ఆ మేరకు నియమావళి రూపొందించండి
రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచన
న్యూఢిల్లీ: విచారణలో ఉన్న కేసుల వివరాలను ప్రజలు, మీడియా సమక్షంలో పోలీసులు ఏ మేరకు ప్రస్తావించాలో, ఏ అంశాలను మాత్రమే వెల్లడించాలో తెలిపే నియమావళిని రూపొందించాలని రాష్ట్రాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత మూడు నెలల్లోపు ఈ మేరకు నిబంధనావళిని తయారుచేయాలని జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం సూచించింది.
ఈ మేరకు జనవరి 15వ తేదీన ఇచి్చన ఉత్తర్వులోని వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇంకా దర్యాప్తు కొనసాగుతున్న, విచారణ దశలో ఉన్న కేసులపై మీడియా ఎదుట పోలీసులు కీలక విషయాలతోపాటు అనవసర విషయాలనూ ప్రస్తావిస్తున్నారని, ఈ ధోరణికి అడ్డుకట్టవేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్రాలకు కోర్టు సూచనలుచేసింది.
‘‘కోర్టుకు సహాయకుడు(అమికస్ క్యూరీ)గా వ్యవహరించిన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ కేంద్ర ప్రభుత్వం, విదేశాలు అవలంబిస్తున్న విధానాలకు అనుగుణంగా ‘పోలీస్ మాన్యువల్ ఫర్ మీడియా బ్రీఫింగ్’ను తయారుచేశారు. దీనిని మీరు ఒకసారి పరిశీలించండి. బాగుంటే దీనిని మీరూ అనుసరించండి. లేదంటే కొత్తగా మరోటి తయారుచేసుకోండి. కొత్త మాన్యువల్‌ను ఆ తర్వాత రెండు వారాల్లోపు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయండి’’అని కోర్టు ఆదేశించింది. శంకరనారాయణన్ తయారుచేసిన ఈ 60 పేజీల మాన్యువల్‌లో నాలుగు భాగాలున్నాయి. దర్యాప్తుకు ఎలాంటి భంగం కల్గించకుండా, నష్టం వాటిల్లకుండా, కీలక అంశాలు బయటకు పొక్కకుండా, క్లుప్తంగా విషయాలను మీడియాకు పోలీసులు చెప్పొచ్చని మాన్యువల్ పేర్కొంది.


