నకిలీ నోట్లతో జాగ్రత్తగా ఉండాలి

Be Careful With Counterfeit Notes - Sakshi

మెదక్‌ మున్సిపాలిటీ : నకిలీ నోట్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మెదక్‌ పట్టణంలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. బుధవారం మెదక్‌ జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. హన్మకొండ వరంగల్‌ జిల్లా హసన్‌పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట గ్రామానికి చెందిన మహ్మద్‌ షఫీ, అబ్దుల్‌ మజీద్‌లు వరుసకు బావ బావమరుదులు. కాగా మహ్మద్‌ షఫీ కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా, మజీద్‌ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఈనెల 16న రాత్రి 8గంటల ప్రాంతంలో మెదక్‌ పట్టణంలోని పెద్ద బజార్‌లోని జనతా చికెన్‌ సెంటర్‌లో, పెద్దబజార్‌ మజీద్‌ వద్ద గల ఓ కిరాణషాపులో సరుకులు కొనుగోలు చేసి నకిలీ రూ.2000 నోట్లు ఇచ్చి వెళ్లారు. కొద్ది సేపటి తరువాత కిరాణాషాపు యజమాని కొండ రమేష్‌ రూ.2000 నోటు నకిలీగా గుర్తించి అతని తమ్ముడితో కలిసి రాందాస్‌ చౌరస్తాలో నిందితుల కారు గమనించి వారిని వెంబడించి పోలీస్‌స్టేషన్‌ సమీపంలో వారిని రమేష్‌ అడ్డగించి నిలదీయడంతో నిందితులు రమేష్‌ను తోసేసి కారును స్పీడుగా తీసుకెళ్లారు.

దీంతో రమేష్‌ తమ్ముడు అతని స్నేహితులు కారును వెంబడించి హౌసింగ్‌ బోర్డు వద్ద నిందితులను పట్టుకొని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. బాధితుడు కొండా రమేష్‌ ఫిర్యాదు మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్పీ వివరించారు. అలాగే నిందితుల నుంచి రూ.2000 నకిలీ నోట్లు7, రూ.500 నోట్లు 8తోపాటు నోట్ల తయారీకి ఉపయోగించిన స్కానర్, ప్రింటర్, పేపర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

నిందితులు నకిలీనోట్ల చలామణితో చిక్కకుండా వెంట తెచ్చుకున్న కారుకు సైతం రెండు నెంబర్‌ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నకిలీ నోట్లను గుర్తించిన పట్టణ వాసులను ఎస్పీ అభినందించారు. ఈ కేసు చేధించడంలో పురోగతి సాధించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు, పట్టణ సీఐ శ్రీరాం విజయ్‌కుమార్, పట్టణ ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి, మెదక్‌రూరల్‌ఎస్‌ఐ లింబాద్రి, హవేళిఘణాపూర్‌ ఎస్‌ఐ శ్రీకాంత్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నాగరాజు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top