వైభవంగా ఘటాల ఊరేగింపు | bonalu festival | Sakshi
Sakshi News home page

వైభవంగా ఘటాల ఊరేగింపు

Jul 22 2014 4:15 AM | Updated on Aug 21 2018 5:46 PM

వైభవంగా ఘటాల ఊరేగింపు - Sakshi

వైభవంగా ఘటాల ఊరేగింపు

డప్పుల వాయిద్యాలు.. యువకుల నృత్యాలు.. కళాకారుల ప్రదర్శన.. విచిత్ర వేషధారణలతో పాతబస్తీలో శ్రీ మాతేశ్వరీ ఘటాల ఊరేగింపు వైభవంగా సాగింది.

చార్మినార్/ చాంద్రాయణగుట్ట:  డప్పుల వాయిద్యాలు.. యువకుల నృత్యాలు.. కళాకారుల ప్రదర్శన.. విచిత్ర వేషధారణలతో పాతబస్తీలో శ్రీ మాతేశ్వరీ ఘటాల ఊరేగింపు వైభవంగా సాగింది. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన అక్కన్నమాదన్న దేవాలయ ఘటం సాయంత్రం 5.10 గంటలకు హిమ్మత్‌పురా చౌరస్తాకు చేరుకోగా.. దానిని అనుసరిస్తూ మిగతా ఊరేగింపు కదిలింది. సకాలంలో ఘటాల ఊరేగింపు ముగియడంతో పోలీసులు, ఉత్సవాల నిర్వాహకులు ఊపిరిపీల్చుకున్నారు.  
 
ఊరేగింపు సాగిందిలా..

 
ఉప్పుగూడ మహంకాళి దేవాలయంలో ప్రారంభమైన మాతేశ్వరీ ఘటాల ఊరేగింపు ఛత్రినాక ద్వారా లాల్‌దర్వాజా సింహ వాహిని ఘటాలలో కలిసింది. అక్కన్న మాదన్న దేవాలయం, మురాద్ మహాల్, గౌలిపురా, సుల్తాన్‌షాహి, హరిబౌలిల ఘటాలు లాల్‌దర్వాజా మోడ్‌కు చేరుకున్నాయి. ఈ ఊరేగింపు శాలిబండ, హిమ్మత్‌పురా చౌరస్తా, మక్కా మసీదు, చార్మినార్, గుల్జార్‌హౌజ్‌ల మీదుగా నయాపూల్ మూసి నదిలోని ఢిల్లీ దర్బార్ మైసమ్మ దేవాలయం వరకు కొనసాగింది. మీరాలంమండి నుంచి ప్రారంభమైన శ్రీ మహాంకాళి అమ్మవారి ఘటం కోట్ల అలీజా, సర్దార్‌మహాల్ ద్వారా చార్మినార్ చేరుకొని ఊరేగింపులో కలిసింది.  
 
వెల్లివిరిసిన మతసామరస్యం
 
 
పాతబస్తీలో మరోసారి మతసామరస్యం వెల్లివిరిసింది. ఘటాల ఊరేగింపు సందర్భంగా రంజాన్ మార్కెట్ మూసేసి ముస్లిం సోదరులు హిందువులకు సహకరించగా.. ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా మక్కా మసీదులో నిర్వహించే సామూహిక ప్రార్థనల కోసం రాత్రి కొద్ది సేపు ఘటాల ఊరేగింపును హిమ్మత్‌పురా చౌరస్తా వద్ద నిలిపివేసి హిందువులు స్నేహా భావాన్ని చాటుకున్నారు. మక్కా మసీదులో రాత్రి ఇఫ్తార్ అనంతరం నిర్వహించిన మగ్రీబ్ నమాజ్ ప్రార్థనలు ముగిసిన వెంటనే తిరిగి ఊరేగింపు ప్రారంభించి... ముస్లింలు తిరిగి రాత్రి 8.30 గంటలకు మక్కా మసీదులో నిర్వహించే ఇషాకి నమాజ్ ప్రారంభం లోపే (8 గంటలకు) చార్మినార్ కట్టడాన్ని దాటేసారు. ఇలా ఉత్సవాల సందర్భంగా ఇరువర్గాల ప్రజలు సహకరించుకున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement