సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు మరో ప్రపంచ వారసత్వ హోదా దక్కేలా నిపుణులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. నారాయణపేట జిల్లా ముడుమాల్‌లోని దాదాపు మూడున్నర వేల ఏళ్ల నాటి ఆదిమానవుల స్మారక శిలల ప్రాంగణంలో నాటి మానవుల మనుగడకు సంబంధించిన ఆనవాళ్ల కోసం జాతీయ భూ¿ౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జల్లెడ పట్టబోతోంది. ఆధారాల జాడ తెలిసిన తర్వాత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నిపుణులు తవ్వకాలు జరిపి వాటిని వెలికితీయనున్నారు.
ఆ ఆధారాలతో ప్రపంచ వారసత్వ హోదా కోసం యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో)కు దరఖాస్తు చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రామప్ప దేవాలయానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ దక్కిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఆ ఘనత పొందిన ఏకైక కట్టడం ఇదే. ఇప్పుడు ముడుమాల్ గ్రామ శివారులో దాదాపు మూడున్నర వేల ఏళ్ల నాటి స్మారక శిలల ప్రాంగణం కూడా ఆ హోదా దక్కించుకునే ప్రయత్నంలో ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో దానికి చోటు దక్కింది. తుది జాబితాలో చోటు పొందటం ద్వారా అత్యంత ప్రతిష్టాత్మక వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ కైవసం చేసుకునేందుకు పురావస్తు శాఖ, ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపి అది ఏ కాలానికి సంబంధించిందో కచ్చితమైన కాలాన్ని తేల్చటంతోపాటు, ఆ కాలంలో ఆదిమానవులు వాడిన వస్తువుల ఆనవాళ్లను గుర్తించబోతున్నారు.
ఆ ఆధారాలే కీలకం
ముడుమాల్ ఆదిమానవుల స్మారక శిలలు (దాదాపు 15 అడుగుల ఎత్తున్న నిలువురాళ్లు) ఉన్న ప్రాంతం కేవలం నాటి మానవులు చనిపోయినప్పుడు ఏర్పాటు చేసిన స్మారక శిలల ప్రాంగణంగానే కాకుండా అప్పట్లో దాన్ని ఖగోళ పరిశోధన ప్రాంతంగా వినియోగించారని నిపుణులు గుర్తించారు. ఆ నిలువు రాళ్ల నీడల ఆధారంగా వాతావరణంలో మార్పులు, కాలాలు, తుపానులు, ఇతర ప్రకృతి విపత్తుల గుర్తింపునకు దీన్ని వాడారని తేల్చారు. అందుకు ఆధారాలు గుర్తించారు.
ఇప్పుడు వాటిని మరింత బలపరిచే ఆధారాలతోపాటు, నాటి మానవుల డీఎన్‌ఏలను కూడా విశ్లేషించి వారు ఏ తెగకు, ఏ ప్రాంతానికి చెందినవారో స్పష్టం చేయనున్నారు. అక్కడి సమాధుల్లో లభించే అలనాటి వస్తువులు, ఆయుధాలు, ఆభరణాలు, తిండి గింజల అవశేషాలను కూడా సేకరించనున్నారు. వీటి ఆధారంగా అది ఎంతటి ప్రత్యేకం, అరుదైందో తేల్చి యునెస్కోకు సమర్పించే తుది నివేదికలో పొందుపరచాలని నిర్ణయించారు. రెండు రోజుల క్రితం పురావస్తు శాఖతో అవగాహన ఒప్పందం చేసుకున్న ఎన్‌జీఆర్‌ఐ ఇందుకు సాంకేతిక సహకారాన్ని అందించనుంది.
ఆధారాలు సిద్ధం
వాతావరణంలో మార్పులను గుర్తించటంలో ఉత్తర, దక్షిణాయనాల ఆగమనం కీలకమైంది. ముడుమాల్ నిలువురాళ్ల ప్రాంగణంలో దీన్ని గుర్తించే ఏర్పాట్లు ఉన్నాయని ఇప్పటికే సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేపీరావు ఆధ్వర్యంలో నిపుణులు గుర్తించారు. డిసెంబరు 21న దక్షిణాయనం నుంచి ఉత్తరాయనంలోకి సూర్యగమనం మారటాన్ని అక్కడి కొన్ని శిలలు గుర్తిస్తున్నాయి. ఆ రోజు సూర్యోదయం, సూర్యాస్తమయంలో సరిగ్గా సూర్యుడు ఉన్న వరసలో కొన్ని శిలల నీడలు వస్తున్నాయి. అలాగే దక్షిణాయనంలోకి సూర్యుడు మారే జూన్ 21న కూడా మరో మూడు శిలలు, కొన్ని గుండ్రటి బండరాళ్లు సూర్యోదయ, సూర్యాస్తమాల్లో సరిగ్గా సూర్యుడు ఉన్న వరసలోకే ఉండటాన్ని గుర్తించారు.
డిసెంబరులో తవ్వకాలు
ఇక్కడ తవ్వకాలకు అనుమతి కోరుతూ ఇప్పటికే రాష్ట్ర పురావస్తు శాఖ ఏఎస్‌ఐకి దరఖాస్తు చేసింది. వారంరోజుల్లో అనుమతి రానుంది. ఆ వెంటనే ఎన్‌జీఆర్‌ఐ జీపీఆర్ సర్వే చేస్తుంది. భూమి పొరల్లో ఎంత లోతులో ఏయే ఆధారాలున్నాయో 3డీ మ్యాపింగ్ ద్వారా తేలుస్తుంది. మానవ, ఇతర జంతు అవశేషాలకు డీఎన్‌ఏ పరీక్ష చేయించి కాలాన్ని నిర్ధారిస్తారు. నాటి మట్టి, టెర్రకోట వస్తువులు లభిస్తే థెర్మోలూమినిసెన్స్ మెథడ్ టెస్ట్ చేసి కాలాన్ని నిర్ధారిస్తారు. నాణేలు, ఇతర మెటల్ వస్తువులు, బొగ్గులాంటివి లభిస్తే సంబంధిత పరీక్షలు చేయిస్తారు.


