రజనీ 132

Bonalu Festival Organizations Request to Cancel GO Number 132 - Sakshi

బోనాల వేడుకలకు ఆ ఏనుగును అనుమతించాలి  

మళ్లీ తెరపైకి వచ్చిన జీఓ నంబర్‌ 132 ప్రస్తావన  

ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించాలని వినతి   

మంత్రులకు విజ్ఞప్తి చేసిన ఉత్సవాల నిర్వాహకులు 

చార్మినార్‌: నగరంలో జీఓ నంబర్‌ 132 మళ్లీ తెరపైకి వచ్చింది. బోనాల ఉత్సవాల్లో రజనీ అనే ఏనుగు పాల్గొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. సోమవారం సచివాలయంలోని సి– బ్లాక్‌లో బోనాల జాతర ఉత్సవాలపై జరిగిన ఉన్నతస్థాయి అధికారులు, ఉత్సవాల నిర్వాహకుల సమీక్ష సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకువచ్చింది. సర్కారు ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని భాగ్యనగర్‌ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీతో పాటు అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం కమిటీ ప్రతినిధులు కోరారు.నగరంలో జరిగే బోనాల జాతర ఉత్సవాలతో పాటు మొహర్రం సంతాప దినాల సందర్భంగా రజనీ అనే ఏనుగునువినియోగించడం ఆనవాయితీగా వస్తుందన్న విషయాన్ని మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్,ఇంద్రకరణ్‌ రెడ్డిలకు అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయ కమిటీ అధ్యక్షుడు జి.నిరంజన్‌ వివరించారు.   

అమ్మవారి ఘటాలఊరేగింపులో ఆనవాయితీ..
బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా కార్వాన్‌లోని దర్బార్‌ మైసమ్మ అమ్మవారి ఘటం ఊరేగింపు, సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి దేవాలయం అమ్మవారి ఘటం ఊరేగింపులతో పాటు పాతనగరంలో అత్యంత వైభవంగా జరిగే అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపులో జూపార్కుకు చెందిన రజనీని ప్రతి ఏటా వినియోగిస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఊరేగింపులో అంబారీని వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. బోనాల జాతర ఉత్సవాలతో పాటు పదో మొహర్రం సందర్భంగా జూపార్కుకు చెందిన రజనీని వినియోగిçస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాల జాతర ఉత్సవాలను స్టేట్‌ ఫెస్టివల్‌గా ప్రకటించినందున ఈ విషయంలో సంబంధిత ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తిరిగి హైకోర్టును ఆశ్రయించి బోనాల జాతర ఉత్సవాల్లో ఏనుగు పాల్గొనే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  

ఏమిటీ జీఓ 132..  
సెంట్రల్‌ జూ అథారిటీ విజ్ఞప్తి మేరకు మతపరమైన ఊరేగింపుల్లో రజనీ పాల్గొనరాదని 2009 డిసెంబర్‌ 22న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీఓ 132ను జారీ చేసింది. దీని ప్రకారం మతపరమైన ఊరేగింపుల్లో ఏనుగులు పాల్గొనడానికి అవకాశాలు లేకుండాపోయాయి. అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం కమిటీ ప్రతినిధులతో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఫిర్యాదులు, చర్చలు, సంప్రదింపుల అనంతరం ఏటా  బోనాల జాతర ఉత్సవాలతో పాటు మొహర్రం సంతాప దినాల్లో రజనీ ఏనుగు పాల్గొంటోంది. అప్పటి నుంచి జీఓ 132 కొనసాగుతున్నప్పటికీ.. ఏయేటికాయేడు ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జీఓ 132ను రిలాక్స్‌ చేస్తూ మెమోలు జారీ చేయడంతో మతపరమైన ఊరేగింపుల్లో జూపార్కుకు చెందిన ఏనుగు పాల్గొంటూ వస్తోంది. పాతబస్తీకి చెందిన ఓ ఉత్సవాల నిర్వాహకుడు తమకు ఏనుగును ఇవ్వడం లేదని పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఏ ఉత్సవాల్లో రజనీని వినియోగించరాదంటూ హైకోర్టు మార్చి 18న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో రజనీ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి జరిగే బోనాల జాతర ఉత్సవాల్లో రజనీ పాల్గొనేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అమ్మవారి భక్తులు కోరుతున్నారు.  

చర్యలు చేపట్టాలి..  
రానున్న బోనాల ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఎన్నో దశాబ్దాలుగా బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఊరేగింపులో అంబారీని వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. సంబంధిత ఉన్నతాధికారులు హైకోర్టును ఆశ్రయించి బోనాల జాతర ఉత్సవాల్లో రజనీ ఏనుగు పాల్గొనేలా చర్యలు చేపట్టాలి.   – జి.నిరంజన్, అక్కన్న మాదన్న దేవాలయ చైర్మన్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top