పీఠమెక్కేదెవరో? | Appoints the DCC President In Khammam | Sakshi
Sakshi News home page

పీఠమెక్కేదెవరో?

Aug 12 2018 7:40 AM | Updated on Mar 18 2019 9:02 PM

Appoints the DCC President In Khammam - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందోననేది ఉత్కంఠ రేపుతోంది. అధ్యక్షుడి ఎంపిక ఓ పట్టాన తేలకపోవడం.. ఒకరి పేరు ప్రస్తావిస్తే.. మరొకరు వ్యతిరేకించడం.. ఇంకొకరు ససేమిరా అనడం..  ఇక ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలు అధిష్టానాన్ని కోరడంతో చివరకు ఢిల్లీకి చేరింది. వర్గ రాజకీయాలకు ఆలవాలం గా ఉన్న జిల్లా కాంగ్రెస్‌లో అధ్యక్షుడిని ఎంపిక చేయ డం ఆది నుంచి అధిష్టానానికి తలకు మించిన భారమే అయింది. గతంలోనూ డీసీసీ అధ్యక్షుడిని నియమించడానికి అధిష్టానం పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి రావడంతోపాటు పార్టీలోని వర్గ నేతలను ఒప్పించడానికి కష్టపడాల్సి వచ్చింది.

దివంగత నేత అయితం సత్యం మరణించడంతో ఖాళీ అయిన ఈ పదవి ఎంపిక వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ని ఏకతాటిపై నడిపించే నేత కోసం పార్టీ అధిష్టానం అనేక నెలలుగా అన్వేషిస్తోంది. అధిష్టానం దృష్టిలో క్లీన్‌చిట్‌ ఇమేజ్‌ ఉన్న పలువురు నేతలున్నా.. వారిని సైతం జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ వర్గ నేతలు ససేమిరా అనడంతో అధ్యక్ష పదవి ఎంపిక వ్యవహారం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. గత నెలలో జిల్లాలో పర్యటించిన ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్‌ పార్టీకి చెందిన నాయకులతో భేటీ అయినప్పుడు డీసీసీ అధ్యక్ష పదవిని సత్వరం భర్తీ చేయాలన్న డిమాండ్‌ ముందుకొచ్చింది.

అయితే ఈ పదవి కోసం ఎవరికి వారే ప్రయత్నించడంతో అధ్యక్ష పదవి ఆశించే వారి సంఖ్య చాంతాడులా మారింది. జిల్లాలో ప్రధానంగా రేణుకాచౌదరి, భట్టి విక్రమార్క, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్‌ వర్గాల మధ్య ఏకాభిప్రా యం రాకపోవడంతో ఎవరిని నియమించాలనే అంశం పై మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. డీసీసీ అధ్యక్షుడిగా ఒక దశలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌కు అవకాశం ఇస్తారని, దీనిపై రాష్ట్ర పార్టీ నేతలతోపాటు జిల్లాకు చెందిన ముఖ్యులూ సానుకూలంగా ఉన్నారనే ప్రచారం జరిగింది. దీంతో ఆయనకే పదవి లభిస్తుందని శ్రేణులు భావించాయి. కాగా, జిల్లాకు చెందిన ఓ సీనియర్‌ నేత ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడం, అందరికీ ఆమోదమైన వారిని నియమించాలని కోరడంతో ఇది రెండునెలలుగా వాయిదా పడుతోంది.
 
అధిష్టానానికి సలీం నివేదిక..
జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్‌ పార్టీ పరిస్థితులు, వర్గపోరు, అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంపై అధిష్టానానికి నివేదిక సమర్పించినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా కొత్త జిల్లాలకు సైతం కాంగ్రెస్‌ అధ్యక్షులను నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో కొత్తగూడెం జిల్లాలోనూ ఈ పదవిని ఆశించే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న వారిలో రేణుక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా నాయకులు దిరిశాల భద్రయ్య, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మానుకొండ రాధాకిషోర్, మేళం శ్రీనివాసయాదవ్, నాగండ్ల దీపక్‌చౌదరి, నాగు బండి రాంబాబు రంగంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక బీసీలకు ఈ పదవిని కేటాయించాలని కోరుతున్న కొత్తా సీతారాములు, వడ్డెబోయిన నరసింహారావు, కట్ల రంగారావు తదితరులు ఈ పదవి కోసం పోటీ పడుతుండగా.. ఎస్టీల నుంచి వైరాకు చెందిన రాములు నాయక్, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రాందాస్‌నాయక్‌ తదితరులు రంగంలో ఉన్నట్లు ప్రచారం జరగుతోంది. ఎస్సీల నుంచి సంభాని చంద్రశేఖర్‌ పేరు ప్రచారంలో ఉంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైతం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి హోరాహోరీగా ప్రయత్నాలు జరుగుతున్నా యి.

రేణుకా చౌదరికి సన్నిహితుడిగా పేరున్న ఎడవల్లి కృష్ణ, మాజీ ఎమ్మెల్యే, పినపాకకు చెందిన రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కుమా రుడు రాఘవ ఈ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై సీరియస్‌గా దృష్టి సారించిన అధిష్టానం వారం పది రోజుల్లో ముఖ్య నేతలతో సంప్రదించి ఒక పేరు ఖరారు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి నే తలు అంగీకరించకుంటే అధిష్టానమే నిర్ణయం తీసుకు ని ఈ నెలాఖరులోగా అధ్యక్షుడి పేరు ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement