అలజడి.. ఆందోళన

Bjp Leaders Protest In Khammam - Sakshi

సాక్షి, కొత్తగూడెం: రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన పరిపూర్ణానంద స్వామి హైదరాబాద్‌ బహిష్కరణ అంశం తరువాత చోటుచేసుకున్న పరిణామాలు బుధవారం జిల్లాలోనూ కలకలం రేపింది. చివరకు జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం పట్టణాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు, రాస్తారోకోలు చేశారు.

శ్రీరాముడి విషయమై ఇటీవల కత్తి మహేష్‌ అనే సినీ క్రిటిక్‌ అనుచిత వ్యాఖ్యలు చేశాడని వివాదం చెలరేగడంతో కత్తి మహేష్‌ను హైదరాబాద్‌ నగర బహిష్కరణ చేసి అతని సొంత జిల్లా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు తెలంగాణ పోలీసులు తరలించారు.

ఈ క్రమంలో గత 6నెలల క్రితం పరిపూర్ణానంద స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన విమర్శల నేపథ్యంలో స్వామీజీని సైతం హైదరాబాద్‌ నగర బహిష్కరణ చేశారు. ఈ క్రమంలో పరిపూర్ణానంద స్వామిని కాకినాడకు తరలించేందుకు రాష్ట్ర పోలీసులు ప్రయత్నించగా, స్వామి మాత్రం భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శనం చేసుకునంటానని కోరారు. 

ఈ క్రమంలో పోలీసులు దారి మార్చి అశ్వారావుపేట మీదుగా నేరుగా కాకనాడకు స్వామీజీని తరలిస్తుండడంతో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు, రాస్తారోకోలు చేశారు. భద్రాచలం వంతెనపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేయడంతో సమస్య ఏర్పడింది.

దీంతో పోలీసులు ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో 8 మంది నాయకులను అరెస్టు చేసి తరువాత విడుదల చేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కేవలం హైదరాబాద్‌ నగర బహిష్కరణ మాత్రమే చేసిన పోలీసులు, స్వామీజీని భద్రాచలం పంపుతామని చెప్పి ఇలా దారిమళ్లించడం సరికాదని అన్నారు. ఇలా ఏకపక్షంగా రాష్ట్రం దాటించడం ఏమిటని ప్రశ్నించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top