‘జిహాద్’ నినాదాలు! | Assailants to make jihad slogans at Kaza Nasiruddin baba | Sakshi
Sakshi News home page

‘జిహాద్’ నినాదాలు!

Apr 5 2015 3:33 AM | Updated on Sep 2 2017 11:51 PM

అర్వపల్లి ఖాజా నసిరుద్దీన్ బాబా దర్గా నుంచి బయలుదేరిన దుండగులు అస్లాం అయూబ్, జాకీర్ బాదల్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించారు.

అర్వపల్లి/మోత్కూరు: అర్వపల్లి ఖాజా నసిరుద్దీన్ బాబా దర్గా నుంచి బయలుదేరిన దుండగులు అస్లాం అయూబ్, జాకీర్ బాదల్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించారు. అర్వపల్లి సమీపంలో పోలీసుల నుంచి తప్పించుకున్న తర్వాత అర్వపల్లి మండల కేంద్రానికి చేరుకుని గట్టిగా కేకలు వేశారు. లింగయ్య అనే వ్యక్తి దగ్గర బైక్‌ను లాక్కుని ‘అల్లాహో అక్బర్...’ అంటూ నినాదాలు చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. అలాగే ‘‘పుట్టింది ఒక్కరోజే.. చనిపోయేదీ ఒక్కరోజే’’ అంటూ హిందీలో అరుస్తూ అర్వపల్లి నుంచి వెళ్లిపోయారు. ప్రజల జోలికి పోలేదు. అనంతారంలో పెట్రోల్ పోసిన సుంకరి చంద్రమౌళిని కూడా ఏమీ అనలేదు. ‘హాఫ్ లీటర్ పెట్రోల్ డాలో’ అని మాత్రమే అన్నారని, పోలీసులు రాగానే డబ్బులివ్వకుండానే పారిపోయారని స్థానికులంటున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో మాత్రం దుండగులు ‘జీహాద్’ అని నినాదాలు చేసినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం దీన్ని నిర్ధారించడం లేదు.  
 
 తుపాకీతో బెదిరించారు
 పని మీద ఉదయం ఆరుకే డిస్కవరి బైక్‌పై అర్వపల్లికి వచ్చాను. రోడ్డెక్కగానే ఇద్దరు నా దగ్గరికొచ్చారు. నేను బైక్‌పైనే ఉన్నా. వారి చేతిలో తుపాకులున్నాయి. నేను ఎవరో అనుకున్నా. దగ్గరికి వచ్చి ‘బైక్ దేవ్’ అని తుపాకీని నా తలపై గురిపెట్టారు. నాకు నోటమాట రాలేదు. నన్ను చంపేస్తారేమోనన్న భయంతో బైక్ ఇచ్చేశాను. వారు ఆ బైక్‌పై పారిపోయారు.
 - బింగి లింగమల్లు, జాజిరెడ్డిగూడెం, అర్వపల్లి మండలం
 
 ఒక్క క్షణంలో ప్రాణం నిలిచింది..
 జానకీపురం ఎన్‌కౌంటర్‌లో ఎదురుకాల్పులు జరుగుతున్నప్పుడు సీఐ బాలగంగిరెడ్డి డ్రైవర్‌కు ముష్కరులు తుపాకీ ఎక్కుపెట్టారు. తుపాకీ ఇవ్వకుంటే కాల్చేస్తామన్నారని జీప్ నడిపిన హోంగార్డు శీను వెల్లడించారు. ‘‘తుపాకీ ఇవ్వాలంటూ నా పొట్టపై రెండుసార్లు తుపాకీ ఎక్కుపెట్టి, చంపేస్తామని హిందీలో బెదిరించారు. నా దగ్గర తుపాకీ లేదని చెప్పాను. సీఐ చాకచక్యంగా కాల్చడంతో బతికి బయటపడ్డాను’’ అని శీను చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement