గరిబోళ్ల గల్లీ.. నాణ్యమైన సరుకులే అన్నీ.. 

Bangladesh Market In Hyderabad Is Full Busy While Ramadan - Sakshi

కిక్కిరిసిన బంగ్లాదేశ్‌ మార్కెట్‌   

కవాడిగూడ : ఇరుకిరుకు వీధులు.. చిన్న చిన్న బడ్డీలు.. అయితేనేం అక్కడ జరిగే వ్యాపారం పెద్దపెద్ద మార్కెట్లను తలపిస్తుంది. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు మసక వెలుతరులోనూ దారులన్నీ కిటకిట.. ఇసుకేసినా రాలనంతగా జనం. వస్తువులు అమ్మేవారు.. కొనేవారు అందరూ పేదవారే.. కానీ వస్తువుల నాణ్యత ఏమాత్రం తగ్గదు. తక్కువ ధరలోనే స్తోమతకు తగ్గ వస్తువులను కొనుక్కోవచ్చు. అందుకే ఆ మార్కెట్‌ ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతునే ఉంటుంది. గరీబ్‌ బజార్‌గా పిలిచే ఈ ప్రాంతమే భోలక్‌పూర్‌ డివిజన్‌లోని పురాతన ‘బంగ్లాదేశ్‌ మార్కెట్‌’. నిజాం పాలనలో బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన కొందరు ముస్లింలు ఈ ప్రాంతాన్ని వ్యాపారం కేంద్రంగా మార్చుకున్నారు.  

కాలక్రమంలో కొందరు ఇక్కడే వ్యాపారులుగా స్థిరడిపోయారు. ఇక్కడి మార్కెట్‌లో వస్తువులు తక్కువ ధరకే  దొరుకుతాయని పేరుండడం, రంజాన్‌ మాసం కావడంతో వినియోగదారులతో షాపులన్నీ కళకళలాడుతున్నాయి. బంగ్లాదేశ్‌ మార్కెట్‌లో ప్రధానంగా పెద్ద మసీదు గల్లీ, బీలాల్‌ మసీదు, మీనా బజార్‌లో అన్ని వర్గాలకు చెందిన వారు వ్యాపారం చేస్తుంటారు. వీరు సరుకులను నేరుగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. అందుకే ఈ మార్కెట్‌కు అంత పేరు. సానికులే కాదు..నిజామాబాద్, వరంగల్‌ వంటి నగరాలతో పాటు బీదర్, ఔరంగాబాద్‌ నుంచి కూడా ఈ మార్కెట్‌కు కొనుగోలుడారులు వస్తుంటారంటే ఇక్కడి సరుకులకు ఎంత పేరుందో చెప్పవచ్చు. 

వ్యాపారం బాగుంది.. 
రంజాన్‌ మాసం కావడంతో మాకు గిరాకీ బాగా పెరిగింది. ముస్లిం కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కొత్త దుస్తులు తీసుకుంటారు కాబట్టి అమ్మకాలు పెరిగాయి. ఇతర మార్కెట్‌ ధరల కంటే మా వద్ద ధరలు చాలా తక్కువే ఉంటాయి.  
– భాగ్యలక్ష్మి, మీనా బజార్‌ 
 
అన్ని దొరుకుతాయి 
బంగ్లాదేశ్‌ మార్కెట్‌లో అన్ని రకాల వస్తువులు తక్కువ ధరకే దొరుకుతాయి. ముఖ్యంగా పేదలకు కావాల్సిన సామగ్రి ఇక్కడ చౌక కావడంతో బయటి ప్రాంతాల వారు కూడా వస్తుంటారు. చార్మినార్, ఇబ్రహీంపట్టణం, నిజామాబాద్, వరంగల్, బీదర్, జౌరాంబాద్‌ నుంచి సైతం వచ్చి కావాల్సినవి కొని 
వెళుతుంటారు.      – అమ్‌జాద్, వ్యాపారి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top