జాతీయ హోదాకు కృషి

Arjun Munda Visits Medaram Jatara - Sakshi

మేడారం అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తా..

కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్‌ ముండా హామీ

జాతర ఏర్పాట్లు బాగున్నాయని కితాబు

సాక్షి, భూపాలపల్లి : మేడారం మహాజాతరకు జాతీయ హోదా కల్పించాలనే అంశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్‌ముండా తెలిపారు. ములుగు జిల్లాలోని మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మలను శనివారం ఆయన దర్శించుకున్నారు. తులాభారంతో నిలువెత్తు (75 కిలోలు) బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించారు. ఈ సందర్భంగా మేడారానికి జాతీయ హోదా కల్పించడంతో పాటు అభివృద్ధికి నిధులు, గురుకులాలు కేటాయించాలని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు కేంద్ర మంత్రికి విన్నవించారు. దీంతో స్పందించిన ఆయన.. జాతర విశిష్టతను తెలియజేసి జాతీయ హోదా కల్పించే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

గిరిజనులు ఎంతో కాలంగా కోరుకుంటున్న జాతీయ హోదా దక్కుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మేడారంలో వనదేవతలను దర్శించుకోవడం ఆనందంగా ఉందని, వచ్చే జాతరకు తప్పకుండా వస్తానని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గిరిజనులకు ఆస్తులు లేకపోయినా సంతోషంగా బెల్లాన్ని బంగారంగా అమ్మవార్లకు సమర్పించే అంశం గిరిజన పురాతన సంప్రదాయాలకు నిదర్శనమన్నారు. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి మరువలేనిదని కితాబిచ్చారు. ఆయన వెంట మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క ఉన్నారు. కాగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ సేవలందించిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. జాతర సమయంలో 36 వేల ట్రిప్పుల ద్వారా 12 లక్షల మందిని గమ్యస్థానాలకు తరలించినట్లు వెల్లడించారు.

జాతర ముగియడంతో తిరుగు పయనమవుతున్న భక్తులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top