కేంద్రంపై కేటీఆర్‌ విమర్శలన్నీ అబద్ధాలే.. | Bandaru dattatreya joins issue with KTR | Sakshi
Sakshi News home page

కేంద్రంపై కేటీఆర్‌ విమర్శలన్నీ అబద్ధాలే..

Jan 7 2019 2:53 AM | Updated on Jan 7 2019 2:53 AM

Bandaru dattatreya joins issue with KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వంపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన విమర్శలు అబద్ధాలని కేంద్ర మాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం నీతి, నిజాయితీలతో కొనసాగుతోందన్నారు. టీమిండియా కాన్సెప్ట్‌తో అన్ని రాష్ట్రాల సీఎంలతో కలసి ముందుకు సాగుతున్నారని చెప్పారు. పార్లమెంటు ఎన్నికలు బీజేపీకి అనుకూలంగా ఉంటా యని గ్రహించే మోదీ ప్రభుత్వంపై నిందలు వేయడం ద్వారా ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలపై కేం ద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ అహంకార పూరిత ధోరణిలో ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 

24 గంటల కరెంట్‌ కేంద్రం పుణ్యమే..
నాలుగున్నరేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం పైసా ఇవ్వలేదనడం అబద్ధమని దత్తాత్రేయ చెప్పా రు. కేంద్రం తెలంగాణకు వివిధ గ్రాంట్ల రూపంలో దాదాపు రూ.2 లక్షల కోట్లు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణలో 24 గంటల కరెంటు కేంద్రం పుణ్యమేనని వెల్లడించారు. 11 సాగునీటి ప్రాజెక్టులు, ఉత్తర, దక్షిణ పవర్‌ గ్రిడ్ల అనుసంధానం, యాదాద్రి పవర్‌ ప్రాజెక్ట్‌కు రూ. 50 వేల కోట్లను కేటాయించిందన్నారు. ఎన్‌టీపీసీ 4 వేల మెగావాట్లు, మహబూబ్‌నగర్‌లో వెయ్యి మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టును కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో 2,400 కిలోమీటర్లు జాతీయ రహదారులుంటే కేంద్రం వాటిని 5,600 కిలోమీటర్లకు పెంచిందని చెప్పారు. తెలంగాణలో కేంద్రం ఎయిమ్స్‌ ఏర్పాటు, రామగుండంలో ఎరువుల పరిశ్రమను తిరిగి తెరిపిస్తోందన్నారు. వరంగల్‌లో టెక్స్‌టైల్స్‌ పార్క్, కరీంనగర్‌–నిజామాబాద్‌ రైల్వేలైన్లను పూర్తి చేసింది కేంద్రం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి 2.10 లక్షల ఇళ్లను మంజూరు చేసిందన్నారు.

అత్యధిక నిధులు తెలంగాణకే..
రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వల్ల రూ.1,700 కోట్ల నిధులు వెనక్కి పోయే పరిస్థితి వచ్చిందని, దీనిపై కేసీఆర్‌ ప్రభుత్వం స్పందించాలని దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులకు తన వాటా నిధులను మంజూరు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. కేంద్రం నుంచి అత్యధిక నిధులు వచ్చింది తెలంగాణకేనని చెప్పా రు. శబరిమల విషయంలో కమ్యూనిస్టు ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టు ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తప్పవన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement