చారిత్రక వనం..పునర్వైభవానికి సిద్ధం! 

Awesome Park in the Golkonda Fort - Sakshi

     గోల్కొండ నయా ఖిల్లాలో అద్భుత ఉద్యానవనం

     మొఘల్‌ గార్డెన్‌ల కంటే ముందునాటి పూదోట పునరుద్ధరణకు చర్యలు

     కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన పురావస్తు శాఖ  

సాక్షి, హైదరాబాద్‌: గురుత్వాకర్షణ శక్తితో నీటిని విరజిమ్మే ఫౌంటెన్‌.. నలువైపులా ఉద్యానవనం.. కాలిబాటలు.. అందమైన పూల చెట్లు.. చుట్టూ ఉన్న చెరువుల నుంచి నీటిని తరలించే కాలువలు.. టెర్రకోట పైపులైన్లు.. పూదోట అందాల్ని తిలకించేందుకు ప్రత్యేకంగా ఓ బారాదరి (పెవిలియన్‌).. గోల్కొండ నయా ఖిల్లాలో 450 ఏళ్ల కిందటి అద్భుత ఉద్యానవనం ప్రత్యేకతలివి. తాజ్‌మహల్‌ ముందు ఉన్న మొఘల్‌ గార్డెన్‌కు మాతృకగా భావించే ఈ ఉద్యానవనం.. కాలక్రమేణా భూగర్భంలో కలసింది. తాజాగా దానిని పునరుద్ధరించేందుకు కేంద్ర పురావస్తు శాఖ చర్యలు చేపట్టింది. 

గోల్కొండ కోటకు మరోవైపున.. 
కాకతీయుల నుంచి గోల్కొండను స్వాధీనం చేసుకున్నాక దానికి కొత్తరూపు ఇచ్చే క్రమంలో కుతుబ్‌షాహీలు నయాఖిల్లాను నిర్మించారు. అందులో అద్భుత ఉద్యానవనాన్ని నిర్మించారు. 1590 సంవత్సరం అనంతరం అసఫ్‌జాహీల పాలన మొదలయ్యాక ఉద్యానవనం కనుమరుగైంది. కొన్నేళ్ల కింద ఈ ప్రాంతంలో గోల్ఫ్‌కోర్టు నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతున్నపుడు ఉద్యానవనం ఆనవాళ్లు బయటపడ్డాయి. దీనిపై దృష్టి సారించిన కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండెంట్‌ ఆర్కియాలజిస్టులు కృష్ణయ్య, తాహెర్‌లు తవ్వకాలు జరిపి పర్షియా గార్డెన్‌ ఆనవాళ్లను వెలుగులోకి తెచ్చారు.

ప్రస్తుతం సూపరింటెండెంట్‌ ఆర్కియాలజిస్టు మిలింద్‌ కుమార్‌ చావ్లే.. ఈ ఉద్యానవనానికి పునర్వైభవం తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. పక్కనే ఉన్న శాతం చెరువు నుంచి నీటిని తీసుకొచ్చే కాలువల్లో మిగిలిన భాగాన్ని పునరుద్ధరించారు. బారాదరిని డంగు సున్నంతో బాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఏ ఇతర తవ్వకాలకు కొత్త అనుమతులు కోరకుండా.. కేవలం ఈ ఒక్కపనికే అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఇక చుట్టూ ఉన్న భూముల్లో ఇంకా నిర్మాణాలేమైనా ఉండిపోయా యా అన్న సందేహం మేరకు జీఐఎస్‌ సర్వే చేయాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను చెన్నై ఐఐటీకి అప్పగించారు. భూమిలో పూడుకుపోయిన కట్టడాలు, నాటి వస్తువులు, నాణేల వంటివి ఏవి ఉన్నా దానితో గుర్తించవచ్చని అధికారులు చెబుతున్నారు.
శిథిలమైన ఉద్యానవనం కట్టడాలు  

అతిథులు కూర్చునేందుకు నిర్మించిన బారాదరి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top