త్వరలో డీసీసీల ప్రకటన

Appoints The DCC President In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అన్ని జిల్లాలకు జిల్లా కాంగ్రెస్‌ కమిటీలను ప్రకటించాలని ఏఐసీసీ నిర్ణయించింది. 2016, అక్టోబర్‌ 11న రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు మినహా అన్ని పార్టీలు కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు కమిటీలను ప్రకటించాయి. కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు అనుగుణంగా ఇప్పటికే వైఎస్సార్‌ సీపీ, బీజేపీ, టీడీపీ జిల్లా అధ్యక్షులను ప్రకటించగా, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలు ప్రధాన కార్యదర్శులను నియమించాయి. ఇటీవల టీపీïసీసీ సైతం కొత్త జిల్లాల వారీగా డీసీసీలను ఏర్పాటు చేయాలని ఏఐసీసీకి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లట్‌ అదేశాలు జారీ చేశారు.

వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలకు కొత్తగా డీసీసీ అధ్యక్షులను నియమించనున్నారు. నూతన జిల్లాలు ఏర్పాటైనప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి జిల్లా కమిటీలతోనే రాజకీయాలు నిర్వహించింది. రాష్ట్రంలో 31  జిల్లాలకు విడివిడిగా కమిటీలను నియమిస్తే పార్టీ నేతలు, కార్యకర్తల్లో మరింత ఉత్సాహం పెరిగి పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకవెళ్లే అవకాశం కలుగుతుందని అధిష్టానం భావించినట్లు తెలిసింది. గత ఏడాదే జిల్లాల వారీగా నూతన కమిటీలు ప్రకటించాలని ఏఐసీసీకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రతిపాదనలు పంపారు. కానీ అప్పుడు పాత జిల్లాల వారిగానే నూతన కమిటీలను ప్రకటించారు.

పదవుల కోసం ప్రదక్షిణలు
డీసీసీ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు పీసీసీ నేతల చుట్టూ, జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుల చుట్టూ ఆశావహులు తిరుగుతున్నారు. జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకులు సైతం తమ అనుచరులకు డీసీసీ అధ్యక్ష పదవులు ఇప్పించుకోవాలని పావులు కదుపుతున్నట్లు సమాచారం. రాహుల్‌గాంధీ హైదరాబాద్‌ పర్యటన తర్వాత డీసీసీ అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది.
 
సార్వత్రిక ఎన్నికలే లక్ష్యం..
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలపైనే కాంగ్రెస్‌ పార్టీ ప్రధానంగా దృష్టి సారించింది. పార్టీ కార్యక్రమాలను ఉధృతం చేసి ప్రజలకు మరింత చేరువ కావడమే లక్ష్యంగా నాయకుల సంఖ్యను పెంచుతున్నారు. రాష్ట్రానికి ఇప్పటికే ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులకు పార్లమెంట్‌ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఇటీవల వరంగల్, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల నాయకులతో సమావేశాలు కూడా నిర్వహించారు. టికెట్లు ఆశిస్తున్న వారితో ప్రత్యేకంగా మాట్లాడారు.
 
జయశంకర్‌ భూపాలపల్లి 
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, ప్రభుత్వ  మాజీ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి, ఏఐసీసీ మహిళ ప్రధాన కార్యదర్శి సీతక్క, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కీలకంగా ఉన్నారు. వీరంతా తమ వర్గానికి చెందిన వారికి డీసీసీ అధ్యక్ష పదవి ఇప్పించేందుకు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో డీసీసీకి ఐదుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పీసీసీ సభ్యుడిగా పనిచేస్తున్న సల్లూరి సమ్మయ్య, గండ్ర జ్యోతి, కాటారం నుంచి మంత్రి మల్లయ్య, గణపురం నుంచి పొలుసాని లక్ష్మీనరసింగారావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

మహబూబాబాద్‌.. 
కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత 2016, అక్టోబర్‌ 20న మహబూబాబాద్‌ జిల్లాలో  రైతు గర్జన కార్యక్రమానికి ముందు మహబూబాబాద్‌ డీసీసీ అధ్యక్షుడిగా జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డిని టీపీసీసీ ప్రకటించినప్పటికీ ఏఐసీసీ నుంచి అనుమతి రాలేదు. డీసీసీ అధ్యక్షుడిగా భరత్‌చందర్‌రెడ్డిని ప్రకటిస్తేనే రైతుగర్జన సభ విజయవంతం చేస్తామని ఆయన అనుచరులు ఆందోళన చేశారని తెలిసింది. ఆయన ప్రస్తుతం పీసీసీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రెండుమార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యరు. భరత్‌చందర్‌ రెడ్డి తండ్రి జెన్నారెడ్డి జనార్దన్‌ రెడ్డి ఐదుసార్లు మానుకోట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం మహబూబాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా భరత్‌ చందర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. త్వరలో ప్రకటించే డీసీసీ అధ్యక్ష పదవి భరత్‌చందర్‌ రెడ్డికే దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది.
 
జనగామ..
జనగామ జిల్లా నుంచి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి పార్టీలో సీనియర్లుగా ఉన్నారు. జనగామ డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఐదుగురు పోటీ పడుతున్నట్లు తెలిసింది. జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి చెంచారపు శ్రీనివాస్‌ రెడ్డి, మునిసిపల్‌ మాజీ చైర్మన్లు వేమళ్ల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, స్టేషన్‌ ఘన్‌పూర్‌ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బేతి జయపాల్‌ రెడ్డి, పీసీసీ సభ్యుడు కోతి ఉప్పలయ్య బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆశీస్సులు ఎవరికి ఉంటే వారికే పదవి దక్కనున్నట్లు సమాచారం.

వరంగల్‌ రూరల్‌..
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందినవారే. ఏఐసీసీ సభ్యుడిగా సైతం మాధవరెడ్డి కొనసాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, ఏఐసీసీ ఓబీసీ సెల్‌ కార్యదర్శి కత్తి వెంకటస్వామి, బక్క జడ్సన్‌ సీనియర్లుగా కొనసాగుతున్నారు. డీసీసీ అధ్యక్షుడి రేసులో  పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఇనుగాల వెంకట్రాంరెడ్డి ఉన్నట్లు ప్రధానంగా వినిపిస్తోంది. మాధవరెడ్డి ఎవరి పేరును సూచిస్తే వారి పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వరంగల్‌ అర్బన్‌..
ప్రస్తుతం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న నాయిని రాజేందర్‌రెడ్డి వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో తిరిగి అర్బన్‌ అధ్యక్షుడిగా తననే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ, వరదరాజేశ్వర్‌రావు దంపతులతోపాటు పార్టీలో కొత్తగా చేరిన వేం నరేందర్‌ రెడ్డి కూడా ఈ పదవిపై కన్నేసినట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top