బీడీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవన భృతి దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు.
సిద్దిపేట జోన్:బీడీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవన భృతి దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం రాత్రి సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పరిధిలోని 3,230 మంది బీడీ కార్మికులకు రూ.వెయ్యి చొప్పున జీవన భృతి పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పట్టణంలో ఇప్పటికే ఆసరా పథకం కింద 8,441 మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ప్రస్తుతం జీవన భృతితో సిద్దిపేటలోని ప్రతి రెండు ఇళ్లకు ఒక పింఛన్ అందుతుందని తెలిపారు.
పేదల కడుపునిండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్... దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా పథకాన్ని అమలు చేశారన్నారు. బీడీ కార్మికులు అధికంగా ఉండే పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలోనే రూ.వెయ్యి చొప్పున జీవన భృతిని చెల్లిస్తున్నట్టు చెప్పారు. ఇది దేశ చరిత్రలోనే ఒక లిఖిత పూర్వకమైన ఘట్టమని.. పొరుగు రాష్ట్రాలకు ఆదర్శనీయమన్నారు. అర్హులందరికీ జీవన భృతి అందేలా చర్యలు తీసుకుంటామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ప్రతి నెలా రూ.1.20 కోట్లు పింఛన్లకే..
పింఛన్ల కోసం ప్రతి నెలా రూ. 1.20 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తున్నట్టు మంత్రి తెలిపారు. రూ.3,600 కోట్లను పేద వర్గాల విద్యార్థుల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. రూ.16 వేల కోట్లను రుణమాఫీ కింద కేటాయించడం జరిగిందన్నారు. సిద్దిపేట పట్టణంలో 3,700 మందికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొం దించిందన్నారు. ఆ దిశగా లబ్ధిదారులకు రూ.12 వేల చొప్పున చెల్లించేందుకు సీఎం సానుకూలత వ్యక్తం చేశారన్నారు. సిద్దిపేటను క్లీన్, గ్రీన్, సేఫ్ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
బీడీ కార్మికులకు మరో అవకాశం..
బీడీ కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వినూత్నంగా జీవన భృతి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో వివిధ కారణాల వల్ల బీడీ కార్మికులుగా పేరు నమోదు చేసుకోలేని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందన్నారు. వాటర్ గ్రిడ్ పథకానికి భవిష్యత్తులో సిద్దిపేట దిక్సూచిగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ఆర్డీఓ ముత్యంరెడ్డి, డీఎస్పీ శ్రీధర్‌గౌడ్, తహశీల్దార్ ఎన్‌వై గిరి, ఓఎస్‌డీ బాల్‌రాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సుతోపాటు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పలువురు మహిళలకు జీవన భృతిని పంపిణీ చేశారు.