకు మార్చినా ప్రమాదం తప్పలేదు. బోయిన్‌పల్లి యూపీహెచ్‌సీలో పనిచేసే నర్సుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ ఆరోగ్య కేంద్రంలో ఇటీవల వ్యాక్సిన్‌లు, ఇతరత్రా చికిత్స కోసం వచ్చిన బాలింతలు, చిన్నారుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో తక్షణమే యూపీహెచ్‌సీని తాత్కాలికంగా మూసివేయాల్సిందిగా కంటోన్మెంట్‌ అధికారులు సూచిస్తున్నప్పటికీ, సంబంధిత సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే కానీ, యూపీహెచ్‌సీని మూసివేయలేమని పేర్కొంటున్నారు. 

వ్యాప్తి ప్రమాదముందనే...
బోయిన్‌పల్లి సర్కిల్‌ కార్యాలయాన్ని ఆనుకుని ఉండే యూపీహెచ్‌సీలో కరోనా ర్యాపిడ్‌ టెస్టులకు ఏర్పాట్లు చేయగా, ఇక్కడ కరోనా పరీక్షలు నిర్వహించకూడదంటూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా యూపీహెచ్‌సీకి ప్రతి బుధ, శనివారం వ్యాక్సినైజేషన్‌ కోసం వచ్చే వందలాది మంది మహిళలు, చిన్నారులతో పాటు ఇతరత్రా ఆరోగ్య సమస్యలపై వచ్చేవారికి సోకే ప్రమాదముంటుందని స్థానికులు అభ్యంతరం చెప్పారు. దీంతో పాటు యూపీహెచ్‌సీని ఆనుకునే ఉండే రెడ్‌ క్రాస్‌ సంస్థ ఆధ్వర్యంలోని మెటర్నిటీ క్లినిక్‌కు వచ్చే గర్బిణీలకూ ఇబ్బంది కలుగుతుందని సదరు నిర్వాహకులు పేర్కొన్నారు. సర్కిల్‌ కార్యాలయం సిబ్బంది, డిస్పెన్సరీ ఆవరణలోనే ఉన్న ప్లే గ్రౌండ్‌కు వచ్చే క్రీడాకారులు తదితరులూ కరోనా ర్యాపిడ్‌ టెస్టుల నిర్వహణను వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో తాడ్‌బంద్‌ చౌర స్తా సమీపంలో జనావాసాలకు దూరంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలో టెస్టులు నిర్వహిస్తున్నారు.

తాత్కాలికంగా మూసేయాల్సిందే...
ఊహించిన ప్రమాదం ముంచుకొచ్చినప్పటికీ యూపీహెచ్‌సీలో యధావిధిగా కార్యకలాపాలు కొనసాగించడం ప్రమాదకరం అని బోర్డు సిబ్బంది సైతం అభిప్రాయపడుతున్నారు. యూపీహెచ్‌సీ నర్సుకు కరోనా సోకినట్లు తేలడంతో వెంటనే సంబంధిత ప్రాంగణాన్ని కంటైన్‌మెంట్‌ చేసేందుకు యత్నించగా, క్లినిక్‌ సిబ్బంది అడ్డుకున్నారు. తమ శాఖ ఉన్నతాధికారులు చెబితేనే తాము క్లినిక్‌ మూసేస్తామంటున్నారు. ఈ మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు తమకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని యూపీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ తెలిపారు. తాము సొంత నిధులతోనే క్లినిక్‌ను శుభ్రం చేయించుకుంటామని పేర్కొనడం గమనార్హం.

మేడ్చల్‌లో 28 కరోనా కేసులు
మేడ్చల్‌: మేడ్చల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం నిర్వహించిన కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో 28 మందికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధాకారి డాక్టర్‌ మంజుల తెలిపారు. 150 మందికి పరీక్షలు నిర్వహించగా... 28 మందికి పాజిటివ్‌ రిజల్ట్‌ వచ్చిందని తెలిపారు. మేడ్చల్‌లో గడచిన వారంలో రోజుల్లో కరోనా నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 60కి చేరిందన్నారు.

కూకట్‌పల్లి జంట సర్కిళ్ల పరిధిలో...
మూసాపేట: జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జంట సర్కిళ్ల పరిధిలో మంగళవారం 23 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మున్సిపల్‌ అధికారులు తెలిపారు. మూసాపేట సర్కిల్‌ పరిధిలో 13 కేసులు నమోదయ్యాయన్నారు. మూసాపేటలో 4, ఫతేనగర్‌లో 2, జింకలవాడలో 1, బాలాజీనగర్‌ 2, బోరబండ 4 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. కూకట్‌పల్లి సర్కిల్‌ పరిధిలో 10 కేసులు నమోదవగా శంషీగూడలో 2, హెచ్‌ఎంటీ హిల్స్‌లో 2, ఎల్లమ్మబండలో 3, ఆల్విన్‌కాలనీ, సుమ్రితానగర్, బోయిన్‌పల్లిలలో ఒక్కో కేసు ప్రకారం నమోదు అయ్యా­యని అధికారులు వివరించారు.

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో...
సూరారం: కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో కరోనా కేసులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.. మంగళవారం నిర్వహించిన ర్యాపిడ్‌ టెస్ట్‌ల్లో 51 మందికి కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. షాపూర్‌నగర్‌ పీహెచ్‌సీలో 38 టెస్టులు చేయగా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. కుత్బుల్లాపూర్‌ పీహెచ్‌సీలో 42 మందికి టెస్టులు చేయగా 16 మందికి, సూరారం పీహెచ్‌సీలో 70 టెస్టులు చేయగా 23 మందికి, గాజులరామారం పీహెచ్‌సీలో 40 మందికి టెస్ట్‌లు చేయగా 12 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారులు తెలిపారు.

ప్లాస్మాను డొనేట్‌ చేసిన పోలీస్‌
గోల్కొండ: కరోనాను జయించిన ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్లాస్మాను డొనేట్‌ చేశారు. వివరాలివీ... గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ బి.అనిల్‌ ఇటీవల కోవిడ్‌ బారిన పడ్డారు. మహమ్మారిని జయంచి పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చిన అనిల్‌ మంగళవారం అపోలో ఆస్పత్రిలో ప్లాస్మా డొనేట్‌ చేశారు. తన వృత్తి ధర్మంతో పాటు మానవత్వాన్ని చాటుకున్నారు. ధైర్యంగా ముందుకు వచ్చి ప్లాస్మా డొనేట్‌ చేసిన అనిల్‌ను గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది అభినందించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top