బార్లు, పబ్బులు నిబంధనలు పాటించాల్సిందే | Sakshi
Sakshi News home page

బార్లు, పబ్బులు నిబంధనలు పాటించాల్సిందే

Published Mon, Dec 18 2017 8:43 PM

bars, pubs must apply conditions - Sakshi

హైదరాబాద్‌: బార్లు, పబ్బులు, వైన్ షాపులు, స్పాల యాజమాన్యాలు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్య హెచ్చరించారు. సైబరాబాద్ పరిధిలోని బార్లు, పబ్బులు, వైన్ షాపులు, స్పాల యాజమాన్యాలు/మేనేజర్లతో  సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మసాజ్ సెంటర్లు, పార్లర్లలో ఇటీవల అసాంఘిక కార్యకలాపాలు జరగుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మసాజ్ సెంటర్లు నిర్వహించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే నియమ నిబంధనలను తప్పక పాటించాలని అన్నారు. మసాజ్ సెంటర్లను మసాజ్ సెంటర్లు గానే కొనసాగించాలని, వీటి ముసుగులో వ్యభిచారం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే నేరమని తెలిపారు.

స్పాలకు నిబంధనలు
స్పాలలో తప్పనిసరిగా రిజిస్టర్‌ నిర్వహించాలన్నారు. ఇందులో స్పాలకు వచ్చే వారి పేరు, ఫోన్ నంబర్లను విధిగా నమోదు చేయాలన్నారు. స్పాలలో పడకల వాడకం అవసరం లేదన్నారు. సాధ్యమైనంత వరకూ క్రాస్ మసాజ్‌లకు అనుమతించవద్దని, 18 ఏళ్లకు తక్కువ ఉన్నవారిని అనుమతించొద్దని, సిసి కేమరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విజిటింగ్ వీసాలపై వచ్చిన ఇతర దేశాల వారిని స్పాలల్లో నియమించుకోవద్దన్నారు. స్పాలల్లో తలుపులు పారదర్శకంగా ఉండాలన్నారు. తలుపులకు ఎలాంటి బోల్టులను బిగించరాదన్నారు. వీలుంటే గాజు పార్టిషన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

బార్లు, పబ్బులు, వైన్ షాపులకు నిబంధనలు
బార్లు, పబ్బులు, వైన్ షాపుల యజమానులు కచ్చితంగా ట్రేడ్ లైసెన్స్, లిక్కర్ లైసెన్స్, పోలీస్ లైసెన్స్‌లను తీసుకోవాలన్నారు. సమయపాలన పాటించాలని, రాత్రి 12 గంటల తర్వాత ఎట్టి పరిస్థితిలో షాపులను తెరిచి ఉంచొద్దని సూచించారు.

పై నిబంధనలు అతిక్రమిస్తే మొదటిసారి సీపీ కార్యాలయానికి లేదా పోలీస్ స్టేషన్‌కు రావాల్సి ఉంటుందని, రెండోసారి అయితే 2, 3 రోజులు జైలు శిక్ష తప్పదని శాండిల్య హెచ్చరించారు. కేసుల నమోదుతోపాటు లైసెన్సుల రద్దుకు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న వారి పేర్లు, ఫోన్ నంబర్లు, ఫోటోలు తీసుకున్నారు. వ్యాపారులు కనీస నైతికత పాటించాలని, సామాజిక హితాన్ని కొంతైనా పాటించాలని సూచించారు. సమావేశంలో జాయింట్ సీపీ షానవాజ్ ఖాసీం, మాదాపూర్ డి‌సి‌పి విశ్వప్రసాద్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement