జైలు నుంచి విముక్తి పొందిన ఖైదీలకు జైళ్ల శాఖ తరఫున రుణాలు అందజేయనున్నట్లు మెదక్ జిల్లా సబ్‌జైళ్ల అధికారి లక్షీనర్సింహ తెలిపారు.
సిద్దిపేట: జైలు నుంచి విముక్తి పొందిన ఖైదీలకు జైళ్ల శాఖ తరఫున రుణాలు అందజేయనున్నట్లు మెదక్ జిల్లా సబ్‌జైళ్ల అధికారి లక్షీనర్సింహ తెలిపారు. శనివారం ఆయన సిద్దిపేట సబ్‌జైలును సందర్శించి ఖైదీలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జైళ్ల శాఖ సంస్కరణల్లో డీజీ వినయ్‌కుమార్ సింగ్ చొరవతో ఖైదీలకు మేలు కలిగేలా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు.
జైలు నుంచి విముక్తి పొందిన ఖైదీలకు స్థిరాస్తికి సంబంధించిన పత్రాలుంటే బ్యాంక్ రుణాలు ఇప్పించేందుకు సహకరిస్తామని చెప్పారు. దీంతో ఖైదీలకు ఉపాధి లభిస్తుందన్నారు. సిద్దిపేట సబ్‌జైలును చిన్నకోడూరు మండలం మందపల్లి వద్ద ఉన్న ఏఆర్ సబ్‌హెడ్ క్వార్టర్ సమీపంలోకి మార్చేందుకు పరిశీలిస్తున్నామన్నారు. దీంతోపాటు పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేసి ఖైదీలకు ఉపాధిని కల్పించాలనే ఆలోచనతో ఉన్నట్లు పేర్కోన్నారు.