నయా నడక | Barefoot Walk Craze in Hyderabad People | Sakshi
Sakshi News home page

నయా నడక

Jun 7 2019 7:19 AM | Updated on Jun 8 2019 8:23 AM

Barefoot Walk Craze in Hyderabad People - Sakshi

నగరవాసుల్లో ఆరోగ్య స్పృహ కొత్త పుంతలు తొక్కుతోంది. రోజురోజుకూ సరికొత్త అంశాలపై ఆసక్తి పెరుగుతోంది. కూరగాయలు, పండ్లు తినడం మంచిదనే దగ్గర నుంచి ఆర్గానిక్‌ ఉత్పత్తులు ఇంకా ఎన్నో మార్గాలను అన్వేషిస్తున్నారు. అలాగే వ్యాయామంలో కూడా నడక మంచిదని.. ‘పాదరక్ష రహిత నడక’ (బేర్‌ ఫుట్‌ వాక్‌) ఇంకా మంచిదనిఅటువైపు అడుగులు వేస్తున్నారు.

సాక్షి, సిటీబ్యూరో :‘కొంత కాలంగా బేర్‌ ఫుట్‌ రన్నింగ్, వాకింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాను. ప్రస్తుతం 5 కి.మీ వరకూ పాదరక్షలు లేకుండా నడవగలను’ అని చెప్పారు నగరానికి చెందిన వసంత్‌ కార్తీక్‌. ప్రస్తుతం నగరవాసుల్లో పెరుగుతున్న ఈ కొత్త నడక అభిరుచికి ఆయన మాటలు అద్దం పడతాయి. ఆయన లాంటి అభిరుచి గలవారి కోసం ప్రత్యేకంగా నగరంలో ఈవెంట్లు కూడా మొదలయ్యాయి. తాజాగా ‘బేర్‌ ఫుట్‌ రన్‌ ఫర్‌ నేచర్‌’ పేరుతో సిటీలో ఈనెల 1వ తేదీన ఓ ఈవెంట్‌ కూడా నిర్వహించారు.  

ఒకప్పటిలా.. ఇప్పుడెలా..
కాలికి చెప్పుల్లేకుండా మైళ్ల దూరం నడిచేవాళ్లం అంటూ మొన్నటి తరం గొప్పగా చెప్పుకోవడం విన్నాం. అప్పట్లో చెప్పులూ లేవు.. ప్రయాణించడానికి సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవు కాబట్టి వారి ఆరోగ్యానికి అవన్నీ దోహదం చేశాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు నడకే తగ్గిపోతోంది అంటే ఇక చెప్పుల్లేని నడక అంటే ఇక దాదాపు అసాధ్యమే. ఇంట్లోనూ కాళ్లకు చెప్పులు లేకుండా తిరగని ఈ రోజుల్లో కూడా ఆరుబయట చెప్పుల్లేని నడక ప్రత్యేక వ్యాయామమైపోయింది. కొన్నికొన్ని ప్రాంతాల్లో బేర్‌ఫుట్‌ వాక్‌ సాధన చేయడం ద్వారా ఎన్నో లాభాలు కూడా ఉంటాయని వైద్యులే చెబుతున్నారు.

బేర్‌తో.. బెని‘ఫిట్స్‌’
పాదరక్షలు ధరించకుండా నడిచినప్పుడు కాళ్లకి మరింతగా స్టిమ్యులేషన్‌ జరుగుతుందని వైద్యులు అంటున్నారు. పాదాలు నేలను నేరుగా తాకినప్పుడు చర్మంలో జరిగే మార్పుల కారణంగా మెదడు చురుకుగా మారుతుందని, స్పర్శాజ్ఞానం చైతన్యం అవుతుందని, సెన్సరీ స్టిమ్యులేషన్, మోటార్‌ స్కిల్స్‌.. బాడీ బ్యాలెన్సింగ్‌ నైపుణ్యం వంటివి పెరుగుతాయంటున్నారు. ఈ తరహా నడక శరీరంపై అవగాహన పెరగడానికి కూడా ఉపకరిస్తుంది. పాదాలు బయటి వాతావరణంతో అనుసంధానమవుతాయి. కాలి మడమలు శక్తివంతంగా మారతాయి. అంతేకాకుండా షూస్, సాక్స్‌లలో చేరుకునే బాక్టీరియా, ఫంగస్‌ నుంచి తప్పించుకోవచ్చు. 

అనుకూలించే చోట ఉత్తమం  
పచ్చగడ్డి మీద, పరిశుభ్రంగా ఉండే కార్పెట్స్‌ మీద పాదరక్షలు లేకుండా నడవవచ్చు. సముద్రపు ఇసుక మీద కూడా ఇలా విహరించడం ఆరోగ్యానికి లాభదాయకమే. ఇది నరాల, కండరాలను, కీళ్లను బలోపేతం చేసి, ఫ్లెక్సిబులిటీని పెంచుతుంది. పాదాలకు వచ్చే ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. నిలుచునే భంగిమను మెరుగుపరుస్తుంది. అయితే, అపరిశుభ్రంగా ఉండే బాత్‌రూమ్స్, పబ్లిక్‌ ప్లేసెస్‌లో, కఠినమైన నేల మీద పాదరక్ష రహితంగా నడిస్తే కేవలం పాదాల మీదే కాక శరీరమంతా ఒత్తిడి పడుతుంది. అది కండరాలకు, కీళ్లకు హాని చేస్తుంది. వ్యాయామం తరహాలో దీన్ని అనుసరించేవారు బేర్‌ ఫుట్‌ వాక్‌ పూర్తయ్యాక వైద్యులు సూచించిన యాంటీ బయాటిక్‌ సోప్స్‌ లేదా లోషన్స్‌ ఉపయోగించి పాదాలను శుభ్ర పరచుకోవడం మంచిది.

పర్యావరణం కోసం..
ఆరోగ్యకరమైన జీవనం కోసం చాలా మంది ఇప్పుడు నడక, పరుగును అనుసరిస్తున్నారు. ఆరోగ్యంతో పాటు నా పరుగుకు మరో సామాజిక అంశాన్ని కూడా జోడించాలని నేను పాదరక్షలు లేకుండా రోజుకి 5 కి.మీ పరుగు తలపెట్టాను. ‘పర్యావరణాన్ని పరిరక్షించండి’ అనేదే నా బేర్‌ ఫుట్‌ రన్‌ సందేశం. ఇది 100 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 15కి పూర్తవుతుంది.– వసంత్‌ కార్తీక్, ఐటీ ఉద్యోగి

ఎన్నో లాభాలున్నాయి
తగిన జాగ్రత్తలతో బేర్‌ఫుట్‌ వాక్‌ చేయడం ఆరోగ్యానికి మంచిదే. దీనివల్ల ఫుట్‌ పొజిషన్‌ (అడుగు పడే స్థితి) మీద నియంత్రణ వస్తుంది. నడకలో బ్యాలెన్స్‌ పెరుగడానికి, నొప్పి నివారణ వేగంగా జరగడానికి ఉపయోగపడుతుంది. వెన్నెముక కింద భాగం కీళ్లు, కోర్‌ మజిల్స్‌ మధ్య  సమన్వయం పెరుగుతుంది. సరిగ్గా నప్పని పాదరక్షలు ధరించడం వల్ల వచ్చే ఇబ్బందులకు చెక్‌ చెప్పవచ్చు. లోయర్‌ బ్యాక్‌ కండరాలను శక్తివంతం చేస్తుంది.– డాక్టర్‌ కల్పన, ఫ్యామిలీ ఫిజీషియన్, నిజాంపేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement